మతఘర్షణల నుండి లబ్ది కోసం రాజకీయ పార్టీల ఆరాటం
posted on Sep 16, 2013 @ 11:47AM
ఉత్తరప్రదేశ్, ముజఫర్ నగర్ మత ఘర్షణలలో అధికారిక లెక్కల ప్రకారం 45మంది ప్రజలు చనిపోగా దాదాపు 40,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని సమాచారం. అయితే నిజానికి ఈ సంఖ్య ఇంత కంటే చాలా ఎక్కువే ఉంటుందనేది బహిరంగ రహస్యమే. మత ఘర్షణలు వలన ఇంత మంది అమాయకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులవుతుంటే, భాద్యతగా మెలగవలసిన ప్రధాన రాజకీయ పార్టీలు, ఈ దురదృష్ట సంఘటనల నుండి లబ్దిపొందేందుకు చేస్తున్ననీచ రాజకీయాలను చూసి అక్కడి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు.
స్థానిక బీజేపీ నేత ఒకరు మత ఘర్షణలకు సంబందించి ఒక నకిలీ వీడియోను ఇంటర్ నెట్ లో పెట్టడంతో అల్లర్లు మరింత పెరిగాయని అధికారిక సమాజ్ వాదీ ప్రభుత్వం ఆరోపించింది. త్వరలో ఐదు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఈ అల్లర్లలోనష్టబోయిన హిందూ, ముస్లిం ప్రజలను ఓదార్చే మిషతో ఎలాగయినా ఆకట్టుకొని వారి ఓట్లకు గేలం వేయాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ఈ రోజు ముజఫర్ నగర్ పర్యటనకు బయలుదేరుతున్నారని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన కంటే ఒకరోజు ముందుగానే అంటే నిన్నఆదివారం నాడే ముజఫర్ నగర్ లో భాదిత కుటుంబాలను పరామర్శకు బయలుదేరారు. కానీ అక్కడి ప్రజలు నల్ల జెండాలు పట్టుకొని ఆయనకు వ్యతిరేఖంగా నినాదాలు చేయడంతో అఖిలేష్ తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని వెనుతిరగవలసి వచ్చింది.
ఇక ముఖ్యమంత్రి పదవి కోసం తహతహలాడుతున్న మాజీ ముఖ్యమంత్రి మాయావతి మత ఘర్షణలను నివారించడంలో విఫలమయిన అఖిలేష్ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి, రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర భారత రాజకీయాలపై పెను ప్రభావం చూపే ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో పైచేయి సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు విషాదకరమయిన ఈ మత ఘర్షణలను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి.