హోదాతో పాటే ఆరోగ్యం కూడా!
posted on Nov 26, 2016 8:43AM
వంశపారంపర్యంగా మనకి లభించిన జన్యువులు అంత బలంగా లేకపోవచ్చు, చిన్నాచితకా ఆరోగ్యసమస్యలు మనల్ని వేధిస్తుండవచ్చు- కానీ సమాజంలో పేరుప్రతిష్టలు ఉంటే సుదీర్ఘకాలం బతికేస్తామా! ఆరోగ్యం కూడా డబ్బున్నవాడికే సాయపడుతుందా! అంటే అవుననేలా ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే కొన్ని ప్రయోగాలు
డబ్బుకీ ఆరోగ్యానికీ లంకెపెడుతూ ఇప్పటికే కొన్ని పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. ఆదాయంలో అట్టడుగున ఉండే పేదలతో పోల్చుకుంటే బాగా ధనవంతులు 10 నుంచి 15 ఏళ్లు ఎక్కువ బతుకుతారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఇది కేవలం సమాజంలో మంచి హోదాలో ఉండటం వల్ల సాధ్యమవుతోందా! లేకపోతే ఆహారానికీ, వైద్యానికీ కావల్సినంత ఖర్చుపెట్టుకునే స్తోమత ఉండటం వల్ల సాగుతోందా! అన్నది తేలలేదు. అందుకోసం అమెరికాకి చెందిన కొందరు పరిశోధకులు ఓ 45 కోతుల మీద సామాజిక హోదాకి సంబంధించిన ఓ ప్రయోగాన్ని తలపెట్టారు.
ఐదు బృందాలుగా
పరిశోధనలో భాగంగా 45 కోతులని ఐదు బృందాలుగా విభజించి వేర్వేరుగా ఉంచారు. సహజంగానే కొద్ది రోజులు గడిచేసరికి ఒకో బృందంలో ఒకో కోతిది పైచేయి అయ్యేది. బృందంలోని మిగతా కోతుల మీద వాటి ఆధిపత్యం సాగేది. కొన్నాళ్ల తరువాత ఈ కోతులని గమనించినప్పుడు, తక్కువ హోదాతో సరిపెట్టుకున్న కోతులలోని రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నట్లు బయటపడింది. వీటిలోని రోగనిరోధకశక్తిని నియంత్రించే జన్యువులను గమనించినప్పుడు... 9,000 జన్యువులలో ఏకంగా 1,600 జన్యువుల లోపభూయిష్టంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా సదరు కోతులకి ఏదన్నా ఇన్షెక్షన్ సోకినప్పుడు, అవి తొందరగా వ్యాధులకు లోనవ్వడం కనిపించింది. అంతేకాదు! వీటిలోని కణాలు అపసవ్యంగా ప్రవర్తించడం వల్ల గుండెజబ్బులు, అల్జీమర్స్ వంటి రోగాలు సైతం వాటిని బలిగొనే అవకాశం ఉన్నట్లు గమనించారు.
ప్రయోగంలో రెండో దశ
45 కోతులను ఐదు బృందాలుగా విభజించిన పరిశోధకులు, ఒక ఏడాది గడిచిన తరువాత వాటిని అటూఇటూ మార్చారు. అంటే ప్రతి కోతికీ ఒక కొత్త బృందం ఏర్పడిందన్నమాట. ఈ మార్పుతో సహజంగానే ఆయా బృందాలలో కొత్త హోదాలు ఏర్పడే అవకాశం ఉంది. విచిత్రమేమిటంటే ఒకప్పుడు తక్కువ హోదాలో ఉన్న కోతులు ఇప్పుడు తమ బృందంలో పైచేయి సాధించే పరిస్థితులు వస్తే... హోదాతో పాటుగా వాటిలోని రోగనిరోధక శక్తిలో కూడా మార్పు వచ్చిందట! అంటే హోదాతో పాటుగా వాటి ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయన్న విషయం ఖచ్చితంగా రుజువు అయిపోయింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏదన్నా ఒక కోతి తక్కువ హోదాలో ఉన్నప్పటికీ, దానికి బృందంలోని మరో కోతి అండగా నిలబడితే... వాటి ఆరోగ్యంలో పెద్దగా లోటు కనిపించలేదు.
కోతుల హోదాల మీద విజయవంతంగా సాగిన ఈ పరిశోధన మనుషులకు ఏమేరకు వర్తిస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు శాస్త్రవేత్తలు. అంతవరకూ మనం హోదా సంగతి పక్కన పెడితే, ఒకరికొకరు అండగా నిలబడే ప్రయత్నం చేస్తే సరి!
- నిర్జర.