తెలుగు రాష్ట్రాల ఐక్యతతోనే... తెలుగు జాతికి పురోగతి : సీఎం చంద్రబాబు

 

తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడే తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం తన లక్ష్యమని స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

తెలుగు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి మాతృభాషగా ఉందని, టెక్నాలజీ సహాయంతో భాషను మరింత బలోపేతం చేయవచ్చని చెప్పారు. ఎన్టీఆర్‌ నుంచి ఆధునిక కవులు వరకు తెలుగు భాషకు సేవ చేసిన మహనీయులను స్మరించుకున్నారు. తెలుగు భాషే మన అస్తిత్వం, ఐక్యతే మన బలం అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తెలుగు సాహిత్యంలో మనకు ముందుగా గుర్తు వచ్చేది అదికవి నన్నయ్య రాసిన మహాభారతం. కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు... ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమ ఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలను మర్చిపోలేం. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు. 

తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ... జ్ఞానపీఠ్ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంథిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తిని తెలుగు జాతి మర్చిపోదు. మద్రాసీలని పిలిచిన వారందరికీ తెలుగు వారి ఆత్మగౌరవం ఏమిటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. దేశంలో మొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆనాడు తెలుగు జాతి ఐక్యత కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 

ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు రామోజీ రావు  చేసిన సేవను మరిచిపోలేం.  సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం మనకు గర్వ కారణం.  ఇటాలియన్ యాత్రికుడు ‘నికోలో డి కాంటే’ తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి ‘సుందర తెలుంగై’ అని కీర్తించారు. మన ప్రాస - యాస, మన సంధులు - సమాసాలు, మన సామెతలు – పొడుపు కథలు అన్నీ మనకే ప్రత్యేకం. అందుకే దేశ బాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు కీర్తించారని సీఎం చంద్రబాబు అన్నారు. 

నేను ఇచ్చిన ఐటీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వారు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రపంచంలో తెలుగు జాతి గొప్ప స్థానంలో నిలవాలన్నదే నా సంకల్పం. మన కవులు, కళాకారులు, వారసత్వ సంపదను కాపాడుకుందాం. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. మన సంస్కృతిని చాటి చెప్పే పండుగలను ఆనందంగా జరుపుకుందాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజు, ఏపీ శాసనసభ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరయ్యారు.
 

భూభారతిలో భారీ అక్రమాలు.. రంగంలోకి లోకాయుక్త

భూభారతి రిజిస్ట్రేషన్ లలో భారీ అక్రమాలపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. భూ భారతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టా లని అధికారులను ఆదేశించింది. భూభారతి పేరుతో జరుగుతున్న రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. సమగ్ర నివేదిక సమర్పిం చాలని సంబంధిత   శాఖలను లోకాయుక్త ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ , స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ, మీ సేవా కమిషనర్, జనగామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్లకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ చార్జీలను కాజేసేలా ఓ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ సహాయంతో చలాన్ అమౌంట్లను ఎడిట్ చేసి, తక్కువ మొత్తానికి పేమెంట్ చేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు అధికారులు గుర్తించారు. అయితే జనగామ జిల్లాలో కేవలం ఒక్కరోజే 10 చలా న్లకు సంబంధించిన రూ.8,55,577ను దుండగులు కాజేసి నట్లు  విచారణ లో తేలింది.  ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో వెంటనే చలాన్లపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో జనగామ తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కుంభకోణంలో యాదాద్రి జిల్లాకు చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లను ఎడిట్ చేసి పేమెంట్లు చేసినట్లు గుర్తించారు. అతని పాత్రపై పోలీసులు  విచారణ చేపట్టారు.భూభారతి కుంభకోణానికి సీసీఎల్ఏ సాంకేతిక సిబ్బంది సహకారం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇప్పుడు లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో  మరిన్ని   విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని  అంటున్నారు. 

