త్వరలో చంద్రబాబు తెలంగాణా యాత్ర
posted on Sep 15, 2013 @ 12:14PM
సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర పేరిట బస్సుచేసేందుకు సిద్దపడినప్పుడు, ఆయన రాకతో ప్రజలలో తమకు వ్యతిరేఖత ఏర్పడుతుందనే భయంతో స్వయంగా పార్టీ నేతలే వ్యతిరేఖించారు. ఆయనపై సమైక్యవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని వారు ఆయనని వారించే ప్రయత్నం చేసారు. కానీ వారు భయపడినట్లుగా ఆయన యాత్రకి ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు, పైగా దానివల్లే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పుంజుకొంది.
కానీ, ఈ యాత్ర తెలంగాణాలో తేదేపాకు వ్యతిరేఖ భావనలు ఏర్పడేందుకు కారణమయ్యింది. చంద్రబాబు తన యాత్రలో “తమ పార్టీ సీమాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తుందని, వారి హక్కులకోసం ఎంత పోరాటానికయినా సిద్దమని” గట్టిగా చెప్పడం వలన, తెదేపా కూడా వైకాపాలాగే తెలంగాణాను వదులుకొని, పూర్తి సీమాంధ్ర పార్టీగా మారడం తధ్యమని అందరూ భావించారు. ఒకవేళ చంద్రబాబు కూడా తెలంగాణా విషయంలో ‘మడమ తిప్పినట్లయితే’ తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని పార్టీలోని తెలంగాణా నేతలు కూడా చాలా ఆందోళన చెందారు.
అయితే చంద్ర తన మొదటి విడత ఆత్మగౌరవ యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాదు తిరిగి రాగానే వారికి ఉపశమనం కలిగిస్తూ తను తెలంగాణాలో కూడా పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు రోడ్ మ్యాప్ సిద్దం చేయమని చెప్పారు. తెదేపా టీ-ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, త్వరలో చంద్రబాబు తెలంగాణాలో బస్సు యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలియజేసారు.
తీవ్ర వ్యతిరేఖ పరిస్థితుల నడుమ సీమాంధ్రలో తను చేసిన బస్సు యాత్ర విజయవంతం అవడంతో, దాదాపు అటువంటి పరిస్థితులే నెలకొన్న తెలంగాణాలో కూడా ఇప్పుడు యాత్ర చేయడం సాధ్యమేనని ఆయనకు నమ్మకం కలిగినందునే ఇందుకు సిద్దపడుతుండవచ్చును. ఆయన తన ఆత్మగౌరవ యాత్ర ద్వారా సీమాంధ్రలో పార్టీ శ్రేణులకు ఏవిధంగా కొత్త ఉత్సాహం కలిగించగలిగారో, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణాలో కూడా పార్టీ శ్రేణులలో పార్టీపట్ల నమ్మకం నిలిపేందుకు యాత్ర చేసి తద్వారా అక్కడ కూడా పార్టీని బలపరచుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నట్లు అర్ధం అవుతోంది.
కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పరచడం ద్వారా అక్కడ పాగా వేయాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీ, దానితో చేతులు కలిపేందుకు సిద్దపడుతున్న తెరాసలు, తీవ్ర ప్రతికూలపరిస్థితులలో నెగ్గుకొచ్చిన చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణాలో కూడా పర్యటించి మళ్ళీ పార్టీని బలపరచుకోబోతుంటే ఆయనతో ఏవిధంగా వ్యవహరిస్తాయో చూడాలి.