Read more!

పుస్తకాల పండుగ వచ్చేసిందోచ్!!

ఇదేంటిది బడిలో పిల్లలకు సెలవు ఇచ్చినపుడు ఎగిరి గంతేసి సంబరపడినట్టు అనుకుంటారు చాలామంది! కానీ ఆ సంతోషం ఎలాంటిదో పుస్తక ప్రియులకే బాగా తెలుస్తుంది.  హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలు, ఖైరతాబాద్ గణేష్ రాజసం, పొంగలి కుండల బోనాలను నెత్తిన పెట్టుకుని తన్మయత్వమైపోయే బోనాల జాతర, ఒక్కేసి పువ్వేసి సందామామా ఒక్కజాము ఆయె సందామామా అనుకుంటూ పువ్వులో తేలే తెలంగాణ బతుకమ్మ పండుగ. ఇలా వీటితో సమానంగా హైదరాబాద్ లో ప్రాధాన్యత సంతరించుకున్నది పుస్తకాల ప్రదర్శన.

1985 సంవత్సరంలో మొదటిసారిగా జరిగిన ఈ పుస్తక ప్రదర్శన ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈనాడు 34 వ సారి అందరినీ కనువిందు చేయబోతోంది. కాగితాల రెక్కలు కట్టుకుని ఎక్కడెక్కడి నుండో ఎగిరొచ్చి అందరికీ ఎన్నెన్నో కథలు, కవితలు, చరిత్ర సాక్ష్యాలు, ఆత్మకథలు, సామాజిక సమస్యలు, సమాధి అయిపోయిన నిజాలు ఇట్లా ఎన్నింటినో తనలో నింపుకుని, తనకోసం లక్షల మంది వస్తున్నట్టే, లక్షల మంది కోసం పుస్తకమూ పతంగమంత మనసుతో వచ్చి వాలిపోనుంది.

ఒకటా… రెండా… మూడా….

ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసే దుకాణాల సంఖ్య మెల్లిగా పెరుగుతూ వస్తోంది. చివరి ఏడాది కరోనా కారణంగా పుస్తకప్రదర్శన అసలు జరలేదు. అందుకే  ఈసారి కరోనాను దృష్టిలో ఉంచుకుని నిబంధనల మధ్య, నియమాల మధ్య ఎంతో జాగ్రత్తగా నిర్వహించబోతున్నారు. సుమారు 250 పుస్తకాల దుకాణాలు ఏర్పాటు కానున్నాయని సమాచారం. అంటే వందల కొద్దీ పుస్తకాల దుకాణాలు, లక్షలకొద్దీ పుస్తకాల పలకరింపులు.

ప్రముఖులు, రచయితల మెరుపులు!!

ప్రజలలో పుస్తకాల పట్ల ఆసక్తిని పెంచి పాఠకాదరణను పెంపొందించే దిశగా చేస్తున్న ప్రయత్నమే ఇది. ప్రముఖ రచయితల పుస్తకాలు పుస్తక పడదర్శనలో ఉండటమే కాదు బోలెడు మంది రచయితలు కూడా ఆ పుస్తక దుకాణాల దగ్గర ఉంటూ తమ అభిమాన పాఠకులను అంతే అభిమానంగా పలకరిస్తూ ఉంటారు. ఇంకా ఎందరో సెలబ్రిటీలు కూడా పుస్తక ప్రదర్శనకు విచ్చేసి పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట చార్మినార్, బేగం బజార్ ఎంత రద్దీగా సందడిగా ఉంటుందో అంతకంటే సందడి పుస్తక ప్రదర్శన జరిగినన్ని రోజులు ఉంటుంది .

కొంచం ఇష్టంగా మరికొంచెం జాగ్రత్తగా!!

ఏడాది విరామం తరువాత మళ్ళీ పుస్తక ప్రదర్శన ఎలా ఉండబోతోంది అంటే చాలా రోజుల తరువాత తమ స్నేహితులను కలుసుకోవడానికి ఎంత ఉవ్విళ్లూరుతారో అంత సంతోషంగా ఉంది ప్రస్తుతం భాగ్యనగరం. అయితే ఆ సంతోషంలో జాగ్రత్తలు మరచిపోకూడదు. ఎవరి ప్రాథమిక కర్తవ్యం వారిది అన్నట్టుగా ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. మరియు శానిటైజర్ వెంట ఉంచుకోవాలి. ఇంకా వీలైనంత వరకు గుంపులు గుంపులుగా ఉన్న చోటికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటే అదే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.

ప్లానింగ్ తో హ్యాపీ హ్యాపీగా!!

పెద్ద అరటి ఆకు, దాని నిండా విందు భోజనం. అందులో ఎన్నో అద్భుతమైన షడ్రుచులు. పొట్ట ఏమో చిన్నది. ఏది తినాలో అర్థం కాదు. పుస్తకాలు అంటే ఇష్టపడే వాళ్లకు కూడా సేమ్ ఇదే సమస్య ఎదురవుతుంది పుస్తక ప్రదర్శనలో. బోలెడు పుస్తకాలు ఎదురుగా ఉంటాయి, అన్నీ కొనాలని అనిపిస్తుంది.  చేతిలో బడ్జెట్ కూడా వెక్కిరిస్తూ ఉంటుంది. కొందరి సలహాలు, మరికొందరి అభిప్రాయాలతో బుక్స్ కొనేసి ఆ తరువాత అయ్యో వేరే తీసుకుని ఉంటే బాగుండేమో అనే పరిస్థితిలోకి వెళ్లకుండా హాయిగా హ్యాపీగా ఒక చిట్టా రాసుకుని వెళ్లి తీసుకోవడం మంచిది. పర్లేదు డబ్బుదేముంది అనుకునేవాళ్ళు అయితే లక్షణంగా ప్రతి స్టాల్ తిరిగి విలక్షణమైన పుస్తకాలను ఎంచుకోవచ్చు.

అయితే నేటి డిజిటల్ యుగంలో పిడిఎఫ్ ల రూపంలో ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చినా పుస్తకాన్ని  చేత్తో పట్టుకుని, ప్రతి పేజీని స్పర్శిస్తూ అక్షరాలను మనసులోకి ఒంపుకునే ఫీల్ వేరే ఏ విధంగానూ రాదన్నది అందరూ ఒప్పుకునే విషయం. గుండె జేబులలో(మనసులలో) పదిలంగా పది కాలాల పాటు పుస్తకాన్ని నిలబెట్టడానికి, సాహిత్య సమీరాలను ఎప్పుడూ వీచేలా చేయడానికి పుస్తక ప్రియుల కోసం అవకాశం వచ్చింది. 

తెలంగాణ కళాభారతి మైదానం(ఎన్టీఆర్ స్టేడియం)లో పుస్తకాల జాతరకు పోదాం పదండి అందరూ….!!

◆ వెంకటేష్ పువ్వాడ