నిర్మలాపై పరకాల ఎఫెక్ట్... కేంద్రంలో కలకలం రేపుతోన్న కామెంట్స్
posted on Oct 21, 2019 @ 10:48AM
నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధికమంత్రి... పరకాల ప్రభాకర్, పొలిటికల్ ఎకనామిస్ట్... ఇద్దరూ భార్యాభర్తలు... ఒకరు దేశ ఆర్ధిక వ్యవహారాలను చూస్తుంటే.... మరొకరు ఆ ఆర్ధిక విధానాల్లో మంచిచెడ్డలను విశ్లేషిస్తుంటారు. అయితే, దేశ ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ భర్తగా... ఎన్డీఏ ప్రభుత్వంపై పరకాల ప్రభాకర్ చేసిన హాట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ పరకాల చేసిన కామెంట్స్... కలకలం రేపుతున్నాయి.
నెహ్రూ సోషలిజాన్ని విమర్శించే బదులు సరళీకృత ఆర్ధిక విధానాలకు బాటలు చూపిన పీవీ, మన్మోహన్ నమూనాలను అనుసరించాలన్న పరకాల.... పీవీ, మన్మోహన్ ఆర్ధిక విధానాలు ఇఫ్పటికీ సవాలు చేయలేనివిధంగా ఉన్నాయంటూ పొగడటంపై దేశమంతా చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ భార్య కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉండగా, పరకాల ప్రభాకర్ ఈ కామెంట్స్ చేయడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ నేరుగా స్పందించకపోయినా, మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటరిచ్చారు. యూపీఏ హయాంలో... కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేయడంతోనే కొంతమందికి బ్యాంకర్లు లోన్లు ఇచ్చారని, దాని ఫలితమే ఇప్పుడు బ్యాంకింగ్ రంగ సంక్షోభమని నిర్మల ఆరోపించారు.
దేశ ఆర్ధిక వ్యవస్థపై పరకాల ప్రభాకర్ విమర్శలు... కౌంటర్ గా నిర్మలా సీతారామన్ కామెంట్... కలకలం రేపుతున్నాయి. అయితే, పరకాల ప్రభాకర్ కాకుండా, ఇంకెవరైనా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసుంటే... ఇంత చర్చ, రగడ జరిగేది కాదు... కానీ భార్య ఆర్ధికమంత్రిగా ఉండగా, భర్త విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో, పరకాల ప్రభాకర్-నిర్మలా సీతారామన్ డైలాగ్ వార్ దేశమంతా ఆసక్తి రేపుతోంది. అయితే, భార్యాభర్తల నడుమ ఇంటి బడ్జెట్‌పై గొడవలు, వాదనలు కామనే అయినా, ఏకంగా దేశ ఆర్ధిక పరిస్థితిపై వాదులాడుకోవడం మాత్రం సంచలనంగా మారింది.