కేసు మీద కేసు... రిమాండ్ మీద రిమాండ్... చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తాడా?
posted on Oct 21, 2019 @ 10:09AM
చింతమనేనిపై కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 11న అరెస్టయిన చింతమనేనిపై ఒకదాని తర్వా మరొకటి బయటికి తీస్తూ దాదాపు నెలన్నరగా జైలుకే పరిమితం చేశారు పోలీసులు. ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసులో జైలుపాలవుతున్నాడు. ప్రస్తుతం ఐదు కేసుల్లో అక్టోబర్ 9తో రిమాండ్ పూర్తవడంతో, చింతమనేని బెయిల్ పై బయటకు వస్తారని కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు ఆశించారు. కానీ పీటీ వారెంట్ పై జైల్లోనే మరోసారి అరెస్ట్ చేయడంతో అక్టోబర్ 23వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇలా, ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్ట్ చేస్తుండటంతో చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చింతమనేని దాదాపు 60 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం 22 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. చింతమనేనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్టు చేస్తూ... జైలుకే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే, టీడీపీ హయాంలో ఒక్క ఇంచు కూడా ముందుకు కదలకుండా, మరుగునపడిపోయిన కేసులన్నీ తెరపైకి రావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కేసులున్నా, చంద్రబాబు హయాంలో ఆడుతూ పాడుతూ తిరుగుతూ, తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించిన చింతమనేనికి... జగన్ సర్కారులో మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. చింతమనేనిపై నమోదైన కేసులన్నీ ఇప్పుడు బయటికి వస్తుండటంతో ప్రభాకర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అయితే, చింతమనేనిపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తూనే ఉన్నా, కేసుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు చేసిన పాపం ఊరికే పోదని వైసీపీ నేతలంటుంటే, కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
అయితే, కటకటాల వెనుకున్న చింతమనేనిని, ఈ జైలు బాధలోనూ మరో బాధ మరింతగా బాధపెడుతోందట. కష్ట సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నుంచి తనకు ఆశించినంత మద్దతు దొరకడం లేదని, తనను పట్టించుకోవడం లేదని కుమిలిపోతున్నాడట. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ, దూరం జరిగినట్టు అనిపిస్తోందని అనుచరులతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. దాంతో, ఇలా కోర్టు, జైలు చుట్టూ తిరుగుతుండటంతో అసలు చింతమనేని బయటి వస్తాడా అనే అనుమానాలు అనుచరులకు కలుగుతున్నాయట. మరి, కేసు మీద కేసు, రిమాండ్ మీద రిమాండ్‌తో జైలుకే పరిమితమవుతున్న చింతమనేని, ఎప్పడు రిలీజ్ అవుతారో చూడాలి.