కనికరించు సత్తెన్నా..!

 

ఆకాశమంత పందిరి, భూదేవంత పీట.. పెళ్లి మండపం తయారీ ఖర్చే దాదాపు రెండు కోట్ల రూపాయలు.. అతిరథమహారథులైన అతిథులు.. పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు కూతురు పెళ్లి ఇలా అంగరంగ వైభవంగా జరిగింది. పిలిచినవాళ్లూ, పిలవని వాళ్లూ, సత్తెన్న కూతురు పెళ్లి చూసొద్దామని వెళ్లొచ్చినోళ్లూ.. అంతా సంతోషించారు. వేడుకకూడా ముచ్చటగా పూర్తైంది.

 

కానీ.. పెళ్లి కోసం బలవంతంగా లాక్కున్న ప్రైవేట్ వాహనాల యజమానులు మాత్రం మా వాహనాలు మాకిప్పించు సత్తెన్నా అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. అద్దెమాట దేవుడెరుగు, ముందు ఆర్సీ పుస్తకాలతో సహా తమ వాహనాల్ని తమ చేతిలో పెడితే గిరాకీల్ని కాపాడుకుని నాలుగు డబ్బులు సంపాదించుకుంటామని మొరపెట్టుకుంటున్నారు.

 

సత్తిబాబు కూతురు పెళ్లికోసం ఆర్టీయే అధికారులు ఆర్సీ పుస్తకాలతో సహా చాలామంది దగ్గర ప్రైవేట్ వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీయే అధికారులు రోజుకి చెల్లించే అద్దె వెయ్యిరూపాయలు, ఇండికాకైతే 3 0 లీటర్లు, ఇన్నోవాలాంటి పెద్ద వాహనాలకైతే 40 లీటర్లు డీజిల్ ఇస్తారు. డ్రైవర్ కి రోజుకి 200 రూపాయల బేటా.. ఇవన్నీ లెక్కేసుకుంటే అధికారుల అధీనంలో ఉన్న వాహనాలకు ఇప్పటికే దాదాపు లక్షన్నరకు పైగా అద్దె కట్టాల్సుంది.

 

పెళ్లిళ్ల సీజన్ లో బండ్లు లేక వాహనాల యజమానులు యమ యాతన పడుతున్నారు. ఇవ్వాల్సిన డబ్బు సంగతి తర్వాత చూసుకుందాం.. ముందు మా బళ్లు మాకిచ్చేస్తే పెళ్లిళ్ల సీజన్ లో నాలుగురాళ్లు సంపాదించుకుంటామంటూ వాహనాల యజమానులు కాళ్ల చెప్పులరిగేలా సత్తిబాబు ఇంటిచుట్టూ తిరుగుతున్నారు.