చెమట చుక్కతో ఆరోగ్యాన్ని పసిగట్టేస్తుంది
posted on Nov 29, 2016 @ 10:56AM
ఒక చిన్న స్టిక్కర్‌ని చేతికి అంటించుకుంటే... అది మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఈ ఆశ్చర్యం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పుణ్యమా అని రాబోయే రోజుల్లో వైద్య పరీక్షల తీరే మారబోతోంది.
సరికొత్త పరికరం
ఒక మనిషి గుండె ఎంత వేగంతో కొట్టుకుంటోంది, అతని రక్తపోటు ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు చెప్పేందుకు రకరకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వ్యాయామం చేసేవారు తమ శరీరంలో ఎన్ని కెలొరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకునేందుకు, వ్యాయామం శృతి మించుతోందేమో గమనించుకునేందుకు ఈ పరికరాలు వాడుతున్నారు. అయితే ఇవి కేవలం ప్రాథమిక సమాచారాన్ని అందించగలవే కానీ మన ఒంట్లోని నీరు, లవణాల శాతం ఎలా ఉందో చెప్పవు. పైగా ఈ పరికరాలు శరీరానికి తగులుతూ కాస్త చిరాగ్గా ఉంటాయి. ఇవి పనిచేయాలంటే బ్యాటరీలు కూడా కావాల్సి ఉంటుంది. కానీ కొత్త స్టిక్కర్ తీరే వేరు.
రసాయనాల ఆధారంగా
ఒక రూపాయి నాణెం అంత ఉండే ఈ స్టిక్కర్‌లో నాలుగు భాగాలు ఉంటాయి. ఆ నాలుగు భాగాల్లోనూ నాలుగు రకాల రసాయనాలు ఉంటాయి. ఈ నాలుగు రసాయనాలూ మన ఒంట్లోంచి వెలువడే చెమటతో కలిసినప్పుడు ప్రతిచర్య జరిగి వాటి రంగు మారతాయి. అప్పుడు మన దగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ఇలా రంగు మారిన స్టిక్కర్‌ను ఒక ఫొటో తీస్తే.... ఫోన్లో వాటికి సంబంధించిన యాప్, రంగులని బట్టి మన ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది.
నాలుగు రకాలు
స్టిక్కర్‌లో ఉన్న నాలుగు రకాల రసాయనాలూ మన శరీరంలో నాలుగు రకాల పరిస్థితులను అంచనా వేస్తాయి. మన శరీరంలోని ఆమ్లశాతం, లాక్టేట్ పరిమితులు, క్లోరైడ్ నిల్వలు, గ్లూకోజ్ స్థాయిలను ఇవి పసిగడతాయి. వీటి ఆధారంగా మన ఒంట్లో నీరు తగినంత ఉందా లేదా! సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి లవణాలు (Electrolytes) తగిన మోతాదులో ఉన్నాయా లేదా అన్నది అంచనా వేస్తాయి. లాక్టేట్ పరిమితులను అంచనా వేయడం వల్ల వ్యాయామం గాడితప్పుతోందా? శరీరంలోని కణాలకి ఆక్సిజన్ తగినంతగా అందుతోందా లేదా? గుండె, లివర్ పనితీరు సవ్యంగా ఉందా లేదా? అన్న వివరాలను అంచనా వేయవచ్చు.
మరికొన్ని వివరాలు
- ఇంతకీ ఈ స్టిక్కర్ అన్ని సందర్భాలలోనూ పనిచేస్తుందా లేదా అని పరీక్షించేందుకు ఇటు ఇంట్లో వ్యాయామం చేసేవారికీ అటు ఎడారిలో సైక్లింగ్ పోటీలలో పాల్గొనేవారి చేతులకి స్టిక్కర్‌ను అంటించి చూశారు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇది శుభ్రంగా పనిచేస్తున్నట్లు తేలింది.
- ఈ స్టిక్కర్‌లోని రసాయనాలు ఒంట్లోని చెమటతో ప్రతిచర్య జరపడం ద్వారా రంగులు మారిపోతాయి కాబట్టి, ఒకసారి వాడిన స్టిక్కర్ మరోసారి పనికిరాదు. అయితే ఎలాంటి బ్యాటరీల అవసరం లేకపోవడం, కేవలం ఒకటిన్నర డాలరు ఖరీదు మాత్రమే ఉండటంతో ఇది సామాన్యులకు అందుబాటులోనే ఉందని భావించవచ్చు.
- ప్రస్తుతానికి ఓ నాలుగైదు రకాల ఆరోగ్య పరిస్థితులను మాత్రమే అంచనా వేస్తున్నప్పటికీ... ఈ స్టిక్కర్‌ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా మున్ముందు షుగర్ వంటి పరీక్షలను కూడా నిర్వహించవచ్చని భావిస్తున్నారు.
- నిర్జర.