జోకర్ మల్లన్న.. బ్రోకర్ మల్లన్న.. ఓ రేంజ్‌లో రేవంత్‌రెడ్డి ఫైర్..
posted on Aug 25, 2021 @ 7:31PM
‘‘నేను దీక్ష చేపట్టి 24 గంటలయింది. పాల అమ్మేవాళ్లు రాలేదు. నీళ్లు అమ్మే వాళ్లు రాలేదు. భూములు కబ్జాలు చేసే వాళ్లు రాలేదు. జోకర్ మల్లన్న కూడా రాలే. ఈ భూమ్మీద జోకర్లను చూశాం. బోకర్లను చూశాం. కానీ పాల మల్లిగాడు సగం జోకర్.. సగం బ్రోకర్. వేదికలెక్కితే జోకర్‌లా మాట్లాడతారు. వేదిక దిగితే భూముల బ్రోకర్‌లాగా మాట్లాడుతారు. ఎవరు భూములు అమ్మినా.. కొనుగోలు చేసినా ఈ పాల మల్లిగాడికి కమీషన్ ఇవ్వాల్సిందే.’’ అంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి.. మంత్రి మల్లారెడ్డిపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని విమర్శించారు.
మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దీక్ష ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి మల్లారెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు రేవంత్‌రెడ్డి. సీఎం కేసీఆర్ మాటలు అబద్ధాల మూటలన్నారు. దత్తత గ్రామాలను దగా కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక్క హామీనీ నెరవేర్చలేదని.. ఒక్క హామీ నెరవేర్చినా తన ముక్కు నేలకు రాస్తానని చెప్పానని.. అయినా సీఎం కేసీఆర్ తనతో చర్చకు రాలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
రేవంత్‌రెడ్డి ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి సైతం అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని తెలిపారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నానని చెప్పారు మంత్రి మల్లారెడ్డి.
‘‘ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్ నా సవాల్ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తా. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. రేవంత్ పీసీసీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో’’ అంటూ రేవంత్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. ఇద్దరి మాటకు మాట తెలంగాణలో పొలిటికల్ హీట్ అమాంతం పెంచేసింది.