Read more!

సంతోషంగా ఉండాలంటే యువత తెలుసుకోవలసిన విషయమిదే!

ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలనే కోరుకుంటారు. అయితే సంతోషంగా ఉన్నామనే దానికి కొలమానం ఏమిటి? యువత సంతోషంగా ఉండాలంటే కావల్సింది ఏమిటి? అని  ఒక సర్వే నిర్వహించారు. సంతోషంగా ఉండడానికి కావాల్సినవి 'కీర్తి, సంపదలు, అందం, ఆరోగ్యం' అని చాలా మంది ఆ సర్వేలో వెల్లడించారు.

ఒకరు భోగ భాగ్యాలతో జీవిస్తున్నప్పటికీ అతనికి ఉన్న ఐశ్వర్యం సంతృప్తిని ఇవ్వకపోతే సంతోషం లేనట్లే కదా? మరొక వ్యక్తి తనకున్న సంపదతో సంతృప్తిగా జీవించగలిగితే అతడు సంతోషంగా ఉన్నట్లే!

సంతోషానికి అర్థం సంతృప్తిగా జీవించడం. సంతోషం, సంతృప్తి మనస్సుకు సంబంధించినవి. సాధారణంగా మనం కోరుకున్నది మనకు లభించినప్పుడు సంతోషం కలుగుతుంది. అలాంటి ఆనందం మరొక కోరికకు దారితీస్తుంది. ఆ సంతోషం స్వల్పకాలం మాత్రమే.

మనలో కోరికలు ఉన్నంత వరకూ నిజమైన ఆనందం పొందలేమనడానికి  భాగవతంలోని ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది.

 “ఒక రోజు కొంతమంది బెస్తలు చేపలు పడుతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద రివ్వున క్రిందికి వచ్చి ఒక చేపను తన్నుకుపోయింది. గ్రద్ద నోటిలో చేప కనపడేసరికి, కాకులు గుంపులు గుంపులుగా దాని వెంటపడ్డాయి. ఆ గందరగోళంలో గ్రద్ద నోటిలో నుంచి చేప జారి క్రింద పడిపోయింది. తక్షణమే కాకులన్నీ గ్రద్దను వెంబడించడం మానేశాయి. అప్పుడు ఆ గ్రద్ద ఓ చెట్టుకొమ్మ మీద వాలి ప్రశాంతంగా కూర్చుని 'ఛీ! నికృష్టమైన ఆ చేప ఈ అనర్థాలన్నిటికీ మూలం! దాన్ని వదిలేసరికి నాకు మనశ్శాంతి లభించింది" అని అనుకుంది.

మనలో ప్రాపంచిక కోరికలు ఉన్నంత వరకూ అశాంతి మనల్ని వెంటాడుతూనే ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్వామి వివేకానంద తమ జ్ఞానయోగం పుస్తకంలో ఇలా వ్రాస్తారు: "మరణం అనేది ఉన్నంత వరకు సంతోషం కోసం పరుగులు, ప్రయాస జలగల్లాగ పట్టుకొని వేలాడతాయి. ఇవన్నీ కొంత కాలానికి అనిత్యాలుగా తోస్తాయి. జీవితమంతా ఎంతో బుద్ధిపాటవంతో, తదేక దీక్షతో, పరిశ్రమించి నిర్మించుకొన్న ఆశాసౌధాలు ఒక్క నిమిషంలో కుప్పకూలిపోతాయి.” సంతోషం బయటదొరికేది కాదు అని అర్థం అవుతుంది. కోరికల నుండి దూరమైనప్పుడే మనస్సు ప్రశాంతతను సంతరించుకొంటుంది. Happiness comes from being and not having సంతోషం అనేది మనలో ఉన్నదే కానీ బాహ్య వస్తువుల నుంచి వచ్చేదికాదు.

కోరికలు లేకుండా ఉండడం అసాధ్యం కాబట్టి, జీవించడానికి అవసరమైనవాటిని, ఆత్మనిగ్రహానికి ఆటంకం లేనివాటిని మాత్రమే కోరుకోవాలి. ప్రకృతి ద్వారా వచ్చే ప్రతిబంధకాల నుండి అనాసక్తులమై ఉండగలగాలి. మనలో  ఉన్న సంతోషాన్ని, బాహ్యవస్తువుల ద్వారా వచ్చే సంతోషంతో అనుసంధానం చేయాలి. దానికై ధ్యానం క్రమం తప్పక చేయాలి.

ఒక సాధువుగారు తన శిష్యుడితో సాయంకాలం ఊరి పొలిమేరలకు వెళ్ళారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. ఎదురుగా పొలంలో వాడిపోయిన మొక్కలు కనిపించాయి. శిష్యుడు వెంటనే ఆ విధంగా ఉండడం చూసి గురువుగారిని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా సాధువు “నాయనా! ఈ చెట్ల వేర్లు భూమిలో నీటి మట్టం వరకు పోయాయి. కనుక ఈ చెట్లు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ చిన్న మొక్కల వేర్లు పైపైనే ఉన్నాయి. అవి నీటి మట్టాన్ని తాకలేవు కాబట్టి వాడిపోయాయి" అని సమాధానం ఇచ్చాడు.

ఎవరైతే తమ మనస్సును అంతరాత్మతో అనుసంధానం చేస్తారో వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు. ఎవరి మనస్సు అయితే నిత్యసత్యమైన ఆత్మను మరచి అనిత్యాలైన బాహ్యవస్తువుల వెంట పరుగులు తీస్తుందో అలాంటివారు. ఎన్నటికీ ఆనందంగా జీవించలేరు. కాబట్టి మనస్సును బాహ్య విషయాలపైకి పోనివ్వకుండా మనలో ఉన్న దివ్యత్వంతో అనుసంధానం చేసుకొని సంతోషంగా జీవించడానికి ప్రయత్నిద్దాం.

                                       *నిశ్శబ్ద.