అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులు ఇవి..!
posted on Jan 2, 2026 @ 4:51PM
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోతే అది జీవితం మీద చాలా గట్టి దెబ్బ అవుతుంది. కానీ ఈ విషయంలో అమ్మాయిలకు ఒక అవకాశం ఉంది. అదే ముందు జాగ్రత్త.. ఏ అబ్బాయి అయినా అమ్మాయిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఆ అబ్బాయిలు చేసే పనులే వారిని పట్టిస్తాయి. వీటిని అర్థం చేసుకుంటే అమ్మాయిలు జాగ్రత్తపడి మోసగాళ్ల బారినుండి తప్పించుకోవచ్చు. ఇంతకీ.. అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులేంటో తెలుసుకుంటే..
ప్రవర్తన..
అబ్బాయి అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో ఉంటే వెంటనే కనిపించే మొదటి మార్పు.. ప్రవర్తన మారిపోవడం. అబ్బాయి ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మునుపటిలాగా ప్రేమించకపోవడం, శ్రద్దగా ఉండకపోవడం చేస్తారు.
అవసరాలు..
కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించే అబ్బాయి మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి ఇతరుల అవసరాల గురించి, వారి భావాల గురించి అస్సలు పట్టదు. వారికి కావాల్సింది దక్కనప్పుడు వారు సింపుల్ గా దూరం పెడతారు.
నిజాలు..
మొదట చిన్న చిన్న విషయాలు కూడా షేర్ చేసుకున్న వ్యక్తి ఆ తరువాత ఏ విషయాలు చెప్పకుండా గోప్యత మెయింటైన్ చేస్తుంటే, పైగా ఏదైనా విషయం అడిగినప్పుడు నిజం చెప్పకుండా అబద్దాలు చెబుతుంటే అలాంటి వారిని నమ్మడం కష్టం.
సమయం..
ప్రేమలో ఉన్నవారు, ప్రేమిస్తున్న వారు.. తమ పార్ట్నర్ కోసం తప్పకుండా ఏదో ఒక విధంగా సమయాన్ని కేటాయిస్తారు. వారు ఎంత బిజీ అయినా సరే.. సమయాన్ని కేటాయిస్తారు. కానీ మోసం చేసే ఉద్దేశ్యం ఉన్నవారు ఏదో ఒక సాకు చెబుతుంటారు. అలాంటి వారికి బంధం పట్ల సీరియస్ నెస్ ఉండదు.
మాటలు.. చేష్టలు..
మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిల మాటల్లోనూ, చేష్టలలోనూ చాలా వ్యత్యాసం ఉంటుంది. మాటల్లో చాలా తియ్యగా మాట్లాడతారు. గొప్పలు చెబుతారు, తాము చాలా అత్యుత్తమం అనేలా నమ్మిస్తారు. కానీ ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి పూర్తీగా సీన్ మారిపోతుంది. తాము చెప్పిందే చేయాలన్నట్టు డిమాండ్ చేస్తారు. లేకపోతే నిర్లక్ష్యం చూపిస్తారు.
సహాయం..
మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిలు పూర్తీగా స్వార్థంతో ఉంటారు. అమ్మాయి ఏదైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేయకపోవడం లేదా తప్పించుకున్నా అతను అమ్మాయిని కేవలం వాడుకుంటున్నాడని అర్థం.
స్వప్రయోజనం..
అబ్బాయి డబ్బు లేదా ఏదైనా సహాయం వంటి వాటికోసం అమ్మాయిని ఒత్తిడి చేసి మరీ ఇబ్బంది పెడుతుంటే అతను మోసం చేసే ఉద్దేశం ఉన్నవాడని అర్థం. నిజంగా ప్రేమించే అబ్బాయిలు తమ వల్ల తను ప్రేమించే అమ్మాయికి ఎలాంటి కష్టం రాకూడదు అనుకుంటారు.
నియంత్రణ..
అమ్మాయి తన కుటుంబానికి, తన సన్నిహితులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసే అబ్బాయిలు ఎప్పుడూ నిజమైన ప్రేమ కలిగి ఉండరు. అమ్మాయిని నియంత్రణలో ఉంచాలని అనుకునేవారు ఆమెను తమకు అనుగుణంగా వాడుకుంటారు.
బాధ్యత..
ప్రతి అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయి పట్ల బాధ్యత ఉంటుంది. కానీ అతను అమ్మాయి పట్ల బాధ్యతతో ఉండకుండా కేవలం తన సొంత సంతోషం గురించి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటే అతను అమ్మాయి పట్ల సీరియస్ నెస్ లేనట్టే..
ఎమోషన్స్..
అమ్మాయిలకు సాధారణంగానే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే అబ్బాయి అమ్మాయి ఎమోషన్స్ ను పట్టించుకోకుండా , అర్థం చేసుకోకుండా ఉంటే అతను సరైన పార్ట్నర్ కాడని అర్థం.అలాంటి వాడితో ఏ అమ్మాయి సంతోషంగా ఉండలేదు.
- రూపశ్రీ