బాధితుల మధ్య బాబు.. తాడేపల్లి ప్యాలస్ లో జగన్
posted on Jul 21, 2022 @ 2:24PM
నాయకుడంటే ఎలా ఉండాలి? కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి.. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారి మధ్యన నిలవాలి.. వారి కష్టాలను స్వయంగా వినాలి.. చేతనైనంత సాయం సాయం చేయాలి.. లేదంటే కనీసం కాస్త ఓదార్పు అయినా ఇవ్వాలి.. ఇవి కదా నాయకుడనిపించుకోవాల్సినవాడు చేయాల్సిన పనులు..? ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందే ఉంటారనడంలో సందేహమే లేదు. రాష్ట్రంలోని ప్రజలకు ఎప్పుడు ఎలాంటి కష్టం ఎదురైనా ముందుగా పరుగెత్తుకుని వెళ్లి అండగా నిలుస్తుండడం చంద్రబాబు నైజం.
మరి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ఆంధ్ర ప్రజలకు సీఎం జగన్ రెడ్డి చేస్తున్నదేంటి? ఒక్కసారి అవకాశం ఇవ్వండని గత ఎన్నికలకు ముందు అమ్మా, అయ్యా, అవ్వా, తాత, అన్నా, తమ్ముడు, అక్కా చెల్లెమ్మల ముందు ప్రాధేయపడిన జగన్ ఏపీ ప్రజలకు ఇప్పుడు వచ్చిపడిన భారీ వరద కష్టం సమయంలో చేస్తున్నదేంటి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ వస్తోంది. అటు చంద్రబాబు- ఇటు జగన్ మధ్య ఉన్న తేడా గురించి బేరీజు వేసుకుంటున్నారు.
ఏపీలో 1986లో వచ్చిన అతి భారీ వరదల తర్వాత ఇంచుమించు అంతే స్థాయిలో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వందలాది లంక గ్రామాలను ముంచెత్తింది. వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ ఇంకా అనేక లంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. గ్రామంలో ఉండే వీలు లేక, సర్వం కోల్పోయిన స్థితిలో తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్న తమకు అరకొరగా ఆహారం సరఫరా చేసి చేతులు దులుపుకున్న జగన్ సర్కార్ తీరును వరద బాధితులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇంకో పక్కన వెళ్లేందుకు ఇప్పటికీ సరైన దారీ తెన్నూ లేని వరద ముంపు లంక గ్రామాల్లో స్వయంగా పర్యటించి, బాధితులను పరామర్శించేందుకు, వారికి అండగా నిలిచేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు హుటాహుటిన ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల పర్యటకు రావడాన్ని బాధితులు స్వాగతిస్తున్నారు. జగన్ తీరును చంద్రబాబు తీరుతో బేరీజు వేసుకుంటున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఇప్పటికే టీడీపీ శ్రేణులను పురమాయించిన చంద్రబాబు, అక్కడితో ఆగకుండా తానే స్వయంగా బాధితుల మధ్యకు వెళ్ళడం గమనార్హం.
చంద్రబాబు కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొలిరోజు లంక గ్రామాల పర్యటనలో భాగంగా సిద్ధాంతం నుంచి కరుగోరుమిల్లి చేరుకుని బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి గోదావరి నది మధ్యలో ఉన్న అయోధ్యలంక గ్రామానికి వెళ్తారు. అక్కడి నుంచి బోటులో కోనసీమ జిల్లా చాకలిపాలెం చేరుకుని తర్వాత రోడ్డు మార్గంలో మానేపల్లిపాలెం వెళ్తారు. గోదావరి వరద బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తర్వాత అప్పనపల్లి వెళ్లి బాధిత కుటుంబాలను పలకరిస్తారు. సాయంత్రానికి రోడ్డు మార్గంలో రాజోలు వెళ్లి రాత్రికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు చేరుకునేలా షెడ్యూల్ వేసుకుని పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు తరఫున వరద బాధితులకు సాయం అందిస్తారు.
నాయకుడనేవాడు బాధితులకు భరోసా ఇవ్వాలని, మాటల్లో కాకుండా ఆ భరోసాను చేతల్లో చూపించాలని పలువురు ప్రత్యక్షంగానే చంద్రబాబబును ప్రశంసిస్తున్నారు. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా చంద్రబాబు చేసేది అదే అని వారు గుర్తు చేస్తున్నారు. సీఎం కుర్చీలో కూర్చునేదాకా తమ చుట్టూ తిరిగిన జగన్ రెడ్డి ఇలాంటి కష్టకాలంలో తమను గాలికి వదిలేశారని, తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. వరద ముంపు ఒక్క రాత్రిలో తమ జీవితాను తారుమారు చేసేసిందని, అష్ట కష్టాల్లో ఉన్న తమను ఆదుకునేవాడు, భరోసా ఇచ్చేవాడు లేడని బాధితులు బావురుమంటున్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. వరదల్ని నివారించే శక్తి లేకపోయినా ప్రజల్లో కచ్చితంగా భరోసా నింపేవారని చెప్పుకుంటున్నారు.
గతంలో విశాఖపట్నాన్ని హుద్ హుద్ తుపాను అతలాకుతలం చేసినప్పుడు విశాఖ నగరంలోనే మకా వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన చంద్రబాబు ఎక్కడ? తామంతా ఇంత కష్టంలో ఉంటే ప్యాలెస్ కే పరిమితం అయిన జగన్ ఎక్కడ అని జనమంతా బేరీజు వేసుకుని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల నుంచి కొందరిని సహాయ శిబిరాలకు తరలించి, అరకొరగా భోజనం, అల్పాహారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇంకా వరదనీటిలోనే ఉన్న తమకు ప్రుభుత్వం అందజేసిన నాలుగు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చిలు, నాలుగు దొండకాయలు, నాలుగు వంకాయలు, ఐదు కిలోల బియ్యంను ఏం చేసుకోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.