'హస్తం' పడగలో ప్రజల భవిష్యత్తు

 

 

......సాయి లక్ష్మీ మద్దాల

 

నేటి ఆంద్రప్రదేశ్ అనిశ్చిత స్థితికి కారణం ఎవరు అని ఎవరిని అడిగినా వెంటనే వచ్చే సమాధానం అన్ని రాజకీయ పార్టీల నాయకులు అని. దీనిలో మొదటగా చెప్పుకోవలసింది సోనియాగాంధీ. తన కొడుకు రాహుల్ ను ప్రధానిని చేయటానికి రాష్ట్ర విభజన అంశాన్ని తీసుకుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కాంగ్రెస్ పార్టీ వారు అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తరువాతనే విభజన ప్రక్రియ చేపట్టామని చెబుతున్నారు. మరి సోనియా గాంధీ అన్ని వర్గాల అభిప్రాయం తెలుసుకోవటానికి శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ చదివారా?చదివినతరువాత కూడా ఆమె ఆ నిర్ణయం తీసుకుంటే తెలుగు వారి పట్ల ఆమెకు ఎంత ద్వేష భావం ఉందొ తెలుసుకోవచ్చు. ఇక చరిత్ర చూసినా ఇందిరాగాంధీ కుటుంబానికి తెలుగువారంటే ఎటువంటి అభిప్రాయం ఉందొ వేరుగా చెప్పనవసరం లేదు. నాటి బ్రహ్మానందరెడ్డి,నీలం సంజీవరెడ్డి నుంచి మొదలు నేటి తరానికి తెలిసిన పి.వి.నరసింహా రావు,  ఎన్.టి.రామారావు, రాజశేఖరరెడ్డి,  చంద్రబాబునాయుడు లాంటి తెలుగు నేతల సత్త వారికి బాగా తెలుసు. అందుకే విభజించి పాలించు అనే సూత్రాన్ని అవలంబిస్తున్నారు.

 

 

ఇంతకు ముందు  తెలంగాణ కోసం  తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరిగితే,నేడు సమైక్యాంధ్ర కోసం సీమాంద్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతోంది. వీటన్నిటి నేపధ్యంలో విభజన జరుగుతుందా అంటే జరగదు అనే విశ్లేషణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.  విభజన దిశగా కేంద్రం ముందుకు వెళ్తే సీమాంద్ర మంత్రులకు,ఎంపి లకు ఈ పరిస్థితులలో కేంద్రంలో ఉన్న మైనార్టీ  ప్రభుత్వాన్ని గద్దె దించటం తప్ప మరొక అవకాశం లేదు. ఇక విభజనను సమర్ధిస్తున్న బి.జె.పి లో కూడా పరిస్థితులు మారుతున్నాయి. నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడి హైదరాబాదులో బహిరంగ సభలో ప్రసంగిస్తూ టి.డి.పి ని పొగడటం,సమైఖ్య వాది ఐన రామారావుని ప్రసంసించటం లాంటివి చేసినా, నిన్న విజయవాడలో జరిగిన సేవ్ ఆంద్రప్రదేస్ సభకు సీమాంద్ర బి.జె.పి  నేతలు సంఘీభావం తెలపటాన్ని చూసినా  వారు నెమ్మదిగా రాష్ట్ర విభజన విషయంలో యు టర్న్ తీసుకుంటున్నారని అర్ధమవుతుంది. 

                      

ఈ పరిస్థితులలో రాష్ట్ర విభజన సాధ్యం కాదు. 2014 లో సమైఖ్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. పైన ఉదాహరించుకున్న పరిణామాల నేపధ్యంలో 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్లు కూడా రావు. రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న వివిధ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో రెండు ఉప ప్రాంతీయ పార్టీలైన టి. ఆర్.ఎస్,వై.ఎస్.ఆర్.సి.పి లను బలోపేతం చేసి,టి.డి.పి ని బలహీన పరచి ఈ రెండు ఉప ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంతో తిరిగి 2014 ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కలలుకంటోంది. 2004లోను 2009లోను రెండుసార్లు కేంద్రం లోను రాష్ట్రం లోను కాంగ్రెస్ ను అధికార పీఠం మీద కూర్చోబెట్టిన తెలుగువారిపట్ల వారు అనుసరిస్తున్న వైఖరికి తగిన బుద్ధి చెప్పే అవకాశం తెలుగు ప్రజలకు ఈ ఎన్నికలలో కలుగనున్నది. 

                      

మళ్ళి ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. దేశాన్ని ప్రగతి పధం వైపు నడిపించగల తగిన సత్తా,సామర్ధ్యం గల నేత కోసం దేశం నేడు ఎదురు చూస్తోంది. అలాంటి నేతను ఎన్నుకోవటానికి ప్రజలకు మళ్ళి ఒక బంగరు అవకాశం వచ్చింది. కులమతాల కతీతంగా,ప్రాంతాలకు,వర్గాలకు అతీతంగా అవినీతి మరకలు లేని,సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగిన,దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించ గలిగిన సమర్ధుడైన నేతను ఎన్నుకొనే బాధ్యత ప్రజలందరిపైన ఉంది. ప్రజలు ఇప్పుడు కనుక చైతన్య వంతులు కాకపోతే, అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ నే అనాలోచితంగా గెలిపిస్తే ఈ దేశాన్ని రక్షించటం ఆ భగవంతుడి వల్ల  కూడా కాదు.