Read more!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీలో వణుకు దేనికి?

వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యేలను కలవడానికి కాదు, కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడని ఆయన ఇప్పుడు పనిగట్టుకుని ఫోన్ చేసి మరీ క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నారు. ఖరీదైన స్టార్ హోటళ్లలో క్యాంపు చేయిస్తున్నారు. నియోజకవర్గానికి ఏం కావాలని ఆరా తీస్తున్నారు. తక్షణమే నిధుల విడుదలకూ ఓకే అంటున్నారు. అయినా భయపడుతున్నారు. నిఘా పెడుతున్నారు.

ఎక్కడ కట్టు తప్పుతారో అని క్షణం క్షణం ఉలిక్కి పడుతున్నారు. ఇదంతా ఎందుకా అంటే.. ఎమ్మెల్మే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి భయం ఆయననువెన్నాడుతుండటమే కారణమని అంటున్నారు.  అందుకే ఇంత కాలం పార్టీ ఎమ్మెల్యేలకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వకుండా, నియోజకవర్గ పనులన్నీ వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకే అప్పగించిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎక్కడ లేని విలువా ఇస్తున్నారు. సకల మర్యాదలూ చేస్తున్నారు.

స్టార్ హోటల్ లో క్యాంపు ఏర్పాటు చేసి వారేం అడిగితే అది చేయడానికి రెడీ అయ్యారు. సాధారణంగా విపక్షంలో ఉన్న పార్టీ తన సభ్యులను కాపాడుకోవడానికీ, పార్టీ కట్టు తప్పి వారు పక్క చూపులు చూడకుండా ఉండటానికీ క్యాంపులు ఏర్పాటు చేయడం ఇప్పటి వరకూ చూశాం. కానీ వైసీపీ అధినేత జగన్ దీ, ఆయన ప్రభుత్వానిదీ వివర్స్ వ్యవహారం కనుక ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలే క్యాంపుల్లో బందీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధినేత తమ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా అనిపించినా.. అసలు విషయం లెలిసిన ఎమ్మెల్యేలు మాత్రం అధినేత తీరు అందితే జుట్టు, లేకపోతే కాళ్లు అన్నట్లుగా ఉందని అంటున్నారు.  ప్రస్తుతం   వైసీపీకి 149 మంది సభ్యులు ఉన్నారు. వీరికి తెలుగుదేశం నుంచి ఫిరాయించిన నలుగురు, జనసేన నుంచి దూరం జరిగిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు.  ఇక విపక్ష తెలుగుదేశం పార్టీకి  అధికారికంగా 23 మంది ఉన్నా, నలుగురు ఆ పార్టీకి దూరం జరిగారు. అంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం 19.

ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించాలంటే.. కనీసం 22 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇక వైసీపీకి దూరంగా ఉన్న కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ఇప్పటికే ఆత్మ ప్రభోదానుసారం అని ప్రకటించడంతో వారిద్దరూ తెలుగుదేశం అభ్యర్థికే ఓటు వేస్తారనుకున్నా.. ఆ పార్టికి మరో ఓటు దక్కితే కానీ విజయం లభించదు.  లెక్కలు ఇంత క్లియర్ గా ఉన్నా వైసీపీ ఓటమి భయంతో వణికి పోతోంది. తమ పార్టీకే చెందిన కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడు కట్టుకుని ఉందని అనుమానిస్తోంది. తెలుగుదేశం అభ్యర్థికి పాతిక వరకూ ఓట్లు వస్తాయోమోనని ఖంగారు పడుతోంది.