జగన్‌తో కౌగిలింతలు.. బండారం బయటపెడతానన్న ఎమ్మెల్యే..
posted on Aug 25, 2021 @ 6:58PM
సోదర భావంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క టీడీపీ అధినేత చంద్రబాబుకు రాఖీ కట్టారు. ఆమె ఇలా రాఖీ కట్టడం ఇదే మొదటిసారి కూడా కాదు. తన రాజకీయ గురువుకు దశాబ్దంన్నరగా సీతక్క రాఖీ కడుతూ ఉన్నారు. టీడీపీని వీడినా.. కాంగ్రెస్‌లో ఉంటున్నా.. చంద్రబాబు తనకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తుపెట్టుకొని రాఖీ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అడవి బిడ్డ సీతక్కను సానబట్టి.. స్ట్రాంగ్ లీడర్‌గా, ఎమ్మెల్యేగా చేసినందకు చంద్రబాబుకు సీతక్క ఇప్పటికీ కృతజ్ఞతగా ఉంటున్నారు. ఇటీవల సీతక్క తల్లి కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరితే చంద్రబాబు వెళ్లి పరామర్శించారు కూడా. తాజాగా ఆయనకు రాఖీ కట్టి.. చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. అయితే, సీతక్క చంద్రబాబుకు రాఖీ కట్టడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేయడం కలకలం రేపుతోంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బానిస రాఖీ కట్టిందంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై లేటెస్ట్‌గా సీతక్క ఓ రేంజ్‌లో మండిపడ్డారు.
రాఖీ పండగను కూడా రాజకీయం చేస్తున్నారా అంటూ మొదలుపెట్టి.. రోజా, జగన్, కేసీఆర్‌లపై మాటలతో విరుచుకుపడ్డారు సీతక్క. పార్టీ మారినందుకో.. ప్రాంతం వేరైనందుకో.. బాబు సీఎం కానందుకో.. రాఖీ కట్టకుండా ఉండాలనుకునే వ్యక్తిని కాదని సీతక్క స్పష్టం చేశారు. సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు.. నన్ను బానిస అంటారా? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమ్మక్క సారలమ్మ వారసులం. నిజాం వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం వారసులం. దొరతనాన్ని తరిమికొట్టిన బిడ్డలం.. బిడ్డా ఖబడ్దార్ అంటూ రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీతక్క. బానిసత్వానికి బడితెపూజ చేశామని.. కోవర్టులను కోసిన చరిత్ర తమదని సీతక్క అన్నారు. ఆ రోజుల్లో నక్సలైట్‌గా ఉన్నా నిబద్ధతతో పనిచేశానని.. టీడీపీలో ఉన్నా.. కాంగ్రెస్‌లో ఉన్నా అంతే కమిట్‌మెంట్‌తో పనిచేస్తామని చెప్పారు. నువ్వు, నీ మంత్రులు ఎక్కడ అధికారముంటే అక్కడ జై అంటారు. నీ అధికారం పోగానే నిన్ను కూడా భౌభౌ అంటారంటూ రోజాను మాటలతో కుళ్లబొడిచారు సీతక్క.
ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాతో సీఎం కేసీఆర్ నెరుపుతున్న సంబంధాలపైనా ఘాటైన విమర్శలు చేశారు సీతక్క. కేసీఆర్ తిరుపతిలో రోజమ్మ ఇంట్లో అన్నం తిని రావొచ్చు.. రాయలసీమ పోయి నీళ్తు ఇస్తామని చెప్పి రావొచ్చు కానీ.. పోతిరెడ్డిపాడు నుంచి జగన్ నీళ్లు తీసుకుపోతుంటే కండ్లప్పగించి చూస్తూ ఉండి.. ఇప్పుడు జగన్ నీళ్లు తీసుకుపోతున్నాడంటూ తెలంగాణలో సీఎం కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు సీతక్క. సీఎం జగన్‌ను కౌగిలించుకుని.. వంగి వంగి దండాలు పెట్టి.. ఇప్పుడు గొడవపడుతున్నట్లు మోసం చేస్తున్నారని కేసీఆర్‌ను గట్టిగా విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.