చంద్రయానంలో మరో కొత్త మైలు రాయి
posted on Feb 12, 2013 6:54AM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో నేడు మరో సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. ఈ రోజు గుంటూరు పట్టణంలో స్థానిక ఆర్.టీ.సి. బస్ స్టాండ్ వద్ద చేరుకోవడంతో ఆయన 2000 కిమీ పాదయాత్ర పూర్తవుతుంది. గత అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో హిందూపురం వద్ద తన పాదయాత్ర ఆరంబించిన చంద్రబాబు నాయుడు, ఇంతవరకు అనివార్యమయిన పరిస్థితుల్లో తప్ప ఈ ఐదున్నర నెలలూ ఎక్కడా ఆపకుండా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం సహకరించనప్పటికీ 63 ఏళ్ల వయసులో ఆయన అంత దూరం నడవడం కూడా గొప్ప విషయమే.
ఆయన ఇంతవరకు 107 పట్టణాలు, 107 మండలాలు, 55 నియోజకవర్గాలు, 2 నగరాలలో పాదయత్ర చేసి 12 జిల్లాలలో పర్యటించి, ఇప్పుడు 13వ జిల్లా గుంటూరులో గత వారం రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో దుర్బర జీవితం అనుభవిస్తున్న ప్రజలను పరమార్శించాడానికే పాదయాత్ర అని ఆయన చెపుతున్నపటికీ, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలనే ప్రయత్నం, తాపత్రయం కూడా అందులో ఉంది. ఇతర పార్టీలు కూడా ఆయన బాటలోనే ముందుకు సాగుతున్నపటికీ ఆ సంగతిని ప్రస్తావించకుండా, ఆయనను విర్శించడం అహేతుకం. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన తన పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రచారం చేసుకోవడంలో తప్పు ఏమి లేదు.
ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజల మద్య ఉన్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను, తప్పుడు నిర్ణయాలను, వాటి ఫలితాలను గ్రామీణ ప్రజలకు సైతం అర్ధమయ్యే రీతిలో వివరించి మరీ ఆ పార్టీని ఎండగట్టడం ద్వారా, జగన్ మోహన్ రెడ్డి అవినీతి గురించి పదేపదే ప్రజలకు వివరించుతూ ఆ రెండు కాంగ్రెస్ పార్టీలకి తెలుగుదేశం పార్టీయే ఏకైక ప్రత్యామ్నాయం అనే భావన ప్రజలలో కల్పించేందుకు ఆయన చాల శ్రమించారు.
అయితే, ఆయన మాటలను ప్రజలు ఎంతవరకు విస్వశిస్తున్నారనేది ఎన్నికలు వచ్చి, ఫలితాలు వెలువడితే తప్ప తెలియదు. రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్న గ్రామీణ ప్రజలు ఏ రాజకీయ పార్టీ, నాయకుడు వచ్చినా, వారు నిర్వహించే సభలు, పాదయత్రాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందువల్ల ఈ రోజుల్లో ప్రజల నాడిని పట్టుకోవడం రాజకీయ పార్టీలకు సైతం కష్టం అవుతోంది.
అందువల్ల చంద్రబాబు తన సుదీర్ఘమయిన ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలను స్వయంగా పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకొంటూ, అదే సమయంలో అక్కడి ప్రజలకు తెలుగుదేశం పార్టీని పునర్ పరిచయం చేస్తూ, తన కార్యకర్తలను కూడా స్వయంగా కలుసుకొని వారి సాధక బాధకాలను తెలుసుకొంటూ తన పార్టీని ప్రజలతో మమేకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల తక్షణ ఫలితాలు కనబడకపోయినప్పటికీ, రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కి ఇది ఎంతో మేలు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చును. ఇదే క్రమంలో, ఆయన వివిధ ప్రాంతాల నాయకుల మద్య తలయెత్తిన తీవ్ర విబేధాలు కూడా పరిష్కరించే ప్రయత్నం చేయడం కూడా ఆ పార్టీని బలోపేతం చేయవచ్చును.
రికార్డులు, మైలురాళ్ళ పట్ల ఆయనకీ ఆసక్తి లేకపోయినపటికీ, నిర్విరామంగా కొనసాగుతున్న ఆయన పాదయాత్రలో అటువంటివన్నీ సహజంగానే సిద్ధిస్తున్నాయి. అయితే, ఆరోగ్యం సహకరించనపటికీ, జనవరి 26వ తేదీతో ముగియవలసిన తన పాదయత్రను ఆయన ఇంకా కొనసాగించడం ఆయన కుటుంబ సభ్యులను, పార్టీని కలవరపరుస్తోంది. బహుశః 2000కిమీ. మైలు రాయి దాటుతున్న సందర్భంగా మళ్ళీ వారందరూ పాదయత్ర నిలిపివేయమని ఆయనపై మరోమారు ఒత్తిడి తేవచ్చును.