మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

 

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి... ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. 

ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు.
 

రాజధాని అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో అత్యంత కీలకమైన రెండో విడత ల్యాండ్ పూలింగ్  బుధవారం (జనవరి 7) మొదలైంది. రాజధాని ప్రాంతంలో రైల్వే ట్రాక్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడమే ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ లక్ష్యం.   ఈ రెండో విడతలో భాగంగా బుధవారం (జనవరి 7)  యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. మొత్తం ఏడు గ్రామాల్లో దశలవారీగా అమలు చేయనున్న ఈ కార్యక్రమం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాలలో కొనసాగుతుంది. గుంటూరు జిల్లాలోని మూడు గ్రామాలు (వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి)లో 9,097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 ఎకరాల అసైన్డ్ భూమి, అలాగే పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 7,465 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించనున్నారు.   ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వచ్చే నెల 28 నాటికి పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.   ఈ ప్రక్రియ పారదర్శకంగా, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేయనున్నారు.  

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలకు రేపటితో ముగింపు

తిరుమల పుణ్యక్షేత్రంలో గత పది రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం (జనవరి 8)తో  ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిం చుకుని, గత ఏడాది డిసెంబర్ 30నుంచి భక్తులకు టీటీడీ  ఉత్తర ద్వార దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే.  శాస్త్రోక్తంగా పది రోజుల పాటు భక్తులకు  ఉత్తర ద్వార దర్శనాలకు అవకాశం కల్పించిన  తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం (జనవరి 8) అర్ధరాత్రి నిర్వహించే ఏకాంత సేవ సమయంలో పండితుల మంత్రోచ్ఛారణల మధ్య  ఉత్తర ద్వారాలను అధికారికంగా మూసివేయనుంది. కాగా ఉత్తర ద్వార దర్శనాలకు అనుమతించిన పది రోజులలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఎల్లుండి నుంచి తిరుమల కొండపై   బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు ఇతర ప్రత్యేక దర్శనాలు   ప్రారంభం కానున్నాయి.

పోలవరం సందర్శించిన సీఎం చంద్రబాబు.. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును బుధవారం (జనవరి 7) సందర్శించారు.  ఉదయం   ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన  ప్రాజెక్టు వద్దకు చేరున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనుల వేగం పెరిగిన సంగతి తెలిసిందే.      2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.   కాగా ప్రాజెక్టు పనులు ఇప్పటికే 88 శాతం మేర పూర్తి అయ్యాయి.  చంద్రబాబు పోలవరంప్రాజెక్టు సందర్శనలో భాగంగా  ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణాలు, బట్రస్ డ్యామ్, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ వంటి పనులను ఆయన తనిఖీ చేశారు.  అనంతరం జలవనరుల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి,  ప్రాజెక్టు పనులు, కుడి, ఎడమ కాలువల అనుసంధానం వంటి అంశాలపై చర్చించి, తదుపరి లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తరువాత అక్కడే అధికారులతో సమీక్ష  నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రాజెక్టు పురోగతిపై వివరించే అవకాశం ఉంది. 

బీసీబీకి ఐసీసీ షాక్

భారత్ లో టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు  (బీసీబీ) విజ్ణప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్  (ఐసీసీ)నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. టి20 వరల్డ్ కప్ లో తమ దేశం ఆడే మ్యాచ్ లను భారత్ వెలుపల నిర్వహించాలంటూ బీసీబీ ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు నిరాకరించిన ఐసీసీ బంగ్లాదేశ్ జట్టు  భారత్‌కు వచ్చి ఆడాల్సిందేనని, లేకుంటే ఆయా మ్యాచ్‌ల పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఐసీసీ తమ విజ్ణప్తిని తోసిపుచ్చిందన్న అధికారిక సమాచారం తమకు అందలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంటోంది.  బంగ్లాదేశ్‌లో  హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్న  నేపథ్యంలో  ఇరు దేశాల మధ్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ లో బంగ్లా ఆటగాడు ముస్తఫిజుర్‌ రహమాన్‌ ను ఐపీఎల్ నుంచి తొలగించాలని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. దీనికి ప్రతిగా బంగ్లాదేశ్ టి20 వరల్డ్ కప్ లో భారత్ లో ఆడబోమంటూ ఐసీసీని ఆశ్రయించింది. భారత్ లో తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన ఉందంటూ బీసీబీ  పేర్కొంది. ఈ విషయంలో గతంలో పాకిస్థాన్ విషయంలో అనుసరించిన తటస్థ వేదిక విధానాన్ని తమకూ వర్తింప చేయాలని విజ్ణప్తి చేసింది. అయితే ఆ విజ్ణప్తిని ఐసీపీ తిరస్కరించింది.  

