తిరుపతి వేదికగా భారతీయ విజ్ణాన సమ్మేళనం
తిరుపతి వేదికగా శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి సోమవారం (డిసెంబర్ 29) వరకూ నాలుగు రోజులపాటు భారతీయ విజ్ఞాన సమ్మేళనం జరగనుంది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగే ఈ సమ్మేళనానికి 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో అనుసంధానించి, సమగ్ర అభివృద్ధి కోసం భారతీయ దృక్పథాన్ని ప్రోత్సహించే జాతీయ స్థాయి కార్యక్రమం.
సంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి ప్రపంచ స్థాయి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తో అనుసంధానం చేసి భావితరాలకు అందించే ఆశయం తో విజ్ఞన భారతీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. 2007 నుంచీ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.
తొలి సమ్మేళనం భూపాల్ లో జరిగింది. ఆ తరువాత 2009 లో ఇండోర్, 2012 లో జలంధర్, 2015లో పనాజీ, 2017లో పుణే, 2023 లో అహ్మదాబాద్ లో భారతీయ విజ్ణాన సమ్మేళనాలు జరిగాయి. ఈ ఏడు తిరుపతి వేదికగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు కార్యక్రమం జరుగనుంది. ఇందులో సదస్సులు, మేధావుల చర్చలు, చర్చా గోష్టిలు, విజ్ఞాన ప్రదర్శనలు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పై ఎక్స్ పో లో వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, 80 పైగా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ భారతీయ విజ్ణాన ప్రదర్శన ప్రారంభ సభకురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిధులుగా హాజరౌతారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండే, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ జనరల్, రక్షణ శాఖ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఎన్ఐఎఫ్ డైరెక్టర్ అరవింద్ రాణాడే, దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థల డైరెక్టర్లు, వివిధ యూనివర్సిటీల వీసీలు, పరిశోధకులు పాల్గొంటారు. ఇక 29న జరిగే ముగింపు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరౌతారు.