జగనన్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్

 

 

 

ఎప్పుడు ప్రత్యర్ధులపై విరుచుకుపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల సొంత పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేసింది. సీమాంధ్రలోని 13 జిల్లాలు, తెలంగాణలో రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నియోజకవర్గ కోఆర్డినేటర్ల సమావేశం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యలయంలో జరిగింది. ఈ సమావేశంలో షర్మిల సమైక్య ఉద్యమంలో అధ్యక్షుడి లక్ష్యాన్ని చేరుకోవడంలో పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.

 

 

తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఏకంగా సదస్సులు నిర్వహిస్తూ, నేతలు నిరాహార దీక్షలకు దిగుతూ ముందుకు వెళ్లగలుగుతున్నారని వివరించారు. చంద్రబాబు కన్నా ఎక్కువ దూరం పాదయాత్ర, ఆయనకు దీటుగా బస్సుయాత్ర చేసి పార్టీకి మైలేజ్ తీసుకొచ్చానని ఆమె అన్నట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు పదవులకు రాజీనామా చేసి నిరాహారదీక్షకు కూర్చున్నా నియోజకవర్గాల్లో తగినంత ఫలితాన్ని రాబట్టలేకపోయామని పెదవి విరిచినట్లు తెలిసింది.



ఇకపై సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని పార్టీకి మైలేజ్ తీసుకురావాలని, గాంధీ జయంతి నుంచి ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం వరకూ ప్రజల్లోకెళ్లి కార్యక్రమాలు చేపట్టాలని పది కార్యక్రమాలతో కూడిన టైంటేబుల్ అందజేశారు. సమావేశానికి హాజరైన కో ఆర్డినేటర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో పలువురు అసంతృప్తితో వెనుదిరిగారు.