తెదేపాతో బీజేపీ పొత్తుకి నాగం అనుమతి కూడా కావాలా

 

అనేక కలలతో తెలుగుదేశం పార్టీ నుండి బయటకి వచ్చిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధనరెడ్డి తెరాస, టీ-జేఏసీ చేతిలో భంగపడటంతో విధిలేని పరిస్థితుల్లో బీజేపీలో జేరారు. తెదేపా నుండి బయటకి వచ్చిన తరువాత ఆయన చంద్రబాబుపై చాలా తీవ్ర విమర్శలు చేసారు. అయితే ఇప్పుడు తను చేరిన బీజేపీ కూడా మళ్ళీ తెదేపా వైపే అడుగులు వేస్తుండటంతో ఆయన కంగు తిన్నారు. బీజేపీ ప్రధాన అభ్యర్ధిగా ప్రకటింపబడ్డ నరేంద్రమోడీ తెదేపాతో పొత్తులకు ఆసక్తి చూపడం, అందుకు చంద్రబాబు కాదనకుండా వ్యూహాత్మకంగా మౌనం వహించడంతో, భూమి గుండ్రంగా ఉంటుందన్నట్లు నాగం జనార్ధన్ రెడ్డి తిరిగి తిరిగి మళ్ళీ తెదేపా దగ్గరకే చేరుకొన్నట్లయింది.

 

ఇంతవరకు తెదేపా బీజేపీతో పొత్తుల గురించి మాట్లడకపోయినప్పటికీ నాగం మాత్రం “తెదేపా తెలంగాణపై స్పష్టత ఇచ్చినట్లయితేనే పొత్తుల గురించి తాము ఆలోచిస్తామని” అన్నారు. తమ పార్టీ తెలంగాణాకు అనుకూలమని అదేవిధంగా తెదేపా కూడా ద్వంద వైఖరి విడనాడి తెలంగాణాకు అనుకూలమని స్పష్టంగా ప్రకటిస్తేనే తాము పొత్తుల గురించి ఆలోచించగలమని ఆయన అన్నారు.

 

అయితే, రెండు పార్టీల మధ్య పొత్తుల విషయంలో ఆయన నిర్ణయాలు తీసుకొనే స్థాయిలో లేరని బహుశః ఆయనకీ తెలిసే ఉండవచ్చును. చంద్రబాబు, మోడీ, బీజేపీ అగ్రనేతలు రెండు పార్టీలకు రాజకీయంగా ప్రయోజనం ఉందనుకొంటే పొత్తులకు అంగీకరించవచ్చును తప్ప నాగం జనార్ధన్ రెడ్డి అంగీకారం కోసం వారు చూడరనే సంగతి మరి నాగం గ్రహించారో లేదో. బహుశః ఆయన తెదేపాతో మళ్ళీ కలిసి పనిచేయవలసి వస్తుందనే వ్యాకులతతో ఈవిధంగా మాట్లాడి ఉండవచ్చును.