కోపంగా, మొండిగా ఉన్న మొగుళ్లను దారిలో పెట్టే సూపర్ చిట్కాలు..!
posted on Oct 21, 2025 @ 9:30AM
భార్యాభర్తల మధ్య సంబంధం చాలా లోతైనది. ఇది రెండు హృదయాలను కలుపుతుంది. ప్రేమ, ఆటపట్టించుకోవడం, నవ్వు, గొడవలు,అపార్థాలు.. ఇలా అన్నీ భార్యాభర్తల బంధంలో బాగంగా ఉంటాయి. అయితే కొన్ని జంటల్లో అర్థం చేసుకునే భర్తలు ఉంటారు. మరికొన్ని జంటల్లో పురుషా హంకారం కలిగిన భర్తలు ఉంటారు. కొన్ని జంటల్లో చెడ్డ భర్తలు ఉంటారు. అయితే ఒకవైపు మంచితనం ఉన్నా.. అతిగా కోపంగా, మొండిగా ఉండే భర్తలు ఉంటారు. ఇలాంటి వారిని అటు వదులుకోలేరు, ఇటు వారి ప్రవర్తనను మార్చుకోలేరు. దీని కారణంగా భార్యలు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే అతిగా కోపంగా, మొండిగా ఉండే భర్తలను దారిలో పెట్టే సూపర్ చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే భర్తలను మార్చుకోవడం సాధ్యమే.. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
ప్రశాంతత..
భర్త కోపంగా ఉన్నప్పుడల్లా, అతనికి ప్రతిస్పందించకూడదు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. భర్త ఉన్న గది నుండి బయటకు వెళ్లి వేరే చోటికి వెళ్లాలి. ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. సింపుల్ గా చెప్పాలంటే.. అతను కోపంగా ఉన్నప్పుడు అతన్ని మీరు అవాయిడ్ చేస్తున్నారని అతనికి అనిపించాలి.
ఎక్స్ప్లెయిన్..
భర్త కోపంగా ఉన్నప్పుడు అతనితో ఏమీ మాట్లాడకూడదు. కానీ అతని కోపం తగ్గినప్పుడు అతనితో ప్రశాంతంగా మాట్లాడి అతని ప్రవర్తన గురించి, అతను చేస్తున్న పని గురించి వివరించి చెప్పాలి. అతని ప్రవర్తన వల్ల అవతలి వ్యక్తులు ఎలా బాధపడుతున్నారో తెలియజేయాలి. అతని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అతను ఎందుకు అంత కోపంగా ఉంటాడో తెలుసుకోవాలి. ఈ ప్రశ్న అతన్ని ఆలోచింపజేస్తుంది.
కారణం..
అసలు అతను కోపంగా ఎందుకు ఉంటాడు అనే విషయం తెలుసుకోవాలి. ఒకవేళ అతని కోపానికి కారణం, లేదా తప్పు భార్య వైపు ఉందని తెలిస్తే.. అది సరైనది అయితే భార్య మారడానికి ప్రయత్నించడంలో తప్పులేదు. ఒకవేళ అతని కోపానికి కారణం మరేదైనా అయితే దానికి పరిష్కారాన్ని కనుగొనవచ్చు.
కౌన్సెలింగ్..
భర్త కోపంగా ఉన్నప్పుడల్లా పిల్లల సహాయంతో దాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల కోపం వారి పిల్లలను చూసిన తర్వాత కామన్ గానే తగ్గుతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా భర్త కోపాన్ని తగ్గించుకోకపోతే బంధువు లేదా కుటుంబ పెద్దల సహాయం తీసుకోవచ్చు. లేదంటే కౌన్సిలర్ లను కూడా కలవచ్చు. ఇలా చేస్తే భర్తకు వారు అర్థమయ్యే చెప్పి ప్రవర్తన మార్చే ప్రయత్నం చేస్తారు.
దూరం..
భర్త తన కోపాన్ని తగ్గించుకోకుండా తన ప్రవర్తన మార్చుకోకుండా ఉంటే పెద్దలు సలహాతో భర్తకు కొన్నాళ్లు దూరంగా ఉండవచ్చు. ఇది కేవలం పెద్దల సలహాతో మాత్రమే జరగాలి. బంధం విచ్చిన్నం కాదనే నమ్మకం ఉంటేనే ఈ స్టెప్ తీసుకోవాలి. మనుషుల మధ్య దూరం కూడా కొన్ని సార్లు తప్పులు సరిదిద్దుకోవడానికి, ఆలోచించడానికి సహాయపడుతుంది. ఇవన్నీ చేయడం ద్వారా భర్త ప్రవర్తన మార్చుకోవచ్చు.
*రూపశ్రీ.