కేంద్రంతో రాష్టం మళ్ళీ కయ్యం
posted on Jul 21, 2022 @ 2:02PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే రాజకీయ మంటలు భగ్గుమంటున్నాయి. నిత్యం ఏదో ఒక వివాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కయ్యం నడుస్తూనే వుంది. ముఖ్యంగా జులై మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేపధ్యంగా, బీజీపే, తెరాసల మధ్య భగ్గుమన్న రాజకీయ రగడ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని పతాక స్థాయికి తీసుకుపోయింది. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి.
ఇతర విషయాలు, వివాదాలు ఎలా ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం మొదలైనప్పటి నుంచి ధాన్యం సేకరణ అంశం చుట్టూనే రాజకీయం నడుస్తోంది. గతం విషయం ఎలా ఉన్నా, తాజాగా తెరపైకొచ్చిన బియ్యం వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్’ను బోనులో నిలబెట్టింది, ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్ అన్న యోజన కింద, పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన ఉచిత బియ్యాని, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లో పంపిణీ చేయలేదు. నిజానికి, పేదల ఉచిత బియ్యం పంపిణీ జరగక పోవదానికి సంబంధించి చాలా కాలంగా, రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. మంత్రు;లు, తెరాస నాయకులు ఆ చర్చను పక్కదారి పట్టించారు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నీ వివరాలను బయట పెట్టింది. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసిందని, తెరాస నాయకులే అంగీకరిస్తున్నారు.
ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీతో పాటుగా, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ తప్పుల చిట్టాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే,సెంట్రల్ పూల్‌లోకి తెలంగాణ నుంచి బియ్యం సేకరణను నిలిపివేయవలసి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం సవివరంగా వివరించింది.అంతే కాదు, బ్లాక్ అండ్ వైట్’లో ఇచ్చిన వివారాలకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మరింత వివరంగా వాటి గురించి చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పుల గురించి వివరించారు.
ఈసందర్భంగా పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు విమర్శలు,.రాష్ట్ర ప్రభుత్వానికి తల వంపులు తెచ్చేలా ఉన్నాయని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల కారణంగానే రాష్ట్రంలో ధాన్యం సేకరణ నిలిపివేయవలసి వచ్చిందని పేర్కొంటూ, బియ్యం నిల్వల్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం సూచనలను పెడచెవిన పెట్టడం, ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్ అన్న యోజన కింద ఏప్రిల్, మే నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోవడం వల్ల గతంలో ఆంక్షలు విధించినట్లు ఆయన ఇచ్చిన వివరణ, అలాగే, జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని మొదలుపెట్టడం, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆంక్షలను ఉపసంహరించుకుంటున్నట్లు యాన్ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ డొల్ల తనాన్ని బయట పెట్టిందని అంటున్నారు.