మూర్తీభవించిన మానవత్వం..ఏంజెలీనా
posted on May 16, 2013 @ 9:57AM
ఆమె అందానికి ప్రతిరూపం... ప్రపంచ ప్రసిద్ధ నటి... ఆస్కార్ అవార్డు గ్రహీత... ఆమె మరేవ్వరోకాదు... ఏంజెలినా జోలి. ఆమె వయస్సు 37 సం.లు. ఇది నాణానికి ఒకవైపు. నాణానికి మరోవైపు చూస్తే జన్యు పరంగా వచ్చే రొమ్ము కేన్సర్ తనకు సోకే ప్రమాదం 87% ఉందని, అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం 50% వరకు వచ్చే ప్రమాదం ఉందని వైద్యుల ద్వారా తెలుసుకున్న ఆమె క్రుంగిపోలేదు. మానసికంగా ముందు తనని తాను సిద్ధం చేసుకొని, అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ ద్వారా తన రొమ్ము కణజాలాన్ని తొలగించి దాని స్థానంలో తాత్కాలిక ఫిల్లర్లు అమర్చారు. 9 వారాల తరువాత రొమ్ముల పునర్నిర్మానంతో చివరి ఆపరేషన్ ను పూర్తి చేసుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని 87% నుండి 5% కి తగ్గించుకోగలిగారు.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే పదేళ్ళపాటు కేన్సర్ తో పోరాడిన అనంతరం 56 ఏళ్ళ వయస్సులో జోలి వాళ్ళ అమ్మగారు రొమ్ము కేన్సర్ తో చనిపోయారు. జోలి మంచి వైద్య పరమైన అవగాహనతో కేన్సర్ ను ఎదురించగలిగారు. అంతే కాదు, ఇలాంటి వ్యక్తిగత అంశాలని బయటకు వెల్లడించడానికి ఎవరూ ఇష్టపడరు. కాని ఆమె తన స్వీయ అనుభవం తో న్యూ యార్క్ టైమ్స్ అనే పత్రిక లో "my medical choice" అనే శీర్షిక తో ఒక వ్యాసాన్ని కూడా రాశారు.
కుటుంబ పరంగా ఈ వ్యాధుల చరిత్ర ఉన్నవాళ్ళు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. మాస్టెక్టమి చేయించుకోవాలన్న నిర్ణయం అంత సులభమేమీ కాదు అని, కానీ తను ఆ నిర్ణయం తీసుకున్న తరువాత ఎంతో సంతోషంగా ఉన్నానని ఆ వ్యాసం లో పేర్కొన్నారు. ఏటా రొమ్ము కేన్సర్ తో 4,58,000ల మంది... ప్రధానంగా పేద, మధ్య స్థాయి దేశాలలో మరణిస్తున్నారని పేర్కొన్నారు.
ఇక ఆమె వ్యక్తిత్వం విషయానికి వస్తే, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మైహిళ ఆమె. ఆమె ఐక్య రాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. ఘర్షణలు చెలరేగే ప్రాంతంలో లైంగిక హింసకు వ్యహిరేకంగా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రొమ్ము కేన్సర్ కు చికిత్స తీసుకుంటూనే ఆమె Democratic Republic of Congo వెళ్ళారు. లండన్ లో జరిగిన జి8 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. తాలిబాన్ ల చేతిలో దాడికి గురైన మాలాల నెలకొల్పిన బాలికల విద్యా సంస్థకు నిధులు సేకరించారు. ఆన్నింటికి మించి ఆమెకు ముగ్గురు సంతానం. మరో ముగ్గురు అనాధ పిల్లలను దత్తత తీసుకున్నారు.
ఏంజెలీనా జోలి నుండి మన నటీనటులు చాలా నేర్చుకోవాలి. తాత వారసుడినని, నాన్న వారసుడినని, మేనమామ వారసుడినని తోడగోట్టే వంశమని పనికి మాలిన అంశాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తూ జబ్బలు చరుచుకునే వీరులు కనీసం తమ సినిమా పరిశ్రమలో కార్మికులనైనా ఆదుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని హీరోలమని చెప్పుకునే జీరోలు. పది మంది డూపులని పెట్టుకుని తెరమీద ఇరగదీసే సాహస దృశ్యాలను చిత్రీకరిమ్పచేసుకోవడం కాదు. నటన అంటే ప్రతి డైలాగుకొకసారి నా వంశమేమితో తెలుసా, నా వంశ చరిత్ర ఏమిటో తెలుసా? అంటూ పనికిమాలిన సంభాషణలు పేల్చటం కాదు. నటుడు అనగానే అద్దాల మేడకు అంకితమై ప్రేక్షకుడికి అందనంత దూరంలో సామాన్య మానవుడికి, బడుగు జీవికి తానేదో ఒక పరమాత్ముడిలా ఒక భయంకరమైన వలయాన్ని గిరిగీసుకుని కూర్చోవటం కాదు. ఒక సామాన్య ప్రేక్షకుడు, ఒక సగటు మనిషి, ఒక బడుగు జీవి వందల్లో డబ్బులు వెచ్చించి టిక్కెట్ కొనుక్కుని సినిమా చూస్తేనే ఈ నటులంతా కోట్లకు పడగలెత్తారు. అంతే గాని దివి నుంచి భువికి ఊడి పడిన దైవాంశ సంభూతులేమి కారు వీరంతా.
వీళ్ళ సినిమాలలో కథాబలం ఉండదు, వీళ్ళ వ్యక్తిత్వంలో నైతిక బలం ఉండదు. ఒక సెలబ్రిటీ 10 మందికి ఆదర్శప్రాయంగా ఎలా బ్రతకొచ్చో ఏంజెలీనా జోలి జీవితాన్ని చూసి వీళ్ళు నేర్చుకుంటే కనీసం మనుషులుగా మిగులుతారు.... లేకపోతే సినిమాలోను, నిజజీవితంలోను కూడా నటులుగానే మిగిలిపోతారు.