పేకమేడలా కూలిన నోయిడా ట్విన్ టవర్స్
posted on Aug 28, 2022 @ 4:04PM
ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను ఆదివారం విజయవంతంగా కూల్చివేశారు. జంట టవర్లు క్షణాల్లో కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున ధూళి విరజిమ్మింది. నలభయి అంతస్తుల ట్విన్ టవర్స్.. నాలుగు టన్నుల మందు గుండు.. కేవలం తొమ్మిది సెకన్లలో నేలమట్టం! అవును ఇది నిజమే. కానీ సినిమా సీన్ తలపించింది. నోయిడాలో ఉన్న సూపర్ టెక్ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కేవలం 9 సెకన్లలో నేలమట్టం చేస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ భవనాలను మే 22 నాటికి కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీం కోర్టుకు ఇటీవల తెలియజేసింది.
సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ హౌసింగ్ సొసైటీని మొదట మంజూరు చేసినప్పుడు, బిల్డింగ్ ప్లాన్‌లో 14 టవర్లు, తొమ్మిది అంతస్తులు చూపించారు. తరువాత, ప్లాన్ సవరించారు. ప్రతి టవర్‌లో 40 అంతస్తులను నిర్మించడానికి బిల్డర్‌ను అనుమతించారు. అసలు ప్లాన్ ప్రకారం టవర్లు నిర్మించిన ప్రాంతాన్ని ఉద్యానవనంగా మార్చాలి. దీంతో సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్టు సొసైటీ నివాసితులు 2012లో ఈ నిర్మాణం అక్రమమని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. సూపర్‌టెక్ గ్రూప్ మరిన్ని ఫ్లాట్లను విక్రయించడానికి, వారి లాభాల మార్జిన్‌లను పెంచుకోవడానికి నిబంధనలను ఉల్లంఘించిందని పిటిషనర్లు వాదించారు. దీని ప్రకారం, ఆర్డర్ దాఖ లు చేసిన తేదీ నుండి నాలుగు నెలల్లో (సొంత ఖర్చుతో) టవర్లను కూల్చివేయాలని 2014లో కోర్టు అథారిటీని ఆదేశించింది.
ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. గత ఆగస్టులో, కోర్టు టవర్లను కూల్చివేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా అది ఒక సంవత్సరం పట్టింది. నోయిడా అధికారులతో కుమ్మక్కై బిల్డర్ భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారని సుప్రీంకోర్టు పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ గృహ కొనుగోలు దారులు సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు.
నిర్ణీత సమయానికి డిటొనేషన్ బటన్‌ను నొక్కిన వెంటనే పేలుడు పదార్థాలు పేలడంతో వంద మీటర్ల ఎత్తయిన ఈ జంట టవర్లు కుప్పకూలిపోయాయి. కాంక్రీట్‌తో నిర్మించిన ఈ కట్టడాలు 10 సెకండ్లలో పేక మేడలా కూలిపోవడం అందరినీ ఆశ్చర్య పరచింది, అందరూ ఆనందం వ్యక్తం చేశారు. జంట టవర్లు కూలిపోవడంతో దుమ్ము, ధూళి మేఘాలు ఆ ప్రాంతంలో వ్యాపిం చాయి. ఢిల్లీ లోని ప్రతిష్టాత్మక కుతుబ్‌మినార్ కంటే ఎత్తుగా సూపర్‌టెక్ సంస్థ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో నిర్మించిన జంట భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ ట్విన్ టవర్స్ పేకమేడల్లా కుప్ప కూలాయి.
ముంబయికి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిషన్స్ కలిసి ఈ పని చేపట్టాయి. గతంలో తెలంగాణ సచి వాలయం, సెంట్రల్ జైలును, గుజరాత్‌లో పాత మొతెరా స్టేడియంను ఈ సంస్థే కూల్చింది. అయితే ఈ కూల్చివేతకు సంబంధిం చిన అన్ని ఏర్పాట్లను ఆదివారం ఉదయమే అధికారులు పూర్తి చేశారు. సూపర్‌టెక్ ట్విన్ టవర్ల చుట్టూ గాలి దిశ తూర్పు వైపు నకు మారిందని, దీని వల్ల ధూళి కణాలు ఢిల్లీకి బదులుగా గ్రేటర్ నోయిడా, బులంద్‌షహర్ వైపు మళ్లుతాయని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా పశ్చిమ దిశగా గాలి వీస్తున్నప్పటికీ ఒక్కసారిగా మార్పు వచ్చిందని ఉత్తర్‌ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు.