మన చదువులు మేడిపండు చందం

 

 

 

 

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల పిల్లలు సంపూర్ణ వ్యక్తులుగా ఎదగలేక కేవలం మరబొమ్మలుగా తయారవుతున్నారు. మన భావి భారతం ఇలాగేనా ఉండాల్సింది? ప్రపంచ దేశాల ముందు భారతావని నవ్వులపాలు అవ్వక తప్పదా? ఈ పరిస్థితికి కారణం ఎవ్వరు?విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలదా? మిడిమిడి జ్ఞానం తో ఉన్న తల్లిదండ్రులదా? లేక ఎదిగీ ఎదగని సమాజానిదా? ఎవరిది తప్పు? ...ఆలోచిస్తే అందరిది అని అనిపిస్తుంది కదా....

 

 పక్కింటి పిల్లవాడు ఏం చదువుకుంటే మనకెందుకు? ఒకటి... వెళ్లి మనవాడితో వాడిని పోల్చటం, ఫలితం.... 'మరమనిషి బ్రతుకు'... ఇది అవసరమా? అందరూ డాక్టర్లు, ఇంజినీర్లేనా? ఇంకా వేరేవి చదువులు కావా? ఒక సమాజం, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఒక రైతు, సైనికుడు, పోలీస్, టీచర్, డాక్టర్, ఇంజినీర్, సైంటిస్ట్... ఇలా చెప్పుకుంటూపోతే  చాలా మంది కావాలి. ఎవరి వృత్తిలో వారు గొప్ప. ఎవరి వృత్తి వారికి గొప్ప. కాని నేడు మన ఆలోచనలు కొన్ని రంగాలకే పరిమితమైపోతున్నాయి.



       ఇవాళ విద్యావిధానం పరిశీలిస్తే మొత్తం బట్టీ విధానమే తప్ప సృజనాత్మకతకు, ఆలోచనాపటిమకు, భావవ్యక్తీకరణకు ఎలాంటి ప్రాధాన్యత ఉండటం లేదు. పాఠ్య పుస్తకాలలో ఉన్నది ముందు టీచర్ లు బట్టీ పట్టి పిల్లల చేత బట్టీ వేయించటం.... ఇక వారు సొంతంగా ఏం ఆలోచిస్తారు? కొత్తకొత్త విషయాలను ఎలా కనుగొంటారు? అది ఇంటి నుండే మొదలవ్వాలి. వారి పనులు వారు సొంతంగా చేసుకునే స్వాతంత్ర్యం, వెసులుబాటు తల్లిదండ్రులు పిల్లలకు కల్పించాలి. 15 ఏళ్ళు వచ్చిన వాడికి కూడా ఏం తినాలో, ఏం  తినకూడదో, ఏ బట్టలు వేసుకోవాలో, ఏ సినిమా చూడాలో, ఏ ఆటలు ఆడాలో, ఎవరితో స్నేహం చేయాలో, చివరికి ఎలాంటి కలలు కనాలో కూడా తల్లిదండ్రులే నిర్ణయిస్తే.... భవిష్యత్తులో వాడు ఏం అవుతాడు... ఒక మర మనిషి కాక...



       చదువు పేరుతో ఈ రోజు పాఠశాలలో జరుగుతున్నది నిజంగా చాలా దారుణం. ఆ స్కూళ్ళల్లో ఆట స్థలాలు ఉండవు... ఆటలు ఉండవు.... కేవలం చదువు! చదువు! ఆటపాటలు లేకపోతే పిల్లలకు మానసికోల్లాసం ఎక్కడనుండి వస్తుంది? మానసికోల్లాసం ఉంటేనే కదా పిల్లలు ఏదైనా భిన్నంగా ఆలోచించగలుగుతారు. చదువుతున్న చదువుకు తగిన పాఠాలు చెప్పరు ... ఫలితంగా ఇతర అంశాల పట్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానం తగ్గుతుంది. బాలబాలికల వయసుకు తగినట్లు పాఠ్యాంశాలు ఉండి, అలాంటి పాఠాలు చెబితే... వారికి అన్ని విషయాల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. జీవితం లో ఒడిదుడుకులను ఎదురుకోవడం కోసం శ్రమించి సాధించే మనస్తత్వాన్ని వారిలో వృద్ధి చేయాలి. అప్పుడే వారు వారి జీవితంలో సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు.



