Read more!

యుద్దాలకు, ఘర్షణలకు ముగింపు పలకాలంటే ఇదే మార్గం..

ఇద్దరు వ్యక్తులు, రెండుకుటుంబాలు, ఇరుగు పొరుగు, గ్రామాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు ఇలా ఏ రెండింటిని గమనించినా ఖచ్చితంగా ఏదో ఒక అభిప్రాయ భేదం, లేదా ఏదో ఒక అపార్థం ఉండనే ఉంటుంది. ఈ అపార్థాలు సహజంగా సమసిపోతే సమస్యే లేదు. కానీ అవి కాస్తా క్రమంగా పెద్ద సమస్యలుగా మారితే అన్ని రకాల నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇద్దరు మనుషుల మధ్య సంఘర్షణ మితిమీరితే అది ఘర్షణకు దారితీసినట్టు, రెండు ప్రాంతాలు, దేశాలు మధ్య సంఘర్షణ పెరిగితే అది యుద్దాలకు దారితీస్తుంది.  మొన్నటిదాకా జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్దమైనా, ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్దమైనా దీనికి ప్రధాన కారణం సంఘర్షణే. సమస్యలను ఆరోగ్యకరమైన రీతిలో పరిష్కరించుకుంటే  అవి నష్టాలకు దారితీయకుండా సమసిపోతాయి. ఆరోగ్యకరమైన పరిష్కారాలకు ఎప్పుడూ శాంతి అవసరం అవుతుంది. శాంతి ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన సంఘర్షణ పరిష్కార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రాముఖ్యత, దీని చరిత్ర, దీని వెనుక కృషి మొదలైన విషయాలు తెలుసుకుంటే..

చరిత్రలో ఏముంది?

సంఘర్షణ పరిష్కార దినోత్సవం అనేది శాంతి మార్గంలో సంఘర్షణలను పరిష్కరించే దిశగా అవగాహన పెంపొందించడం. దీన్ని ప్రపంచం యావత్తు జరుపుకుంటారు. అసోసియేషన్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్  రిజల్యూషన్ దీన్ని 2005లో స్థాపించింది. దీని ప్రధానఉద్దేశం  సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా అహింసా మార్గంలో పరిష్కరించడం. ఈ పద్దతుల మీద అవగాహన పెంచడం. పాఠశాలలు, కార్యాలయాలు, న్యాయవ్యవస్థ, కుటుంబం మొదలైన సాధారాణ జీవనశైలిలో కూడా దీన్ని భాగం చేయడం. కూర్చుని, మెల్లగా మాట్లాడుకోవడం, చర్చించుకోవడం చేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయనే మాట చాలామంది వినే ఉంటారు. అదే దీనికి అన్వయించవచ్చు.

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతియుతంగా సమస్యలను పరిష్కరిస్తే ఈ ప్రపంచంలో ఎన్నో పెనుముప్పులను ఆపవచ్చు. ఈ ఆలోచనతోనే మహాత్మాగాంధీ, మేరీ క్యూరీ, హోరేస్ మాన్, డోలోరెస్ హూర్టా వంటి మహోన్నత వ్యక్తులు  అహింసా మార్గంలో సమస్యల పరిష్కారానికై  తమ జీవితాన్ని వెచ్చించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ఈ తరహా మార్గం వైపు ప్రజలను ప్రోత్సహించడం, తాము ఆ మార్గంలో ప్రయాణిస్తూ ప్రజలను నడిపించడం ఎంతో అవసరం.

ఏం చేయొచ్చు..

సమస్య దేశాల మధ్యా, లేదా మనుషుల మధ్య అనే విషయం కాదు. తమకు దగ్గరలో ఎవరైనా హింసా పద్దతిలో వెళుతుంటే వీలైనవరకు వారి సమస్యను పరిష్కరించడం ద్వారా పెద్దగొడవనే అపవచ్చు. మా సమస్య మాది నీకెందుకు అని చెప్పేవారు కొందరు ఉంటారు. అలాంటి వారికి తమ కుటుంబ సభ్యుల నుండి తమ పిల్లల వరకు ఆయా గొడవల వల్ల కలిగే నష్టం, మానసికంగా ఏర్పడే అభిప్రాయాలు ఎలాంటివో తెలియజెప్పాలి.

సామాజిక విషయాలను ఎప్పుడూ వ్యక్తిగత అంశాలలోకి తీసుకుని అర్థం చేసుకోకూడదు. వ్యక్తిగత కోపాలు,  గొడవలు ఏమున్నా వాటిని సమాజం మీద రుద్దకూడదు. దీనివల్ల సమాజం మీద ప్రభావం పడుతుంది. ఎంతో కొంత సమాజంలో నివసించే పౌరులకు కూడా నష్టం కలుగుతుంది.

అహింస అనేది నాలుగు వ్యాసాలు, రెండు పుస్తకాలు, పది స్పీచ్ లు వింటే అలవాటు అయ్యేది కాదు. ఆలోచిస్తే వచ్చేది. శాంతి ద్వారానే అహింస స్వభావం మనిషిలో అలవడుతుంది. కాబట్టి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రేమ, జాలి, దయ వంటి గుణాలు శాంత స్వభావాన్ని పెంచుతాయి. కోపం, ద్వేషం, అహంకారం, అసూయ వంటి గుణాలకు దూరంగా ఉండాలి.

                                                      నిశ్శబ్ద.