Read more!

జనసేనాని కుండ బద్దలు కొట్టేశారు.. జగన్ కు ఇక చుక్కలే!

వచ్చే ఎన్నికలలో అధికార పార్టీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు నేరుగా కాకపోయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. అక్కడితో ఆగలేదు.. ఆయన బీజేపీని కూడా కలుపుకు పోవడానికే తన ప్రయత్నం అని కూడా బిట్వీన్ ది లైన్స్ సంకేతాలు ఇచ్చారు. తన అసంతృప్తి అంతా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపైనే కానీ ఆ పార్టీ హై కమాండ్ మీద కాదని విస్పష్టంగా తేల్చేశారు. తనకు బీజేపీ జాతీయ నాయకులతోనూ, కేంద్రం పెద్దలతోనూ సత్సంబంధాలూ, సఖ్యతా ఉన్నాయని ఆయన చెప్పారు. అంటే తనకు ఉన్న పేచీ అంతా ఆ పార్టీ రాష్ట్ర నాయకులతోనేనని తేటతెల్లం చేశారు.  

ఏపీకి  ఏకైక రాజధాని అమరావతేనని  కేంద్ర పెద్దలను, బీజేపీ నాయకులను ఒప్పించినప్పటికీ.. అమరావతే రాజధాని అంటూ ర్యాలీ చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎందుకో సుముఖంగా లేరని పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధుడైన నాయకుడని పవన్ కళ్యాణ్ కితాబు నివ్వడం, వైసీపీ పార్టీని ఓడిస్తాం, ఆ పార్టీ నాయకుల కోటలు బద్దలు కొడతాం అంటూ పవన్ క ల్యాణ్ పార్టీ వార్షికోత్సవ సభ వేదికగా చేసిన ప్రకటనే రాష్ట్రంలో పొత్తుల విషయాన్ని ఖరారు చేసినట్లేనని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.

కాగా పవన్ కల్యాణ్ ప్రసంగంపై తనదైన శైలిలో భాష్యం చెప్పారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.   గతంలో కంటే పవన్ కల్యాణ్ బందర్ సభలో ఎంతో పరిణితితో మాట్లాడారనీ, రాష్ట్రంలో జనసేన బలోపేతం ఒక్కటే లక్ష్యం కాదనీ, దానితో పాటు రాష్ట్రంలో దుర్మార్గ పాలన అంతం కూడా తన ధ్యేయమనీ చెప్పారు.

అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పునరుద్ఘాటించారు. వైసీపీ ఎంతగా రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసినా పవన్ కల్యాణ్ సంయమనం కోల్పోకపోవడాన్ని రఘురామకృష్ణం రాజు ప్రత్యేకంగా ప్రస్తావించి.. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయడం ఖాయమన్న భావన వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం ముందు ముందు బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేన కూటమితో జట్టు కట్టక తప్పదని రఘురామరాజు విశ్లేషించారు.