Read more!

జనారణ్యంలో అడవి మృగాల ఆర్తనాదాలు!! 

మనుషులు నివసిస్తున్న ఈ పట్టణాలు, గ్రామాలు వగైరాలను జనారణ్యం అని పిలుస్తుంటారు  అడవిలో ఉండేది మృగాలు అది మృగాల అరణ్యం అయితే, మనుషులు నివసిస్తున్న ఈ ప్రాంతాలను జనారణ్యం అంటుంటారు. మనుషులు కానీ  జంతువులు కానీ నివాస ప్రాంతాలను బట్టి జీవితాన్ని కొనసాగించడం పరిపాటి. అయితే మనుషుల్లో కూడా కాస్త మార్పులు వచ్చి మృగ లక్షణాలు పెరుగుతూ, తను అనుకున్నది సాధించడం అనే ఒక అహంకారపు గుణాన్ని బాగా పెంపొందించుకున్నారు. ఇలాంటి మనుషులను చాలామంది జంతువులతో పోలిక పెట్టి మాట్లాడుతూ ఉంటారు కూడా. 

ఇక ఈ మనుషులు చాలా తెలివైనోళ్లు, తను ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని క్రమంగా అక్రమించుకుంటూ పోతున్నాడు. వాటికి తగ్గట్టు చట్టాలను రూపొందించుకుంటాడు, తరువాత అక్రమాలు చేసి డబ్బు సమకూర్చుకుంటాడు. ఈ భూమండలంలో భూమి, నీరు, అడవులు ఉండాల్సిన శాతంలో క్రమంగా అడవులను భూమిగా మారుస్తూ పోతున్నాడు. ఫలితంగా అడవుల శాతం మాత్రమే కాదు, నీతి శాతం ముఖ్యంగా భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ అడవులలో నివసిస్తున్న అడవి జంతువుల ఆవేదన ఎవరూ అర్థం చేసుకోలేనిది. అడుగు భూమిని ఎవడైనా ఆక్రమిస్తే ఎన్నో గొడవలు, పంచాయితీలు, కోర్ట్ కేసులు ఎంతో తతంగం చేసే మనుషులు జంతువుల ప్రపంచం అయిన అడవులను అక్రమిస్తూ తిరిగి వాటినే మళ్లీ శిక్షకు గురిచేస్తూ ఉంటారు.

అటవీ  విసీర్ణం తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న జంతువులకు ఆహారం నీరు కొరత ఏర్పడి చచ్చిపోతున్నాయి. మరికొన్ని మనుషుల చేతుల్లోనే అదృశ్యమవుతున్నాయి. అలాంటి చిన్న జంతువులను ఆహారంగా వేటాడే పెద్దజంతువులు ఈ చిన్న జంతువుల సంఖ్య తగ్గిపోవడమూ, నీటి కొరస్థ ఏర్పడటం వల్ల దిక్కుతోచని స్థితిలో అటవీ  మార్గం నుండి జనవాసాల మధ్యకు వస్తున్నాయి.  కానీ మనిషి ఏమి చేస్తాడు. అలా జనాల మధ్యకు వచ్చిన మృగాలను  కొట్టడమో, గాయపరచడమో చేస్తాడు. ముఖ్యంగా పాములు  కనబడితే 90% మంది వాటిని వెంటనే చంపేయడం జరుగుతోంది. పులులు, సింహాలు వంటి పెద్ద మృగాలంటే మనుషులు భయపడతారు కాబట్టి అటవీ శాఖ వాళ్లకు సమాచారం ఇచ్చి వాటిని పట్టిస్తుంటారు. ఇక గమనించదగ్గ విషయం ఏమిటంటే తన కంటే తక్కువ స్థాయి ఉన్న జంతువులను అయినా ప్రాణులను అయినా మనిషి నిరంతరం అణిచివేస్తూనే ఉంటడం అది జంతువులే కానక్కర్లేదు కనీసం మనుషులు అయిన తమకంటే తక్కువ స్థాయి ఉన్నవాళ్లను అణిచివేయడం సహజం. 

కానీ ఏ ప్రాణి ప్రాధాన్యత, ఏ ప్రాణి జీవించే హక్కు దానిదే అని గుర్తించి దేని ప్రపంచాన్ని దానికి వదిలేయడం ఉత్తమం కదా!!

కానీ స్వార్థంలోనూ, అభివృద్ధిలోనూ ఉన్న మనుషులకు వాటి ప్రపంచాన్ని అక్రమించుకోవడం పెద్ద తప్పుగా అస్సలు అనిపించదు. ఫలితంగా ప్రతిరోజూ పేపర్లలోనూ, టీవీ లలోనూ వార్తలు చూస్తూనే ఉంటాము. మనుషుల మధ్యకు సింహం లేదా పులి అని. పులి హల్చల్ అని, సింహం వీరవిహారం అని. కానీ వాటి కోణంలో వాటి మనసుతో ఆలోచిస్తే తిండి, నీళ్లు దొరక్క మనుషుల మధ్యకు వచ్చి మనుషులు పెడుతున్న హింసకు గురవుతూ ఆ గందరగోళంలో ఎవరినో ఒకరిని కరవడమో, వెంబడించడమో చేస్తాయి. ఆ మాత్రం అర్ధం చేసుకోలేని మనుషులు ఆ దేవుడు ఇచ్చిన విచక్షణా జ్ఞానాన్ని ఏమి చేస్తున్నట్టు. 

మనుషులలో మృగాలుగా మారిపోతూ మృగాలను హింసిస్తున్నట్టా?? కొత్త చట్టాలు తెచ్చుకుని అంతటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలనే మూర్ఖపు ఆలోచనలో ఉన్నట్టా??

◆ వెంకటేష్ పువ్వాడ