Read more!

కింద పడినా.. పై చేయే.. బీజేపీ తీరు మారేదేలే!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక పరాన్న జీవి. రాష్ట్రంలో ఆ పార్టీకి  సొంత బలం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు రుజువైన ఈ వాస్తవం, ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరోసారి నిర్ద్వంద్వంగా తేలిపోయింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవ్ ఓటమి ఏపీలో కమలం ఒక చెల్లని నాణెం అని మరోసారి రుజువు చేసింది.  రాష్ట్రంలో బీజేపీ అధ్వాన స్థితిని మరో సారి తేటతెల్లం చేసింది.    2019 ఎన్నికల్లో ఒంటిగా పోటీ  చేసిన కమల దళం నిండా ఒక శాతం ఓటు కూడా తెచ్చుకోలేక పోయింది. బీజేపీ కంటే ‘నోటా’ కే ఆ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి.  అయినా, బీజేపీ రాష్ట్ర నాయకులు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వచ్చినా అధికారం తమదే అంటుంటారు.  అదేమంటే, ఈశాన్య రాష్ట్రాలను ఉదాహరణగా చూపుతుంటారు.

సాధారణ ఎన్నికలను పక్కన పెడితే ఒకప్పుడు మండలి ఎన్నికల్లో, ముఖ్యంగా పట్ట భద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో బీజేపీకి కొంత బలం ఉందన్నది వాస్తవం.  వి.రామా రావు,  పీవీ చలపతి రావు,  జూపూడి యజ్ఞ నారాయణ, మన్నవ గిరిధర రావు,  డీఎస్పీ రెడ్డి  ఇలా బీజేపీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో పెద్దల సభకు ఎన్నికైన చరిత్ర ఉంది. అలాగే టీడీపీతో పొత్తులో ప్రస్త్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,  పీవీ మాధవ్  ఎమ్మెల్సీ అనిపించుకున్నారు.  పొత్తు వద్దనుకుని ఇప్పుడు మాజీలుగా మిగిలారు.  అవును తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాంధ్ర సిట్టింగ్ సీటు సహా పోటీ చేసిన అన్ని స్థానాల్లో  చెల్లని ఓట్లతో పోటీ పడి మరీ చిత్తుగా ఓడి పోయింది.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గానికి ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో, బీజేపీ, టీడీపీ, ఉమ్మడి అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ గెలిచారు. నిజానికి  ఆయన గెలవలేదు.  మిత్ర ధర్మానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీయే ఆయన్ని గెలిపించింది.

ఈ సారి తెలుగుదేశంతో పొత్తు లేకపోవడం వలన  ఆయన ఓడి పోయారు. ఓడిపోవడం అంటే అలా ఇలా కాదు.. చెల్లని ఓట్ల  పాటి  ఓట్లు కూడా తెచ్చుకోలేనంత ఘోరంగా పరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో పన్నెండు వేలకుపైగా చెల్లని ఓట్లు ఉంటే.. మాధవ్ కు పదకొండు వేల ఓట్లు కూడా రాలేదు.  అంటే  ఒకప్పుడు  ఉత్తరాంధ్ర పట్ట భద్రులలో ఉన్న కొద్దిపాటి పట్టు కూడా కమల దళం కోల్పోయిందని మండలి తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి  ఇదే నియోజక్ వర్గం నుంచి గతంలో, పార్టీ సీనియర్ నాయకుడు, ఇటీవల కన్ను మూసిన పీవీ చలపతి రావు ( తాజా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తండ్రి)మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మాధవ్  ఆ వారసత్వాన్ని నిలుపుకోలేక పోయారు. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాతనే మాధవ్ కు జనసేన మిత్ర ధర్మాన్ని పాటించలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది.

అలాగే వైసీపీతో రాష్ట్ర బీజేపీ అంటకాగుతోందన్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్లిపోయిందనీ తెలిసొచ్చింది. చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం సమెతకు మాధవ్ వివరణ అతికినట్లు సరిపోతుంది. అయితే సామెత కోసమే కానీ.. నిజంగా జనసేనతో పొత్తును కొనసాగించాలని కానీ, మాటలలోనే కాకుండా చేతల్లో కూడా అధికార పార్టీకి దూరంగా ఉండాలన్న ఉద్దేశం కానీ రాష్ట్ర బీజేపీలో ఇసుమంతైనా కనిపించడం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. మాధవ్ ఇప్పుడైతే తాము కోరినా జనసేనాని స్పందించలేదంటున్నారు కానీ, మిత్ర ధర్మాన్ని పాటించి పవన్ కల్యాణ్ వద్దకు వోళ్లి మద్దతు కోరిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.   కేంద్రంలో మోడీ అధికారంలో ఉంటే.. ఇక్కడ పెత్తనం చెలాయించినా అడిగే వారు కానీ, అడ్డుకునే వారు కానీ ఉండరన్న భావనతో  రాష్ట్ర బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే తమ  వైఫల్యాలను జనసేనాని మీదకు నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీతో తాము కలిసే ఉన్నామన్నది ప్రచారమేనని నమ్మింప చూస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తరువాత మాధవ్ మాటల సారాంశమిదేనంటున్నారు. జనం నమ్మే స్థాయిలో ప్రచారం జరుగుతున్నప్పుడు ఖండించడానికి కానీ, అధికార పార్టీపై విమర్శలు చేయడానికి కానీ, కనీసం ఆ పార్టీకి దూరం జరిగే ప్రయత్నం కానీ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలకు మాత్రం రాష్ట్ర బీజేపీ నేతల వద్ద సమాధానం కరవైంది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వం జగన్ పార్టీతో అంటకాగుతోందని ఆ పార్టీ నేతలే హస్తిన వెళ్లి మరీ ఫిర్యాదు చేసిన విషయాన్ని మాధవ్, సోము వంటి వారు తమ వివరణలో కన్వీనియెంట్ గా మర్చిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి ఆ పార్టీ గుణపాఠంగా తీసుకోలేదనీ, ఇది కూడా జనసేనతో కటీఫ్ కు ఒక అవకాశంగానే భావిస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు. అంతే తప్ప రాష్ట్రంలో అధికార పార్టీతో అంట కాగడం వల్ల నామమాత్రంగా బీజేపీకి రాష్ట్రంలో ఉన్న ఓటు కూడా దూరమౌతోందన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు మాత్రం సిద్ధంగా లేరని అంటున్నారు.