ఊబకాయానికి కారణం తెలిసిపోయింది
posted on Nov 30, 2016 @ 10:33AM
ఈ రోజుల్లో ఊబకాయం లేనివారు అరుదు. ఆ ఊబకాయం నుంచి విముక్తి పొందుదాం అని ఎవరికి వారు ఏవో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కడుపు మాడ్చుకుంటూ, కఠినమైన వ్యాయామాలు చేస్తూ... ఎలాగొలా కాసింత బరువు తగ్గుతారు. కానీ బరువు తగ్గాం కదా అని అలా ఓ నాలుగు ముద్దలు నోట్లో వేసుకుంటారో లేదో... మళ్లీ ఎప్పటిలాగే బరువు పెరిగిపోతుంటారు. ఈ తరహా ఊబకాయాన్ని Yo-Yo ఊబకాయం అంటారు. Yo-Yo అనేది చిన్నపిల్లలు లాగి వదిలే బంతిలాంటి పరికరం. దాన్ని అలా నేలకి వదలగానే తిరిగి చేతిలోకి వచ్చేస్తుంది. అలాగే కొందరిలో ఊబకాయం కూడా మళ్లీ మళ్లీ వస్తుందన్నమాట. ఈ తరహా శరీర తత్వానికి Yo-Yo obesity అంటూ మంచి పేరైతే పెట్టారు కానీ, దానికి కారణం ఏమిటో ఇంతవరకూ తెలుసుకోలేకపోయారు.
ఇజ్రాయేలుకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు Yo-Yo ఊబకాయానికి కారణం తెలుసుకునేందుకు ఎలుకల జీర్ణవ్యవస్థను నిశితంగా పరిశీలించారు. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన ఫలితం వెలువడింది. మన పేగులలో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడతాయన్న విషయం తెలిసిందే కదా! వీటిలో ఒక సూక్ష్మజీవి ఊబకాయులలో చిత్రంగా ప్రవర్తించడాన్ని గమనించారు. ఒక మనిషి విపరీతంగా ఆహారం తీసుకుంటున్నప్పుడు తాము ఎలా పనిచేస్తున్నామో గుర్తుంచుకునే ఈ సూక్ష్మజీవి, అతను డైటింగ్‌లో ఉన్నంతకాలమూ నిశబ్దంగా ఉండి... మళ్లీ ఓ నాలుగు ముద్దలు అదనంగా పేగులలోకి చేరగానే ఊబకాయానికి తోడ్పడుతోందట.
ప్రయోగంలోని రెండో దశలో- ఊబకాయం పునరావృతమవ్వడానికి సదరు సూక్ష్మజీవే కారణమా కాదా అని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించారు పరిశోధకులు. అందుకోసం ఎలుకలకి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా సదరు సూక్ష్మజీవిని నిర్వీర్యం చేశారు. అప్పుడు ఎలుకలలో ఊబకాయం తిరిగి రాకపోవడాన్ని గమనించారు. మరోవైపు ఊబకాయానికి అలవాటు పడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన ఎలుకలలో ప్రవేశపెట్టినప్పుడు, అవి వెంటనే ఊబకాయంతో సతమతమవ్వడాన్ని గమనించారు.
మళ్లీ మళ్లీ వచ్చే ఊబకాయానికి కారణమైన సూక్ష్మజీవిని కనుగొన్నారు సరే! మరి సదరు సూక్ష్మజీవి ఊబకాయానికి ఎలా తోడ్పడుతోంది? అన్న ప్రశ్నకి కూడా జవాబు దొరికింది. ఆ సూక్ష్మజీవులు, మన శరీరంలోకి చేరే ఫ్లేవనాయిడ్స్ అనే పోషక పదార్థాలను నిర్వీర్యం చేస్తాయట. కొవ్వుని శక్తిగా మార్చడంలో కీలకపాత్రని వహించే ఇలాంటి ఫ్లేవనాయిడ్స్‌ని నిర్వీర్యం చేయడం ద్వారా... శరీరంలో కొవ్వు ఎప్పటికప్పుడు పేరుకుపోయే ప్రమాదం ఏర్పుడుతుంది.
ఎలుకల మీద జరిగిన ఈ పరిశోధన ఆధారంగా ఊబకాయంతో బాధపడే మనుషులకు కూడా తగిన చికిత్సను అందించవచ్చు అంటున్నారు. కొవ్వుని కరిగించే ఫ్లేవనాయిడ్స్‌ను ఎప్పటికప్పుడు శరీరానికి అందించడం ద్వారా ఊబకాయాన్ని సులువుగా జయించవచ్చునంటున్నారు. ఊబకాయం కేవలం ఆకృతికి సంబంధించిన సమస్యే కాదు! దాని వల్ల గుండెజబ్బులు, షుగర్, రక్తపోటు వంటి నానారకాల ఆరోగ్య సమస్యలూ మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి మున్ముందు చిన్నపాటి చికిత్సతోనే ఈ ఊబకాయం అనే మహమ్మారి నుంచి బయటపడితే, ఇతరత్రా సమస్యల నుంచి కూడా దూరం కావచ్చునేమో!
- నిర్జర.