తెలంగాణ పై చంద్రబాబు వైఖరి

 

 

 

 

మే 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు తెదేపా మహానాడు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ తాను తెలంగాణ విషయంలో 2008 నాటి మాటలకే కట్టుబడి ఉన్నానని, అందులో తన వైఖరి మారలేదని వ్యాఖ్యానించారు. వైఖరి మారలేదని అంటే దాని అర్థం ఏమిటి? ఇదే నినాదంతో 2014 ఎన్నికల బరిలో నిలబడితే ఆయన ఆంధ్ర ప్రాంత ప్రజల మన్నలను ఎలా పొందగలడు? ఎలా గెలవగలడు? 2014 లో తెదేపా అధికారంలోకి వస్తే కేంద్రప్రభుత్వ నిర్ణయానుసారం రాష్ట్రాన్ని రెండుగా విడగోట్టగలడా? అలా విడగొట్టడాన్ని ఆయన సమర్థిస్తారా? దాని వలన ఆయన సాధించేదేమిటి? అదే కనుక కొనసాగితే అపర చాణక్యుడిగా పేరు గాంచిన ఆయన తెలివి, సామర్థ్యం ప్రశ్నార్థకం కావా?


 శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి విషయంలో వెనుకబడిందని తేలింది. చంద్రబాబు మహానాడులో ప్రసంగిస్తూ తెలంగాణలో అభివృద్ధికి తానే కారణం అన్నారు. మరి ఆ విధంగా పరిశీలిస్తే ఆంధ్ర ప్రాంతంలో అభివృద్ధి కుంటు పడడానికి చంద్రబాబే కారణం కదా! 2004లో వైయస్ఆర్ కెసీఆర్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణా అంశాన్ని రాజకీయంగా వాడుకుని, తరువాత కెసిఆర్ ని ఏ విధంగా ప్రలోభపెట్టి అణిచి వేశాడో కాని 2009లో వైయస్ఆర్ మరణానంతరం కాని కెసిఆర్ కి తెలంగాణా ఉద్యమం గుర్తుకురాలేదు.



           అయితే, 2009లో చంద్రబాబు, కెసిఆర్  తో పొత్తు పెట్టుకున్నందునే కదా... ఆ తరువాతి పరిణామాలలో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆ తీవ్రత కారణంగానే కదా చిదంబరం డిసెంబర్  9 నాడు తాము తెలంగాణకు అనుకూలమనే ప్రకటన అర్థరాత్రి ప్రకటించాల్సి వచ్చింది. అంటే నేడు రాష్ట్రం తెలంగాణ విషయంలో రావణ కాష్టంలా మారటానికి రాజశేఖర రెడ్డి ఎంతవరకు కారణమో, చంద్రబాబు అంతకు మించి కారణం అయ్యాడు.



           2014లో తేదేపా అధికారం లోకి వస్తే తెలంగాణ ఉద్యమాన్ని, కెసిఆర్ ని, తెరాస ని అణిచివేయగల సత్తాగాని, తెలంగాణ  సామర్థ్యం గాని ఏమైనా ఉన్నాయా?మరెందుకు ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం?



            నాయకులున్నది ప్రజల సమస్యలు తీర్చటానికి. కాని ఆ నాయకులే ప్రజలకు సమస్యగా మారితే ప్రజాసంక్షేమం అనేది గాలిలో దీపమే. ఈ రోజున ఉన్న రాజకీయ నాయకులకు కావలిసినది తమకు ఒక పదవిని సంపాదించుకొని, తద్వారా తాము కూడబెట్టిన ఆస్తులను కాపాడుకోవడం తప్పా... రాష్ట్రాభివృద్ధి ఎంతమాత్రం కాదు. దానికి చంద్రబాబు నాయుడు ఏమీ మినహాయింపు కాదు.



          ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్ర ప్రాంత అభివృద్ధిని చంద్రబాబు నాయుడు ఏనాటికి సాధించగలడు? ఎందుకంటే, ఈనాడు మనం చూస్తున్న అభివృద్ధి ఒక్కరోజుతో వచ్చిందా? 60 సం.రాల శ్రమ ఫలితం ఈనాటి మన రాష్ట్రం. మరి ఇప్పుడు కొత్తగా అభివృద్ధి మొదలుపెట్టి ఎన్నేళ్ళకు చూపిస్తారు?



            ఏది ఏమైనా విజన్ 20 అంటూ కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి అవకాశవాద రాజకీయాలకు పూనుకోవడం కడుశోచనీయం. ఏనాడు ప్రజలు చాలా మంది వోట్లు వేయడానికి సుముఖంగా లేరు. కానీ బాబు గారి ఇలాంటి వైఖరి వల్ల ఆ సంఖ్యా మరింత పెరిగే అవకాశం ఉంది.