80 ఏళ్లకు గమ్యం చేరిన పెయింటింగ్!
posted on Jun 19, 2022 @ 10:21PM
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!