రెండు వర్గాలుగా విడిపోతున్న టీఆర్ఎస్ నేతలు.. అసలేం జరుగుతోంది?

 

తెలంగాణ ఏర్పడిన తర్వాత అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సంఘంతో పాటు సచివాలయ టీఎన్జీవో విభాగాలు ప్రధాన సంఘంలో విలీనమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు దానిని విరమింపజేయటానికి జ్యూస్ ను అందించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తొలిగురి ఎమార్పీఎస్ పైనే ఉంది. మంద కృష్ణ మాదిగకు కుడి ఎడమ భుజంగా ఉన్న కీలక నేతలతో రహస్యంగా సమావేశమైన కేసీఆర్ ఎమ్మార్పీఎస్ ను ముక్కలు చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయానికి కొన్ని ప్రజా ఉద్యోగ సంఘాలు తలో దిక్కున ఉన్నాయి. వాటికి తోడు మరికొన్ని సంఘాలను అప్పట్లో టీఆర్ఎస్ ఏర్పాటు చేయించింది. విడివిడిగా ఉన్న సంఘాలను దగ్గరికి చేర్చి బలమైన తాడుగా పేనింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకం చేసింది. అన్నిటినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. సొంత రాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వివిధ సంఘాలు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలకు ఇది నచ్చటం లేదని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోవడం లేదని ప్రజా, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. 

ప్రభుత్వంలోని ముఖ్యులు సంఘాలను నిలువుగా చీల్చే వ్యూహాలకు పదును పెడుతూ చాలా వరకు సఫలీకృతులవుతారనే చర్చ నడుస్తోంది. ఇందుకు సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో చీలిక వర్గం ప్రభుత్వానికి పూర్తి విధేయత ప్రకటిస్తుంది. రెండో వర్గం న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. రాష్ట్ర సర్పంచుల సంఘంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మరొక వర్గం అధికార టీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. 

తాజాగా ఆర్టీసీ సమ్మెకు నేతృత్వం వహిస్తున్న టీఎంయూ చీలికకు తెర వెనుక పావులు కదుపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా ప్రభుత్వం ముందు న్యాయమైన తమ వర్గం సమస్యలను ఉంచి పరిష్కారం కోసం కొట్లాడుతున్న సంఘాల నేతలను వేధింపులు తప్పడం లేదనే ఆందోళన నెలకొంది. అప్రాధాన్య పోస్టులలోకి సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు గురి చేయటం వంటి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ అధినేతకు విధేయత చాటిన వారికి కూడా ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదనే చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యోగులతో అప్రకటిత యుద్ధం చేస్తున్న క్రమంలోనే ఒకే సంఘానికి చెందిన నేతలు భిన్నస్వరాలు వినిపించటం ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

నిజానికి ఉద్యమ సమయంలో వీరంతా టీఆర్ఎస్ నేతలకు చాలా సన్నిహితంగా మెలిగిన వారే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలకు సహకరించారు. అప్పుడు వారి పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచిన సమాచారాన్ని గుట్టుగా అందజేశారు.  హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో భూముల అక్రమ కేటాయింపుల సమాచారాన్ని తెలంగాణ తహసీల్దార్ ల సంఘం అధ్యక్షుడు అయిన వి లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతి నిధుల నుంచే కేసీఆర్ ఆ సమాచారాన్ని సేకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని తహసీల్దార్ లకు కట్టబెట్టడాన్ని తహసీల్దార్లంతా తీవ్రంగా వ్యతిరేకించగా సీఎం విధేయుడిగా ఉన్న లచ్చిరెడ్డి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అందుకు నజరానాగా లచ్చిరెడ్డికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. రెండేళ్ల పాటు అంతా బాగానే ఉన్నా కలెక్టర్ల సదస్సులో ఏం జరిగిందో తెలుసుకోవటానికి మంత్రి ఈటెలతో లచ్చిరెడ్డి భేటీ అయ్యారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిని సాకుగా చేసుకున్నా ప్రభుత్వం లచ్చిరెడ్డి బదిలీ చేయడమే కాకుండా ఇటీవలే కొందరు డిప్యూటీ కలెక్టర్ లతో ఆయన పెట్టుకున్న సంఘంలో కూడా చీలిక తెచ్చింది. ఆ సంఘంలో కీలక కార్యవర్గ సభ్యులంతా రాజీనామాలు చేశారు.అసలు తెలంగాణ ప్రభుత్వంలో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆర్టీసీ సమ్మె కారణంగా అంతరంగా దాగున్న రహస్యాలు అన్ని బయటకు వస్తున్నాయా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.