Read more!

మోడీని మళ్ళీ గెలిపించడమే విపక్షాల లక్ష్యమా?!

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా చివరాఖరికి ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం, అధికారమే. అందులో సందేహం లేదు. అందుకు బీజేపీ,కాంగ్రెస్ సహా ఏ పార్టీ మినహాయింపు కాదు. అయితే ఇప్పడు 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కేంద్రంలో వరసగా రెండు సార్లు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఎ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ముఖ్యంగా బీజేపీ ఇప్పుడున్న సొంత బలం ( 303) నిలుపుకుంటుందా? ఇంకా పెంచుకుంటుందా? ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా సోనియాగాంధీ సార్యథ్యంలో ఒక సారి, రాహుల్ గాంధీ సారధ్యంలో మరో మారు చారిత్రక ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటీ? ఖర్గే సారథ్యంలో కొత్త రికార్డ్ సృష్టిస్తుందా? రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే కొందరి కల నిజమవుతుందా? కేంద్రంలో చక్రం తిప్పేందుకు తహతహలాడుతున్న ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్) అరవింద్ కేజ్రివాల్ (ఢిల్లీ) నితీష్ కుమార్ (బీహార్), కేసీఆర్ (తెలంగాణ) పరిస్థితి ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నల చుట్టూ రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. 

నిజానికి 2014కు ముందు ఇంచు మించుగా ఓ 30 ఏళ్లకు పైగా సాగిన సంకీర్ణ రాజకీయ శకంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఎ, బీజేపే సారథ్యంలోని ఎన్డీఎలలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, ప్రాంతీయ పార్టీల ఇష్టాయిష్టాలపైనే ప్రభుత్వాలు మనుగడ సాగించాయి. అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అనుహ్యంగా 30 ఏళ్లలో మొదటి సారిగా, సింగిల్ పార్టీ (బీజేపీ) కి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. 

ఇక అక్కడి నుంచి దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది, బీజేపీ హవా అనే కంటే, మోడీ హవా  అంటే ఇంకా సమంజసంగా ఉంటుంది. 2014 తర్వాత మోడీనే బీజేపీ నినాదంగా మారిపోయారు. దేశంలోనే కాదు, విదేశాలలో ఆయన ఎక్కడికి వెళ్ళినా  మోడీ ..మోడీ అనేది నినాదంగా వినిపిస్తోంది. ఇక ఎన్నికల ప్రచార సభల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. అంతా మోడీ మయం. మోడీనే బీజేపీ ఎన్నికల మంత్రం అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకే కాదు, ప్రతిపక్షాలకు కూడా మోడీనే మూల మంత్రమయ్యారు. ఎన్నికల రాజకీయానికి మోడీ కేంద్ర బిందువయ్యారు. నరేద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా  మోడీ వర్సెస్ గానే ..ఎన్నికల ప్రచారం సాగింది. ఇప్పటికీ అలాగే సాగుతోంది. నిన్నమొన్న జరిగిన ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే అయినా, రేపటి కర్ణాటక ఆ తరువాత జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే అయినా .. మోడీ వర్సెస్ ..అన్నట్లుగానే ఎన్నికల ప్రచారం సాగుతుంది.    

ఈ నేపధ్యంలోనే,2024 ఎన్నికలకు సంబంధించి పైన పేర్కొన్న విధంగా అనేక కోణాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అలాగే అనేక దేశ, విదేశీ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇంతవరకు  జరిగిన చర్చలు, రాజకీయ విశ్లేషణలు, సర్వేల సారాన్ని బట్టి చూస్తే, కాంగ్రెస్ సహా, ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీని ఒంటరిగా ఎదుర్కునే స్థితిలో లేదు. అలాగని ఎక్కడిక్కడ ద్విముఖ పోటీకి అవకాశం కల్పించే విధంగా విపక్షల ఐక్యత కోసం సాగుతున్న ప్రయత్నాలూ ముందుకు సాగండం లేదు. 
ప్రతిపక్ష పార్టీలలో తటస్థంగా ఉన్న టీడీపీ, వైసీపీ, బిజు జనతాదళ్ వంటి పార్టీలను పక్కన పెడితే బీజేపీ, మోడీని గద్దె దించే విషయంలో  ఏకాభిప్రాయంతో ఉన్న పార్టీలు కాంగ్రస్ అనుకూల, వ్యతిరేక పార్టీలుగా చీలిపోయాయి.

మమత బెనర్జీ ( తృణమూల్ కాంగ్రెస్), అరవింద్ కేజ్రివాల్ (ఆప్), కేసేఆర్ (బీఆర్ఎస్) కాంగ్రెస్ రహిత కూటమి వైపు మొగ్గుచూపుతుంటే, శరద్ పవార్ (ఎన్సీపీ),ఉద్ధవ్ ఠాక్రే (శివసేన), ఎంకే స్టాలిన్ (డిఎంకే),నితీష్ కుమార్ (జేడీయు), తేజస్వి యాదవ్ ( ఆర్జేడీ) వంటి కొందరు నేతలు, కొన్ని పార్టీలు కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమి బీజేపీని ఎదుర్కోలేదని అంటున్నారు. అయితే అదే సమయంలో నితీష్, తేజస్వీ యాదవ్ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పోకడలు తగ్గించుకుని అందరినీ కలుపకు పోవాలనే షరతు విధిస్తున్నారు. అలాగే, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు.

మరో వంక కాంగ్రస్ పార్టీ రాహుల్ గాంధీని, దేశ్ కీ నేత గా నిలబెట్టేందుకు మోకులు బిగిస్తోంది. ఈ నేపధ్యంలో విపక్షాల ఐక్యత ఎన్నికల తర్వాత ఏమో కానీ, ఎన్నికలకు ముందు మాత్రం అయ్యే పని కాదని ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న విరుద్ధ ప్రకటనలే స్పష్టం చేస్తున్నాయి. ఒక అందుకే రాజకీయ విశ్లేషకులు  ప్రతిపక్షల ‘ఐక్యత’ ఎండమావిగా మిగిలి పోతుందని అంటున్నారు. మోదీని మళ్ళీ గెలిపించడమే విపక్షాల లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు.