Read more!

చాణక్యుడు చెప్పిన ఈ నీతి పాటిస్తే డబ్బుకు లోటుండదు..

తినడానికి తిండి.. కట్టుకోవడానికి బట్ట.. విద్య నుంచి వైద్యం వరకు.. చివరికి మంచినీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ డబ్బు విలువను చెప్పకనే చెబుతున్నాయి. పొద్దున్న లేచింది  మొదలు రాత్రి నిద్రించే వరకు మనిషి జీవితంలో ప్రతిదీ డబ్బుతో ముడిపడివుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందుకే ఈ భూమిపై జీవిస్తున్న మనుషుల్లో అతికొద్ది మినహా మిగతావారంతా ధనార్జనలో తలమునకలవుతున్నారు. పేద, ధనిక అనే భేదం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసం పరితపిస్తున్నారు. కానీ కొంతమంది ఎంత శ్రమించినా కష్టానికి తగ్గ డబ్బు మిగలదు. చేతిలో డబ్బు ఆగక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారి ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతి శాస్త్రంలో కొన్ని సూచనలు చేశాడు. అవేంటో తెలుసుకుని పాటిస్తే ఎంత చిన్న మొత్తం సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం ఖాయం..

అహంకారం ఉంటే ధనం నిలవదు..

అవసరాల కోసం డబ్బు సంపాదన అందరికీ అనివార్యమే. కానీ ఏ మనిషీ డబ్బు మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదు. డబ్బు సంపాదనతో అహంకారం ఆవహిస్తుందని, అహంకారం ఉన్నచోట డబ్బు నిలవదని చాణక్యుడు చెప్పాడు. అందుకే చేతిలో డబ్బు ఉన్నప్పుడు మురిసిపోకుండా..  లేనప్పుడు కుంగిపోకుండా ఎప్పుడూ నిరాడంబరంగా ఉండాలి. అందరినీ సమదృష్టితో చూడాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. అప్పుడు మాత్రమే అహంకారం దూరమై చేతిలో డబ్బు నిలుస్తుంది.

ఇంట్లో ధాన్యం ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు..

ఇంట్లో నిండుగా ధాన్యాగారం ఉండటం చాలా శుభప్రదమని చాలామంది చెబుతున్నారు. ఇది సత్యమేనని చాణక్యనీతి కూడా చెబుతోంది. ధాన్యం ఇంట్లోవారి ఆకలి తీర్చడమే కాకుండా ఆ గృహంలో సంపదను శాశ్వతం చేస్తుందని చాణక్యనీతి వివరిస్తోంది.  ఇంట్లో ధాన్యం అయిపోకముందే మరింత ధాన్యాన్ని తెచ్చిపెడితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇంటిపై ఉండేలా చూసుకోవచ్చు. అలాగే ఆహారాన్ని ఎప్పుడూ అగౌరవపరిచేలా ప్రవర్తించకూడదు.

ఇంట్లో చింతలుంటే ధనం నిలవదు..

కొంతమంది ఇళ్లలో ఎప్పుడుచూసినా చింతలు, కష్టాలు, కన్నీళ పరిస్థితులు కనిపిస్తుంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ పరిస్థితులు ఇంట్లో రణరంగాన్ని తలపిస్తుంటాయి. అయితే అలాంటి ఇళ్లలో ధనలక్ష్మి ఉండదని చాణక్య నీతిశాస్త్రం చెబుతోంది. అన్నివేళలా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. కాబట్టి లక్ష్మీదేవి నిలవాలనుకునేవారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఆర్థిక అంశాలు రహస్యంగా ఉండాలి..

వ్యక్తిగత ఆర్థిక విషయాలను గోప్యంగా ఉంచుకోవాలని చాణక్యనీతి సూచిస్తోంది. ఆర్ఠిక లక్ష్యాలు ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతోంది. ఎందుకంటే ఎవరైనా కించపరిస్తే లక్ష్యం నుంచి దృష్టి మరలే అవకాశం ఉంటుంది. అందుకే తెలివైన వ్యక్తులు ఆర్థిక అంశాల్లో గోప్యతను పాటిస్తుంటారు.

ఖర్చు పెట్టడం తెలియాలి..

డబ్బు సంపాదించడమే కాదు.. దాన్ని  ఖర్చుపెట్టే విషయంలో నేర్పు ఉండాలి. కష్టకాలంలో డబ్బు ఏవిధంగా అక్కరకొస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చుపెట్టాలి. సాయాలకు, పెట్టుబడులకు, ఆత్మరక్షణ కోసం వెనుకాడకుండా ఖర్చుచేయవచ్చు. అలాగని కేవలం ఆస్తులు పోగేసుకోవడమే లక్ష్యంగా ఖర్చు ఉండకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సంపదను జల్సాలకు ఉపయోగించడం ఏమాత్రం మంచిదికాదు. నీళ్లలా వృథా చేస్తే లక్ష్మీదేవి నిలవదు. వివేచనతో సమయానుగుణంగా ఖర్చుచేయడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.

అక్రమ సంపాదన నిలవదు

డబ్బు సంపాదన కోసం కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటుంటారు. కాలం కలిసొస్తే గట్టిగానే పోగేసుకుంటారు. కానీ అలాంటివారి వద్ద ఎల్లకాలం సంపద నిలవదు. డబ్బుని ఆర్జించే విషయంలో ఎల్లప్పుడూ న్యాయం, నిజాయితీగా మెలగాలి. అనైతిక మార్గాల ద్వారా వచ్చిన డబ్బు ఎల్లకాలం నిలవదు. అందుకే డబ్బును ఎప్పుడూ ధర్మబద్ధంగానే సంపాదించాలి.


                                       *నిశ్శబ్ద.