నెగిటివ్ ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా బయటపడవచ్చు..!
posted on Oct 18, 2025 @ 9:30AM
నేటి బిజీ జీవితాల కారణంగా చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ పరిస్థితులు, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, కొత్త పుంతలు తొక్కుతున్న సంస్కృతి మొదలైనవన్నీ నేటి తరం మనస్సుల్లో నెగిటివ్ ఆలోచనలకు కారణం అవుతున్నాయి. వీటి కారణాల వల్ల చాలా మంది మనసులు మరింత అపవిత్రంగా మారుతున్నాయి. ఈ ఆలోచనలు మనస్సులో బాగా పాతుకుపోయిన కొద్దీ జీవితంలో ప్రశాంతత, ఆనందం మాయమవుతాయి. ఈ ప్రతికూల ఆలోచనల నుండి తమను తాము ఎలా బయటపడేసుకోవాలో తెలుసుకుంటే..
ప్రతికూల ఆలోచనలు వదిలించుకునే మార్గాలు..
ప్రతికూల ఆలోచనలు పోవడానికి దైవ సహాయం చాలా బాగా సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవడానికి దైవ ప్రార్థనలు, జపం, భజనలు మొదలైనవాటిని అనుసరించవచ్చు. ఇది మనస్సును చాలా వరకు క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఇలా చేస్తే నెగిటివ్ ఆలోచనలు వాటికవే క్రమంగా మాయమవుతాయి.
మనిషిని స్నేహం చాలా ప్రభావితం చేస్తుంది. చెడు సహవాసం వ్యక్తి ఆలోచనలను, మనస్సును ప్రభావితం చేస్తుంది. చెడు వ్యక్తుల స్నేహంలో, సాహచర్యంలో ఉంటే.. వారితో ఉండే వారి ఆలోచనలు కూడా చెడుగా మారతాయి. నెగిటివ్ ఆలోచనలు సులభంగా పుట్టుకొస్తాయి. అందుకే మంచి వ్యక్తులతో సమయాన్ని గడపాలి. అది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
పుస్తక పఠనం వల్ల ఆలోచనలను సమతుల్యంగా ఉంచుకోవచ్చు. మనస్సును పాజిటివ్ శక్తితో నింపుకోవడానికి, ఎల్లప్పుడూ గ్రంథాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు, నైతిక విలువలు కలిగిన గ్రంథాలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు మొదలైనవి చాలా సహాయపడతాయి.
ఆలోచనలను శుభ్రంగా ఉంచుకోవాలన్నా, చెడు తలపుల నుండి దూరంగా ఉండాలన్నా ప్రకృతితో సమయం గడపడం చాలా సహాయపడుతుంది. ఇది మనస్సును ఎల్లప్పుడూ స్వచ్చంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనస్సులో వచ్చే చెడు ఆలోచనలను కూడా వదిలించుకోవచ్చు.
దేవుని నామాన్ని జపించడం వల్ల నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండవచ్చు. దైవ నామ స్మరణ వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతూ, నెగిటివ్ ఆలోచనలు మెల్లిగా తగ్గుతాయి.
*రూపశ్రీ.