జీవితంలో అనుకరణ ఎంతవరకు మంచిది!

పిల్లలు పెద్దల్ని అనుకరించడం, వాళ్ళలాగే గొప్పవాళ్ళు కావాలని ఆశించడం సహజమైన విషయం. మనం మనకు తెలియకుండానే ఇతరులను అనుకరిస్తుంటాం. మన జీవితంలో ఈ'అనుకరణ'ఎంత వరకు అవసరమో తెలుసుకోవడం మంచిది.

తల్లితండ్రులతో మొదలు..

 పిల్లలు ప్రధానంగా తల్లి తండ్రులను అనుకరిస్తారు. కాబట్టి తల్లితండ్రులు ముందుగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపితే పిల్లలు వారంతట వారే అమ్మా నాన్నల నుంచి అన్నీ నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లి తండ్రులకు పిల్లలతో కాస్త సమయం గడపడానికే తీరిక లేనప్పుడు వారి నుంచి పిల్లలు ఏం నేర్చుకోగలరు? నేటి తరం వారికి టీవీ, ఇంటర్ నెట్లో మిత్రులు, బంధువులు. పిల్లలు ఏమైనా పాఠాలు నేర్పుతున్నది ఇవే.. వీటిలో ఏముంటాయో  మనకూ తెలుసు. ఇలాంటి విషయాలు పిల్లలకు అలవాటు చేస్తే వారిలో ఏ పాటి ఉన్నత విలువలు అలవడతాయో మనం ఊహించవచ్చు. నేటి యువతరం ప్రసార మాధ్యమాల ప్రభావంతో ప్రతికూల భావాలకు బానిసలై, వాటినే తమ జీవితాల్లో అనుకరిస్తోంది. ఈ ప్రభావాలకు దూరంగా ఉంటూ, మనదైన ఉన్నత సంస్కృతికీ, ఆధ్యాత్మికతకూ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే యువతీ యువకులు ప్రగతిని సాధించగలరు.

వివేచనతో అనుకరణ ఉండాలి..

మనం సాధారణంగా ఒక వ్యక్తి, లేదంటే  సమాజంలో బయటకు కనిపించే ఎన్నో విషయాలకు ఆకర్షితులమై, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాం. దీని వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోగా నష్టం కలిగి తీరుతుంది. సింహం చర్మాన్ని వేసుకున్నంత మాత్రాన గాడిద కాస్తా సింహం కాబోదు కదా! మనం వివేచన లేకుండా గుడ్డిగా ఎవరినైనా అనుకరిస్తే పురోగతి చెందే మాట అటుంచి, అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి అనుకరణ వల్ల మన వ్యక్తిత్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోయి జీవచ్ఛవాలుగా మారతాం. అందుకే, మనం ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి.

మంచిని అనుకరిస్తేనే ఉన్నత స్థితి..

 మనం చెడును అనుకరిస్తే అధోగతిని పొందినట్లే, మంచిని అనుకరిస్తే ఉన్నతమైన స్థితికి చేరుకోగలం. 'Be not an imitation of Jesus, but be Jesus. You are quite as great as Jesus, Buddha, or anybody else' అని స్వామి వివేకానంద చెప్పారు. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటే..

"ఒక దొంగ అర్ధరాత్రి సమయంలో రాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ రాజు, రాణితో 'మన అమ్మాయి వివాహం నదిఒడ్డున తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుతో జరిపించాలి'. అన్నాడు. ఇది విన్న దొంగ 'నేను సాధువు వేషం వేసుకుంటాను. అదృష్టం బాగుంటే నన్నే రాజకుమారి వరించవచ్చు' అని మనస్సులో అనుకున్నాడు. తరువాత రోజు రాజు సేవకులు నది ఒడ్డుకు వెళ్ళి సాధువులను ఒక్కొక్కరినీ రాజకుమారిని వివాహం చేసుకోవలసిందిగా కోరారు. అయితే ఎవరూ అంగీకరించలేదు. చివరకు ఈ ‘దొంగ – సాధువు' దగ్గరకు వచ్చి అడిగారు. ఇతను మౌనం వహించాడు. మౌనాన్ని అంగీకారంగా భావించి రాజ సేవకులు వెళ్ళి, జరిగినదంతా రాజుతో చెప్పారు. రాజు స్వయంగా ఆ నది ఒడ్డుకు వచ్చి, తన కుమార్తెను వివాహం చేసుకో వలసిందిగా ఆ దొంగ సాధువును ప్రార్ధించాడు. ఆ దొంగ- సాధువు తన మనస్సులో 'నేను సాధువు వేషం వేసినంత మాత్రాన స్వయంగా రాజు నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నాడు. నేను నిజంగా సాధువును కాగలిగితే ఈ జీవితం ఎంత సార్థకమవు తుందో కదా!' అని అనుకొని, వెంటనే తన మనస్సు మార్చుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప సాధువుగా ప్రఖ్యాతి చెందాడు". మనం కేవలం ఒకరిని అనుకరించడంతో ఆగిపోకుండా వారిలో ఉన్న ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితంలో మంచి స్థాయికి చెరగలం.

                                 *నిశ్శబ్ద.