విషమచ్చి చంపేయండి...తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు

  ఓ మహిళా  ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం దురదష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నాపై ఏమైనా రాయండి తట్టుకుంటా కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని అన్ని మీడియా వాళ్లని అభ్యర్థిస్తున్నాని మంత్రి తెలిపారు.  మీకు కుటుంబాలు ఉంటాయి కదా? ఆఫీసర్లను బదిలీ చేసే హక్కు సీఎంకే ఉంటుందని కోమటిరెడ్డి అన్నారు. ఈ తప్పుడు రాతల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఇంకా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తరుపున సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాని తెలిపారు. నాకు ఉన్న ఒక్కగానొక కుమారుడిని కోల్పోయి ఫౌండేషన్ పేరుతొ ప్రజాసేవ చేస్తున్నాని తెలిపారు. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేదని వాపోయారు. అధికారుల మీద అభాండాలు వేయడం సరికాదు. రేటింగ్‌లు, వ్యూస్‌ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

బండ్ల గణేష్ మహా పాదయాత్ర.. ఎందుకంటే?

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఈ నెల 19 నుంచి మహాపాదయాత్ర ప్రారంభించనున్నారు. హైదరాబాద్ షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమల వరకూ ఆయనీ మహాపాదయాత్ర చేపట్టనున్నారు. ఇంతకీ ఆయనీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో చంద్రబాబునాయుడు స్కిల్ కేసు పేర అక్రమంగా అరెస్టైన సందర్భంలో ఆయన తిరుమల దేవుడికి మొక్కుకున్నారు. చంద్రబాబు ఆయన ఇమేజ్ కు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలని  కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లే చంద్రబాబు స్కిల్ కేసులో నిర్దోషిగా తేల డంతో తన మొక్కు తీర్చుకోవడానికి షాద్ నగర్ నుంచి తిరుమలకు కాలినడకన ప్రయాణించనున్నారు. నవంబర్ 19న ఈ పాదయాత్రను బండ్ల గణేష్ ఘనంగా ప్రారంభించనున్నారు. అటు ఆధ్మాత్మికంగానూ, ఇటు రాజకీయంగానూ కూడా అందరి దృష్టినీ ఈ పాదయాత్ర ఆకర్షించే అవకాశం ఉంది.  

పట్టాలెక్కిన జ్ణాన బుద్ధ ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పురోగతి శరవేగంగా సాగుతోంది. గతంలో అంటే జగన్ హయాంలో ఆగిపోయిన కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కిస్తోంది. అందులో భాగంగానే జ్ణాన బుద్ధ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు రెండు కోట్ల రూపాయలు విడుదల చేయడంతో జ్ణానబుద్ధ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి.    2014 నుంచి 2019 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘జ్ఞాన బుద్ధ’ పేరుతో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో బౌద్ధ ఆరామానికి సంబంధించిన అనేక విశేషాలతో పాటు బుద్ధుని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ, చుట్టూ హరిత హారాన్ని నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది.ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి బౌద్ధులను ఆకర్షించే అవకాశాలుంటాయని భావించిన చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లోనే ఈ ప్రాజెక్టుకు ఐదెకరాల భూమిని కూడా కేటాయించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న నూటపాతిక అడుగుల ఎత్తైన  బుద్ధుని విగ్రహ నిర్మాణం కూడా ఇందులో భాగమే.  అయితే ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రాజధాని అమరావతిని పక్కన పెట్టేసి మూడు రాజధానుల విధానమంటూ.. ఈ ప్రాజెక్టును కూడా మూలన పడేసింది.   ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు సంబంధించి విధివిధానాలను పర్యటక శాఖ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టుకు నిధులు కేటాయిం చింది.  ప్రత్యేక ధ్యాన మందిరం, గ్రంథాలయం, బౌద్ధుని స్మృతులతో కూడిన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి జ్ణాన బుద్ధను   పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తారన్నది అంచనా. ఆ అంచనాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.  