కొలిక్కివస్తున్న ఎల్బీఎఫ్ కేసు.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'(ఎల్బీఎఫ్) సంస్థ మోసం కేసులో  విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ అధిక లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీ , ఉద్యోగ అవకాశాలు అంటూ ఆశచూపి.. ఇన్వెస్ట్ మెంట్ల పేర  ప్రజల నుంచి 21.37 కోట్ల రూపాయలు అక్రమంగా  వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.  ఈ సంస్థ వలలో పడి  1,044 మంది మోసపోయినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది. ఎల్బీఎఫ్ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే  అత్యధికులని తేలింది. ఈ సంస్థపై కృష్ణా జిల్లా  విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా  ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారిలో కొందరు తాము పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ మొత్తంలో లాభాల రూపంలో పొందారని పోలీసులు గుర్తించారు. ఇలా అదనంగా లబ్ధిపొందిన వారిని పిలిపించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.  పెట్టుబడి పెట్టిన దాని కంటే అదనంగా వచ్చిన సొమ్మును అప్పగించాలని వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇలా వసూలు చేసిన సొమ్మును బాధితులకు పంపిణీ చేసేందుకు పోలీసులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.  ఇప్పటికే సంస్థ బ్యాంకు ఖాతాలు, లావాదేవీల రికార్డులను సీజ్ చేసిన పోలీసులు, అక్రమంగా ఆర్జించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు.  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంపెనీ నిర్వాహ‌కులైన శివానీ దంపతులు లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీ , ఉద్యోగ అవకాశాలు ఎర చూపి భారీగా ప్రచారం చేయడంతో  జ‌నం పెద్ద ఎత్తున ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు.  తొలుత చెప్పినట్లుగానే అధిక లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీ ఇచ్చిన సంస్థ నిర్వాహకులు.. ఆ తరువాత  ఇస్తామ‌న్న సొమ్ము ఇస్తామ‌న్న స‌మ‌యానికి ఇవ్వ‌క పోవ‌డంతో ఖాతాదారులు తిర‌గ‌బ‌డ్డారు. దీంతో ఈ వ్య‌వ‌హారం పోలీసు స్టేష‌న్ మెట్లెక్కింది.  

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తమిళనాడుకు అతి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారానికి (జనవరి 7)   వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.  ఈ వాయుగుండం ప్రభావంతో  తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే తమిళనాడుతో పాటు  పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోకూడా  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 48 గంటలలో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది.  కాగా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండే అవకాశాలు లేవని పేర్కొంది. ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుందనీ, అదే సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలున్నాయనీ పేర్కొంది.  అయితే వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుతుందని పేర్కొంది.  

కల్వకుంట్ల కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి  మంగళవారం (జనవరి 6) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత, పార్టీ అగ్రనేతలతో విభేదాల నేపథ్యంలో  బీఆర్ఎస్ కు ఆమెను గత సెప్టెంబర్ లో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.  ఆ వెంటనే కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ,  బీఆర్ఎస్ ద్వారా తనకు లభించిన శాసనమండలి సభ్యత్వానికి కూడా అప్పుడే రాజీనామా చేశారు.  ఆ రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పుడు ఆమోదించారు.   ఆమె రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం లభించడంతో బీఆర్ఎస్‌తో ఆమెకు ఉన్న  అనుబంధం ముగిసిపోయింది.  ఇలా ఉండగా కల్వకుంట్ల కవిత జాగృతి కార్యవర్గంతో  మంగళవారం (జనవరి 6) రాత్రి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, బడ్జెట్, ఉపాధి, వైద్యం, మహిళా సాధికారత, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం వంటి విభిన్న రంగాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించారు.ఆ కమిటీల అధ్యయన నివేదికలను పరిశీలించేందుకు ఎల్‌.రూప్‌సింగ్ అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీని  ఏర్పాటు చేశారు. కాగా అధ్యయన కమిటీలు ఈనెల 17 న తమ నివేదికలను అందజేయాలని, ఆ తర్వాతే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.

కోనసీమ కొలిమి.. బ్లో ఔట్.. మంటల నియంత్రణకు మరో వారం!

కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో బ్లో అవుట్ మంటలను ఆర్పే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బ్లో అవుట్ ని అదుపు చేయడానికి మంగళవారం (జనవరి 6) ఉదయం నుంచీ నిరంతరాయంగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్లో అవుట్ వేడి తగ్గించేందుకు నీరు పిచికారీ చేస్తున్నారు.  మంగళవారం (జనవరి 6) నుంచి అర్ధరాత్రి వరకూ ఈ నీటి పంపింగ్ నిరంతరాయంగా జరిగింది.   బ్లో ఔట్ కారణంగా ఎగజిమ్ముతున్న మంటలను ఒకే సారి నియంత్రిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందనీ, అందుకే దశలవారీగా మంటల అదుపునకు ప్రయత్నాలు చేస్తున్నామనీ ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.   ఒక బ్లో ఔట్ ప్రదేశానికి  భారీ వాహనాలు, మడ్ ఫిల్లింగ్ యంత్రాలను తీసుకువచ్చేందుకు పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ తాత్కాలిక రోడ్ల ద్వారా.. భారీ వాహనాలతో మడ్ ఫిల్లింగ్ యంత్రాన్ని తీసుకు వస్తామని చెప్పారు.  మొత్తంగా వారం రోజుల్లో  పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు.  పరిస్థితి అదుపులోనికి వచ్చిన తరువాత పునరావాస కేంద్రంలో ఉంటున్న వారిని వారివారి ఇళ్లకు పంపేస్తామని కలెక్టర్ తెలిపారు.    ఇలా ఉండగా ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం చేరుకున్నాయి. ఈ బృందాలు బ్లో అవుట్ సైట్ ని పరిశీలించాయి. మంటల అదుపునకు  పలు సూచనలు చేశాయి.  ఓన్జీసీ టెక్నాలజీ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ సక్సేనా, ప్రాంతీయ విపత్తు నిర్వహణ ఇంఛార్జ్ శ్రీహరి సైతం సైట్ విజిట్ చేసిన వారిలో ఉన్నారు.

పేకాటకు అనుమతి కోరుతూ హైకోర్టుకు.. కోర్టు తీర్పు ఏంటంటే?

జూదం ఆడతాం, ఆడిస్తాం అనుమతివ్వండంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో  పేకాట  జూదం మూడు ముక్కలు- ఆరు ఆటలు అన్నట్టుగా సాగుతుంటుంది.  ఈ జూదానికి స్థానిక నేతల అండదండలు భారీగా ఉండటంతో పోలీసులు కూడా చూసీ చూడనట్టుగా వదిలేస్తుండటం కద్దు.  కానీ ఇటీవలి కాలంలో పేకాట క్లబ్బులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు పలు క్లబ్లులు, పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేశారు.  ఈ నేపథ్యంలోనే  13 ముక్కల పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ భీమవరం పట్టణంలోని కొన్ని క్లబ్బులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అలా పిటిషన్ దాఖలు చేసిన వాటిలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హఓర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నరసాపురం యూత్ క్లబ్ వంటివి ఉన్నాయి. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా  డబ్బు పందెంగా పెట్టి పేకాట ఆడ్డం చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేస్తూ క్లబ్బుల పిటిషన్ లను తోసిపుచ్చింది.  క్లబ్స్ తరఫు న్యాయవాది సుప్రీం తీర్పు ఆధారంగా.. రమ్మీ ఆడేందుకు అనుమతివ్వాల్సిందిగా తన వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డబ్బులకు పేకాట ఆడ్డానికి   వీల్లేదని.. అలా అడితే అది గ్యాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద చట్ట వ్యతిరేక చర్యగా పరిగణించి కేసులు నమోదు చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. ఇటీవల ఇలాంటి కేసుల్లో ఇదే తరహా ఆదేశాలిచ్చినట్టు స్పష్టం చేసింది   ఇప్పటికే నూజివీడు మ్యాంగో బే క్లబ్ దాఖలు చేసిన మరో పిటిషన్ పై కూడా హైకోర్టు సరిగ్గా ఇలాంటి క్లారిటీయే ఇచ్చింది. రమ్మీని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులకు ఆడితే ఒప్పుకునేది లేదనీ.. అలా ఆడితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనీ జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అదే తీర్పు భీమవరం వ్యవహారంలోనూ అమలు చేస్తామని స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం. 

హస్తినలో కూల్చివేతలు.. ఉద్రిక్తత

దేశ రాజధాని నగరంలో కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. పాత ఢిల్లీలోని టర్క్ మాన్ గేట్  సమీపంలోని ఫైజ్-ఏ-ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్  చేపట్టిన కూల్చివేతల పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపు కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేష్ బుధవారం (జనవరి 7) తెల్లవారు జామున కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో బాష్ఫవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.   ఫైజ్-ఏ-ఇలాహీ మసీదు, శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న   38 వేల 940 చదరపు అడుగుల భూమిలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది  నవంబర్‌లో  ఆదేశాలు జారీ చేసింది.  దీనిపై మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో  అధికారులు భారీగా పోలీసులు మోహరించి  17 బుల్డోజర్లతో కూల్చివేతల చేపట్టారు.