       జాతీయ విద్యావిధానానికి కాలం చేల్లిందన్న చేదు నిజం, ఇటీవలే మన్మోహన్ మంత్రి వర్గంలో మళ్లీ అడుగిడిన శశి థరూర్ నోటి వెంట తన్నుకొచ్చింది. వారు చెప్పినట్లు దేశ అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చి దిద్దడంలో మన  పాఠశాలలు, కళాశాలలే కాదు విశ్వవిద్యాలయాలు కూడా ఘోరంగా విఫలమవుతున్నాయి. 621 విశ్వవిద్యాలయాలు, 33,500 కళాశాలలతో కూడిన భారత ఉన్నత విద్యావ్యవస్థ- చెప్పుకోవడానికే .... అయినా కాని మన విద్యార్థులు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్ళాల్సి రావడమే చెబుతోంది- ఇక్కడ రాశి ఘనం.... వాసి హీనమని.



             అసలీ పరిస్థితి దాపురించడానికి కారణం ఎవరు? భవిష్యదవసరాలకు ధీటుగా ఉన్నత విద్యారంగ పరిపుష్టీకరణ జరగాలని 1949లోనే విశ్వవిద్యాలయ సంఘ అధ్యక్షులుగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ దిశానిర్దేశం చేశారు. దానిని కేంద్రంలో కొలువుదీరిన ప్రభుత్వాలన్నీ పోటాపోటీగా తుంగలో  తొక్కాయి. "ఆలోచనను సృజించి వాటికి ఆలంబనగా నిలిచి, అవి బలం పుంజుకుని, ఎదిగి, రెక్కలు తోడుక్కోవడానికి దోహదపడేదే విశ్వవిద్యాలయమన్నది " అని ప్రొ. యష్ పాల్ కమిటీ నివేదికలో పొందుపరిచిన అర్థవంతమైన నిర్వచనం. ఆ స్ఫూర్తిని దశాబ్దాల క్రితమే వంటబట్టించుకున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు సాధించటంలో విశేష ప్రగతి నమోదుచేసుకున్నాయి.



             విశ్వవిద్యాలయాలకు, పరిశ్రమలకు మధ్య నిరంతర అనుసంధానం, అవసరానుగుణంగా తరచూ పాఠ్యాంశాలలో మార్పులు... ఆ మేరకు ఎలాంటి బంధనాలు లేకుండా సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించగల వెసులుబాటు... ఇవన్నీ అక్కడి ప్రమాణాల పెంపుదలకు తోడ్పడుతున్నాయి. రాజకీయ  తాబేదారుల్ని, ఉన్నతాధికార వర్గాలను ఉపకులపతులుగా ఎంపిక చేయోద్దన్న జాతీయ విజ్ఞాన సంఘం సిఫార్సులు నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. కుల... మత ప్రాతిపదికన, అనుచిత ఒత్తిళ్లకు లోబడి కీలక నియామకాలు యధేచ్చగా జరుగుతున్నట్లు సాక్ష్యాత్తు "ప్రధాన మంత్రే" 5 ఏళ్ళ నాడు లెంపలేసుకున్నారు.



         వ్యవస్తాగాతమై వర్ధిల్లుతున్న ఈ అలసత్వమే మేడిపండు చదువులకు నారు... నీరు  పోస్తోంది. ఫలితం, విద్యాలయాల్లో మరబొమ్మల తయారీ... ఈ విద్యావ్యవస్థ బాగుపడాలంటే విశ్వవిద్యాలయాలకు పట్టిన 'కుల, రాజకీయ వ్యవస్థ' అనే చెదలను వదిలించాలి.