మరోసారి ట్రంప్ స్వోత్కర్ష.. తనను మించిన శాంతి దూత ఎవరని నిలదీత

నోబెల్ శాంతి పురస్కారానికి తనను మించిన అర్హులెవరున్నారంటూ అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన భుజాలను తానే చరుచుకుని స్వోత్కర్షలో తనకు తానే సాటి అని చాటుకున్నారు. వైట్‌హౌస్‌లో చమురు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన ఆయన తన హయాంలో ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకున్నారు. అంతే కాదు.. భారత్ పదేపదే ఖండిస్తున్నప్పటికీ భారత్, పాకిస్థాన్ ల మధ్య అణుయుద్ధాన్ని తానే నివారించానని పునరుద్ఘాటించారు.  గత ఏడాది భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య  తీవ్ర ఉద్రిక్తతలు తెలిత్తి యుద్ధం అనివార్యం అన్న పరిస్థితులు నెలకొన్న సమయంలో  తాను జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్యా యుద్ధం జరగకుండా  అడ్డుకున్నానని  చెప్పుకున్నారు. తాను జోక్యం చేసుకోకుంటే అణుయుద్ధం జరిగేదని చెప్పుకొచ్చారు. తన చొరవ వల్లే  కనీసం కోటి మంది ప్రాణాలు దక్కాయని పాకిస్థాన్ ప్రధాని అప్పట్లో చేసిన బహిరంగ ప్రకటనను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.  ఇన్ని యుద్ధాలను ఆపిన తన కంటే నోబెల్ శాంతి పురస్కారం పొందేందుకు ఎవరికి అర్హత ఉందని చెప్పుకున్నారు. అయితే తనకు శాంతి పురస్కారాల కంటే.. జనం ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని చెప్పుకున్నారు.  

జగ్గన్నతోట ప్రభల తీర్ధానికి రాష్ట్రపండుగ హోదా

కోనసీమలో ఏటా కనుమ పండుగ రోజున జరనిగే జగన్నతోట ప్రభల తీర్ధానికి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపును ఇచ్చింది. కొనసీమ సంస్కృతికి చిహ్నంగా నిలిచే ఈ ప్రభల తీర్ధం ఇక నుంచి అధికారికంగా రాష్ట్రపండుగగా జరగనుంది. ఈ ప్రభల తీర్ధానికి దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది.  ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.  జగన్నతోట ప్రభల తీర్థానికి  రాష్ట్ర పండుగ హోదా కల్పించడం తెలుగువారి ఆచారాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన అత్యున్నత  గౌరవంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ గుర్తింపు   దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.   సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున   జగన్నతోట ప్రభల తీర్థం జరుగుతుంది.   అమలాపురం పరిసర గ్రామాల నుంచి  ఏకాదశ రుద్రులు ప్రభల రూపంలో ఒకేచోట కొలువుదీరడం ఈ జగ్నన్నతోట ప్రభత తీర్థం ప్రత్యేకత.  ఎత్తైన ప్రభలను భుజాలపై మోస్తూ కౌశికా నదిని దాటించే దృశ్యం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. ముఖ్యంగా గంగలకుర్రు ప్రభ కౌశికను దాటి వచ్చే దృశ్యం ఒళ్లుగొగుర్పొడిచేలా ఉంటుంది. ఈ ప్రభల తీర్థానికి  ఏటా సుమారు ఆరు లక్షల మందికి పైగా తరలివస్తారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రభల తీర్థ విశిష్ఠతను గతంలో కొనియాడారు. అదలా ఉంచితే ప్రభల తీర్థానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా  కల్పించడంతో ఈ ఉత్సవాల నిర్వహణకు   ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో ఈ ఏడాది ప్రభల తీర్థం మరింత వైభవంగా నిర్వహిస్తామని  మంత్రి కందుల రమేష్ తెలిపారు. 

