పదివేల చీరలన్న పవన్...ఏవయ్యా ఆ చీరలు.. ఎక్కడ?
posted on Aug 22, 2025 @ 9:54PM
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పది వేల చీరలు పంచుతారని తెలియడంతో ప్రసిద్ధ పాదగయ పుణ్యక్షేత్రానికి తండోపతండాలుగా వచ్చారు మహిళా భక్తురాళ్లు. ఇవాళ చివరి శ్రావణ శుక్రవారం కావడంతో వరలక్ష్మీ వ్రత కూపన్లను పంచారు ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. అయితే ఇక్కడ జరిగిన తోపులాటలో భారీ ఎత్తున ఇబ్బంది పడ్డారు మహిళలు. ఈ క్రమంలో కొందరు మహిళలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఒక మహిళకు రక్తం రావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.
ఈ సందర్భంగా మహిళలు పవన్ కళ్యాణ్ ని తీవ్ర స్థాయిలో దుయ్య బట్టారు. తాను తన ఇద్దరు పిల్లల్ని బెంగళూరు నుంచి తెప్పించి మరీ ఓట్లు వేయించానని.. ఇప్పుడు చూస్తే ఆ ఖర్చు మోయినా కూడా లాభం లేక పోయిందని.. ఒక మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మరో మహిళ అయితే పది వేల చీరలు అని అన్నారు. అవెక్కడికెళ్లాయ్? ఇక్కడ అంత మంది కూడా లేరు. అంటే, జనసేన నాయకులే వీటన్నిటినీ పంచేసుకున్నారు కాబట్టి.. మా వరకూ రాలేదని ఆరోపించారు. చీరలు దక్కక పోగా మాకు దెబ్బలు తగిలాయని.. కన్నీటి పర్యంతమయ్యారు.
శుక్రవారం పూట పిఠాపురంలో మహిళా భక్తురాళ్లు ఉనసైనికుల నిర్వాకం పుణ్యమాని కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని పిలిచి ఇలా రక్తం కారేలా చేయడం మాకే కాదు, మీకూ మంచిది కాదన్నారు బాధిత మహిళలు. ఈసారి పవన్ ఓట్లకు వచ్చినపుడు తామిదంతా గుర్తు పెట్టుకుని నిలదీస్తామని అన్నారు. సైనికులు చివరికి చీరలను కూడా దోచేస్తున్నారు. వీరికెంత కరవు వచ్చి పడందో అన్న మాట కూడా వినిపిస్తోంది.