లిక్కర్ లింక్స్ ఇది అంతం కాదు .. ఆరంభమే
posted on Aug 28, 2022 @ 3:39PM
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత, ఈ కుంభకోణంలో తన పాత్ర ఏమాత్రం లేదని మరో మారు స్పష్టం చేశారు. కేంద్రం పై యుద్ధం ప్రకటించిన, ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్’గా, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తనపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని, అయినా భయపడేది లేదని చెప్పు కొచ్చారు. ఒక న్యూస్ చానల్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో ఆమె లిక్కర్ కుంభకోణంతో పాటుగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు సంబంధించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి, న్యాయ పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదని చెప్పారు.అదే సమయంలో ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పు కొచ్చారు. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితిలో కవిత అయినా ఇంకొకరు అయినా చేయగలిగింది ఏమీలేదు. ఎందుకంటే, ప్రాధమిక ఆధారాలను బట్టి చూస్తే, అందులో కవిత పాత్ర ఏమిటనేది పక్కన పెడితే, కుంభకోణం జరిగిందినే విషయంలో అనుమానాలు క్రమక్రమంగా తొలిగి పోతున్నాయి. ఇతర విషయాలు ఎలా ఉన్నా, సీబీఐ విచారణ మొదలు కాగానే, ఢిల్లీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు మూలాదారంగా ఉన్న, కొత్త లిక్కర్ పాలసీని తీసి పక్కన పెట్టేసింది. మళ్ళీ పాతపాలసీనే అమలు చేయాలని నిర్ణయించింది. నిర్ణయించడమే కాదు, ఆఘమేఘాల మీద, కొత్త సీసాను పాత సారాయితో నింపేసింది.
దీంతో, ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ‘దాల్ మే కుచ్’ కాలా హై’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా, కేజ్రీవాల్ చర్చను పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్నికూల్చేందుకు కుట్రలు చేస్తోందని కొత్త చర్చను తెరమీదకు తెచ్చారు
సరే,ఆ విషయం ఎలా ఉన్నా, సుమారు గంటకు పైగా సాగిన ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి బిగ్ డిబేట్ ఇంటర్వ్యూలో,కవిత హావభావాలు, చేసిన వ్యాఖ్యలు, వ్యక్తపరిచిన మర్మగర్భ అభిప్రాయాలను గమనిస్తే జరగరానిది ఏదో జరుగుతుందనే ఆందోళన ఆమెలో చాలా స్పష్టంగా కనిపించిందని, విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, కార్యక్రమం ప్రారంభంలోనే, ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, ‘టెన్షన్’ ఫీల్ అవుతున్నారా? అంటూనే చర్చ ప్రారంభించారు. ఆమె అలాంటిదేమీ లేదని, చెప్పుకున్నా ఇంటర్వ్యూ పొడుగునా ఆమె మాటలో, హవా భావాల్లో చివరకు, ఆమె నవ్వులోనూ భయంతో కూడిన టెన్షన్’ కనిపించిందనే అంటున్నారు.
అంతే కాకుండా ముందున్న ఉపద్రవాన్ని ఫేస్ చేసేందుకు కూడా ఆమె మానసికంగా సిద్దమయినట్లుందని, ఆమె సన్నిహితులే చెవులు కోరుకుంటున్నారు.
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రంపై యుద్ధం కొనసాగిస్తారని చెప్పిన కవిత, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసేఆర్’ కు భయపడుతోందని అందుకే తనను టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ని చూసి భయపడుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వం ఆయన్ని ఏమి చేయలేక తనకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంబంధం ఉందనే ఆరోపణలతో భయపెట్టాలని చూస్తోందన్నారు. ఈడీ, బోడీకి భయపడను అని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని బీజేపీ ఆయనపై రివేంజ్ తీర్చుకుంటోందన్నారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటక్స్ చేస్తోందని ఆరోపించారు. యుద్ధంలో రాజును ఓడించాలంటే తొలుత చుట్టూ ఉన్న వారిని కొడతారని తెలంగాణ విషయంలో బీజేపీ ప్రస్తుతం అదే చేస్తోందన్నారు.
అలాగే, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అన్నారు. ముందు ముందు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనేక దాడులకు పాల్పడే అవకాశం లేక పోలేదని, ముందుగానే ఒక హింట్ కూడా ఇచ్చారు. బీజేపీ తమకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించే పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం పరిపాటిగా చేసుకుందన్నారు. ప్రధాని మోడీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదన్నారామె. కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, కన్యాకుమారిలో స్టాలిన్ కుటుంబంపైనా కేసులు పెట్టారని గుర్తుచేశారు. మహారాష్ట్రలో శివసేన , ఎన్సీపీ ఎంపీలపై కేసులు పెట్టి జైల్లో ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీలో ఉందన్న కవిత ఇలాంటి సమయంలో అందరూ ప్రశ్నించకపోతే ప్రమాదం ఊహించని విధంగా ఉంటుందన్నారు.
ఇదంతా ఒకెత్తు అయితే, ఈ మొత్తం వ్యవహారంలో పరోక్షంగానే అయినా, చాలా కాలంగా ‘విశ్వసనీయ’ వర్గాల ద్వారా వినవస్తున్న కేసీఆర్ కుటుంబ కలహాల ప్రస్తావన కూడా వచ్చింది. నిజానికి, కవిత చుట్టూ ఇంత దుమారం చెలరేగుతున్నా, ముఖ్యమంత్రి, తండ్రి కేసీఆర్’, మంత్రి, అన్న రామన్న (కేటీఆర్) ఆమెపై వచ్చిన ఆరోపణలను ఖండించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించి కవిత కొంత స్మార్ట్’గా సామ్,సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి, వారు స్పందించవలసిన అవసరం లేదని, అందుకే వారుస్పందించలేదని అన్నారు. అయితే, పార్టీ నేతలంతా ఈవిషయంలో తనకు అండగా ఉన్నారన్న కవిత అవసరమైనప్పుడు కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగా స్పందిస్తారని చెప్పారు.అయితే ఆ ఇద్దరి మౌనం వెనక ఇంకేదో వ్యూహం ఉందని అంటున్నారు. తొందరపడి స్పందిస్తే చిక్కుల్లో పడతామనే భయం కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు. అయితే కవిత అన్నట్లుగా ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అయితే, ముందుముందు బుల్లి తెరపై చూడాల్సింది చాలానే ఉందని అనుకోవచ్చును.