మలేసియా ఓపెన్..సెమీస్ లో పీవీ సింధు ఓటమి

ప్రంపంచ  బాడ్మింటన్​ సీజన్​ ఆరంభ టోర్నీ.. మలేషియా ఓపెన్లో భారత స్టార్​ షట్లర్ ​ పీవీ సింధూ పోరాటం ముగిసింది. శనివారం (జనవరి 10) ఇక్కడ జరిగిన సెమీఫైనల్ లో ఆమె పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.    సెమీ ఫైనల్ ​ లో  సింధు    డ్రాగన్​ షట్లర్  వాంగ్ జియి చేతిలో   16- 21, 15-21 తేడాతో వరుస సెట్లలో  పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.  గాయం కారణంగా సుదీర్ఘ కాలం  విరామం తీసుకున్న సింధూ  మలేషియా  టోర్నీలో పునరాగమనం చేసింది. ఈ టోర్నీలో ఆరంభ మ్యాచ్ లలో అదరగొట్టి సెమీస్ కు దూసుకెళ్లింది. పూర్వపు ఫామ్ అంది పుచ్చున్నట్లుగా సింధు కనిపించడంతో సంక్రాంతి కానుకగా ఆమె మలేషియా ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచి స్వదేశానికి తిరిగివస్తుందని అంతా ఆశించారు. అయితే ఆమె సెమీఫైనల్ లో ఓడిపోవడంతో నిరాశ చెందారు. ఇలా ఉండగా   మలేషియా ఓపెన్‌లో  8 ఏళ్ల తర్వాత తొలిసారిగా సింధు సెమీఫైనల్ కు చేరుకుంది.   ఇక  లాస్​ ఏంజిల్స్​ ఒలింపిక్స్ లో సత్తా చాటి మరో ఒలింపిక్ మెడల్ ను తన ఖాతాలో వేసుకోవాలని సింధు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటి వరకూ సింధు ఖాతాలో రెండు ఒలింపిక్ మెడల్స్ ఉన్న సంగతి తెలిసిందే.

అయోధ్యలో మాంసాహార ఫుడ్ డెలివరీపై నిషేధం

అయోధ్యలో ఆన్ లైన్ లో మాంసాహార ఫుడ్ డెలివరిపై అధికారులు నిషేధం విధించారు. అయోధ్య రామ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో  మాసాహార ఫుడ్ డెలివరీని పూర్తిగా నిషేధించామనీ, ఆ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందనీ  అధికారులు తెలిపారు.  పవిత్ర పుణ్యక్షేత్రం పంచకోశి పరిక్రమ పరిధిలోని ప్రాంతాల్లోకి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు మాంసాహారాన్ని సరఫరా చేస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయోధ్య లోని కొన్ని హోటళ్లు, హోమ్‌స్టేలు అతిథులకు మాంసాహారంతో పాటు మద్యం కూడా అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వాటి యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. అయితే నిషేధం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బుకింగ్ ల  ద్వారా పర్యాటకులకు నాన్-వెజ్ ఫుడ్ అందుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆన్‌లైన్ నాన్-వెజ్ ఫుడ్ డెలివరీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. హోటళ్లు, హోమ్‌స్టేలు కూడా ఈ నిబంధనలు పాటించాలని  నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు హెచ్చరించారు.  

సంక్రాంతి ప్రయాణాల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి ఆరంభమైపోయింది. పండుగను స్వగ్రామంలో జరుపుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో  తెలుగు రాష్ట్రాల్లో  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి.  రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో పండుగకు నాలుగైదు రోజుల ముందే ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరడంతో  తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ప్రయాణాల సందడే కనిపిస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ఇలా అన్ని నగరాలలోనూ  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.    రద్దీ కారణంగా తోపులాటలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా అవసరాన్ని బట్టి బస్సు సర్వీసులను పెంచుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏ మాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఏపీఎస్ ఆర్టీసీ అయితే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.  అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కూడా తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ.. ప్రయాణీకులకు బస్సు సర్వీసుల విషయంలో సమాచారం అందించేందుకు అదనపు సిబ్బందిని కూడా నియమించాయి.  ఈ రద్దీ సంక్రాంతి సెలవులు ముగిసే వరకూ అంటే ఈ నెల  18 వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇక హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఇప్పటికే వాహనాల రద్దీ పెరిగింది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఆరంభమైపోయాయి. 

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

   పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న  కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే అవకాశం ఉంది. వరుసగా తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అత్యధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ రికార్డు ఉంది. ఆయన రెండు దఫాల్లో 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.