Read more!

ఆలోచనా మార్పులు సబబేనా??

మనిషి జీవితం ఒక నది లాంటిది. నది ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా దారి సహకరించకపోతే అది తన దారి మార్చుకుని ప్రయాణం చేస్తుంది. అలాగే మనిషి కూడా తన దారి మార్చుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ దారి మారడాన్ని ఆలోచనల్లో మార్పుగా కూడా చెప్పవచ్చు. అయితే చాలామంది ఇలా ఆలోచనలు మారిపోవడం గూర్చి మాట్లాడుతూ అలా ఎలా మారిపోతారు మనుషులు అని అంటూ ఉంటారు. ఇలా ఆలోచనలు మార్చుకోవడం, వాటి ద్వారా జీవితంలోనూ మార్పు చోటుచేసుకోవడం సరైనదేనా అనే ప్రశ్న వేసుకుంటూ ఎంతో మంది ఒత్తిడికి లోనవుతూ ఉంటారు కూడా. మరి ఆలోచనల మార్పు సబబేనా??


ఆలోచనా…. మూలం!!


ప్రతి ఆలోచన వెనుక కొన్ని పరిస్థితుల ప్రభావాలు ఉంటాయి. ఆ ప్రభావాలే మనిషి మార్పుకు కారణం అవుతాయి. అలా మార్పులు జరుగుతూ ఉన్నపుడు జీవితము మార్పుకు లోనవుతుంది. కానీ మనుషులు అనేస్తారు ఎలా మారిపోతారు వీళ్ళు అని. అందరికీ మార్పు ఉండకూడదు, ఎప్పుడూ తమనే అంటిపెట్టుకుని ఉండాలనే ఆలోచన ఉండటం సహజమే కానీ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వాస్తవ జీవితంలో  ఎదురవుతున్న ఎన్నో సందర్భాలను డీల్ చెయ్యాలి అంటే ఆలోచనలు, ఆ ఆలోచనల ద్వారా కలిగే మార్పులు ఎంతో అవసరం అని అనిపిస్తుంది. 


వాస్తవాలు…. విస్తారాలు!!


పైన చెప్పుకున్నట్టు వాస్తవ జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సందర్భాలను డీల్ చేయాలంటే మనిషి ఒకే చోట ఆగిపోకూడదు. గడియారంలో ముల్లు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగే మనిషి జీవితంలో ముందుకు పోతూనే ఉండాలి. లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ తెలియని ఒక అమాయక జీవిగా, ఎన్నో అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిగా మిగిలిపోతారు.  అందుకనే వాస్తవ జీవితంలో మనిషి ఏదో ఒకరకంగా ఎదగాలి అంటే ఆలోచనాపరమైన మార్పులు తప్పనిసరి అనిపిస్తుంది.


అంగీకారం…. అవసరం!!


జీవితంలో ఎదురయ్యే మార్పులను అంగీకరించగలిగితే చాలా వరకు జీవితం ఎంతో ఆహ్లాదంగానే ఉంటుంది. ఈ అంగీకరించడం అనేది పూర్తిగా మనసుపై ఆధారపడినప్పటికి అది పూర్తిగా భౌతిక పరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తల్లి బిడ్డను కన్నప్పుడు మూరెడు కూడా ఉండడు, తరువాత శారీరకంగా ఎదుగుతూ అయిదు నుండి ఆరడుగుల(కొందరు ఇంకా ఎక్కువ, తక్కువ ఎత్తు ఉంటారనుకోండి) ఎత్తయ్యి, చివరికి వివాహ బంధం ద్వారా మరొక వ్యక్తికి జీవిత భాగస్వామి అవుతారు. ఎంతో మార్పుకు లోనైన మనిషి ప్రయాణం ఎన్నో సంఘటనలతో  నిండిపోయి ఉంటుంది. ఆ సంఘటనలలో ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించామా?? ఈ ప్రశ్న వేసుకుంటే సంఘటనను బట్టి ఆలోచన, ఆలోచనను బట్టి నిర్ణయాలు, నిర్ణయాలను బట్టి మార్పులు, మార్పులను బట్టి భౌతిక జీవితంలో తగ్గే అలజడులు అన్నీ ఒక సైకిల్ లాగా ఉంటాయి. అంతేకానీ ఏ సమస్య వచ్చినా ఒకే నిర్ణయం తీసుకోరు కదా!! ఆ విషయాన్ని గ్రహించగిలితే సంఘటనలను బట్టి, అప్పటి అవసరాలను బట్టి మనిషి ఆలోచనా పరమైన మార్పు చేయడం నేరమేమి కాదు. 


దృష్టి కోణం!!


చూసే విధానంలోనే అంతా ఉందని అందరూ అంటుంటారు. ఇది ముమ్మాటికీ నిజం. మన ఆత్మీయులకో, స్నేహితులకో ఏదైనా విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు వాస్తవంగా ఆలోచించమని, నిజాన్ని గ్రహించమని, పరిస్థితులను అంగీకరించమని చెబుతుంటాము. అయితే అలా చెప్పినవాళ్ళు అలాంటి పరిస్థితులు ఏవైనా తమకు ఎదురైతే మాత్రం వాటిని అంత సులువుగా ఎదుర్కోలేరు. కాబట్టి దృష్టి కోణం మాత్రమే కాదు, ఒకానొక స్పోర్టివ్ నెస్ మనిషి జీవితంలో ఉండాలి. అలా ఉంటే అన్నిటినీ హ్యాండిల్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఎదుటివారు మూవ్ అయిపోవడాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు కూడా.


కాబట్టి ఆలోచనా పరమైన మార్పులు సబబేనా అంటే సబబే అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. కొన్ని నిజాలు నచ్చకపోవచ్చు కానీ ఎ ఏమి చేస్తాం అబద్ధంతో బతికితే అవి భరించరాని బాధల కోటల్ని కట్టేస్తాయి.


                                                                                                                ◆ వెంకటేష్ పువ్వాడ.