తెలుగు సినిమాకు కొత్త రాజుగారు
posted on Feb 13, 2013 @ 12:51PM
‘లీడర్’ వంటి ఒక మంచి సినిమాతో తన నటప్రస్థానం ప్రారంభించిన దగ్గుబాటి రానా, ఇతర చిన్నా,పెద్ద నటులవలే కాకుండా విభిన్నమయిన పాత్రలు ఎంచుకొంటూ తన కెరీర్ తొలిదశలోనే ఎవరూ ఊహించని వేగం అందుకొన్నాడు. సాధారణంగా, ఆ దశలో ఉన్న నటులెవరయినా సినీ పరిశ్రమలో నిలద్రొక్కుకొనేవరకూ మాస్ మసాల సినిమాలు చేస్తుంటారు. గానీ, రాణా మాత్రం తన కెరీర్ తొలి దశలోనే బాలివుడ్ వైపుకు కూడా వెళ్లివచ్చేయడమే కాక, ‘కృష్ణం వందే జగద్గురం’ వంటి విభిన్నమయిన సినిమాలు చేసి అందరిని మెప్పించగలిగాడు. తత్ఫలితంగా విజయానికి, కొత్త ఆలోచనలకి మారు పేరయిన రాజమౌళి వంటి దర్శకుల దృష్టిలో పడి, మరింత విభిన్నమయిన పాత్రలు చేసే అవకాశం దక్కించుకొన్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలారోజుల తరువాత ‘బాహుబలి’ అనే పేరుతొ తయారవుతున్న ఈ జానపద చిత్రంలో రాణాకు అవకాశం దొరకడమే కాక, అందులో ప్రభాస్ కు వ్యతిరేఖంగా ప్రతినాయకుడి పాత్ర పోషించే అవకాశం కూడా దక్కించుకొన్నాడు.
మన తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, స్వర్గీయ యస్వీ.రంగారావు, గుమ్మడి, అక్కినేని,శోభనబాబు, కృష్ణ వంటి వారు మాత్రమే, తమ హీరో ఇమేజ్ ను పక్కన పెట్టి విభిన్నమయిన పాత్రలు పోషించి, ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలను స్వంతం చేసుకోగలిగారు. అయితే, మారిన సామాజిక పరిస్థితుల్లో అటువంటి పాత్రలు చేసే దైర్యం కానీ అవకాశాలు గానీ నేటి హీరోలెవరికీ లేవని చెప్పక తప్పదు. అటువంటి గొప్ప అవకాశం దక్కించుకొన్న దగ్గుబాటి రాణా దానిని సద్వినియోగపరుచుకొంటాడనే ఆశించవచ్చును.
దగ్గుబాటి రాణా ఎటువంటి హీరో ఇమేజ్ తనని కబళించక మునుపే విభిన్నమయిన పాత్రలు పోషించే అవకాశం పొందడం ఆయన అదృష్టం అనే చెప్పాలి. ప్రభాస్, రాణా, అనుష్క, రాజమౌళి నలుగురు కలిసి చేస్తున్న ఈ సినిమా విజయవంతమయితే, మన సినీ పరిశ్రమకి కొత్త నటులు దొరకడమే కాకుండా, మన నిర్మాతలు, హీరోలు దైర్యంగా ప్రయోగాలు చేసేందుకు కూడా అది దోహదపడుతుంది.
ఇక దగ్గుబాటి రాణా ‘బాహుబలి’ జానపద సినిమాతో బాటు, చారిత్రాత్మక సినిమా ‘రాణీ రుద్రమదేవి’ కూడా చేయనున్నాడు. అందులో నిడవర్ద్యపురం ( నిడదవోలు) యువరాజైన చాళుక్య వీరభద్రుడి పాత్ర అతను పోషిస్తున్నాడు.
ఇక, అనుష్క పోషిస్తున్న రాణీ రుద్రమదేవి పాత్ర చుట్టూ తిరగే ఈ సినిమాలో నటించడం రాణాకు నిజంగా కత్తిమీద సామే అవుతుంది. ఎందుకంటే, ఇప్పటికే అరుందతి సినిమా ద్వారా అటువంటి రాజరిక పాత్రలు చేయగల గొప్ప నటిగా నిరూపించుకొన్న అనుష్క, శక్తివంతమయిన రాణీ రుద్రమదేవిగా తెరమీద ఉన్నపుడు ఆమెకు సరితూగేలా నటించడం రాణాకు చాల క్లిష్టమయిన పని అవుతుంది. కనుక దగ్గుబాటి రాణా సినీ ప్రస్థానంలో ఈ రెండు సినిమాలు చాలా కీలకమయినవని చెప్పవచ్చును. అందువల్ల, ఈ సినిమా ద్వారా రాణా తనను తానూ మరో మారు ఆవిష్కరించుకొనే అవకాశం పొందాడు. ‘రాణీ రుద్రమదేవి’ సినిమాకు గుణశేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.