Read more!

పేదరిక నిర్మూలనే మెరుగైన జీవితాలకు నాంది!!

ఆకలితో అలమటించడం.. తలదాచుకోవడానికి గూడులేకపోవడం.. చదువుకోవాల్సిన వయసులో పనికెళ్లడం.. ఇవన్ని పేదరికానికి  గుర్తులు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సవాళ్లలో ఒకటైన పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి ఏడాది అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పేదరిక నిర్మూలనపై విశ్వవ్యాప్తంగా అవగాహన పెంచడం, అంతర్జాతీయంగా తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మెరుగైన సమాజం కోసం పారదోలాల్సిన ప్రధాన సవాళ్లలో పేదరికం ప్రధానమైనది. సమాజంలో అణగారిన వర్గాలవారు రోజువారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, అవసరమైన చర్యలతో పేదవర్గాలకు చేయూతనివ్వాలన్న స్పృహను  అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం గుర్తుచేస్తుంది. 

పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు సాధారణ జీవితం కూడా నరకయాతనే. విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక హక్కులకు వారు ఆమడ దూరంలో ఉంటున్నారు. అందుకే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా సమానత్వపు ఔనత్యాన్ని చాటిచెప్పడం, పేదలు ఆత్మగౌరవం, హూందాగా జీవించాల్సిన ఆవశ్యకతను అంతర్జాతీయ పేదరిక నిర్మూలనం దినోత్సవం లక్ష్యంగా చేసుకుంది. ఆర్థిక స్థిరత్వం, సామాజిక సమ్మిళితం ప్రాముఖ్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. 

చరిత్ర ఏం చెబుతోంది.. 1987లో ఏం జరిగింది?

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం చరిత్ర 1987లో మొదలైంది. తీవ్రమైన పేదరికం, హింస, ఆకలి బాధితులకు మద్ధతుగా అక్టోబర్ 17న వందలాది మంది ప్యారిస్‌లోని ట్రొకెడెరోలో సమావేశమయ్యారు. 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌పై సంతకం చేసిన ప్రదేశంలో వీరంతా సమావేశమయ్యారు. ఈ సందర్భానికి గౌరవ సూచకంగా అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించాలని 1992 డిసెంబర్ 22న ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. పేదరికం నిర్మూలన ఆవశ్యతను చాటిచెప్పడం దీని ముఖ్యొద్దేశమని పేర్కొంది.

2023 థీమ్ ఇదే..

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి ఏడాది ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తారు. ‘‘ ఆత్మగౌరమైన పని, సామాజిక సంరక్షణ: ఆచరణలోకి అందరికీ గౌరవం’’ అనేది ఈ ఏడాది థీమ్. పేదలైనప్పటికీ పనిలో ఆత్మగౌరవం, సమాజంలో అణగారిన వర్గాల రక్షణను ఈ థీమ్ చాటిచెబుతోంది. మరోవైపు అందరికీ గౌరవాన్ని మాటల్లో చెప్పి వదిలేయకుండా ఆచరణాత్మకం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. 

ప్రాముఖ్యత..

అంతర్జాతీయంగా అవగాహన, సహకారం, విద్య వంటి చర్యల ద్వారా పేదరిక నిర్మూలన ప్రాముఖ్యత అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం చాటిచెబుతోంది. నిరుద్యోగం, వనరులలేమి, విద్యలేమి, అసమానత వంటి అంశాలు పేదరికానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం రోజున ఈ సమస్యలను అధిగమించడంపై అవగాహన చాలా ముఖ్యం. పేదరికం పర్యవసనాలు నేరాలు, హింస, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి మరిన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ఆవశ్యకతను చాటిచెబుతోంది. ఇతరులకు ఉపాధి కల్పించడం, ఆర్థిక భరోసా ఇవ్వడం, మెరుగైన జీవితాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి.


                                             *నిశ్శబ్ద.