కిరణ్ కుమార్ పై ప్రతిపక్షాల (అ) విశ్వాసం!

 

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం మీరు పెట్టండంటే, ఆ పని మీరే చేయోచ్చుకదా అంటూ ప్రతిపక్షాలన్నీవాదులాడుకొంటుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోబాటు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నవ్వుకొంటున్నారు. జగన్ ఉఫ్ మని ఊదితేనే తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినప్పటికీ, “దమ్ముంటే నా ప్రభుత్వాన్నిపడగొట్టండి” అని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సవాలు విసిరినపట్టికీ, ఏ పార్టీ కూడా దైర్యం చేయలేకపోతున్నాయి.

 

ఎప్పుడు వీలుచిక్కితే అప్పుడు ప్రభుత్వాన్ని దింపేసి, అధికారంలోకి వచ్చేదామని ఆత్ర పడే మన రాజకీయ పార్టీలు అసలు ఇంతమంచి అవకాశం వచ్చినా ఎందుకు వదులుకొంటున్నాయి? బలహీనంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ఎందుకు ఇంతగా వెనకాడుతున్నాయి?

 

నిజం చెప్పుకోవాలంటే ప్రతీ పార్టీకి ఓ కారణం ఉంది. తెలుగుదేశంపార్టీకి, కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఇప్పుడు చేతిలో పనే అయినప్పటికీ, తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నకారణంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి నష్టం కలిగిస్తుందని భావిస్తుండవచ్చును. కేంద్రం తెలంగాణా అంశం తేల్చిన తరువాతనో, తేల్చకుండానో తనంతట తానే ఎన్నికలు తెస్తే, అప్పుడు తెలంగాణాపై తను తీసుకొన్న నిర్ణయం ప్రభావం తన మీద పడకుండా తప్పించుకోవచ్చునని, తెలుగుదేశం పార్టీ కిరణ్ ప్రభుత్వానికి దూరంగా ఉంటోంది.

 

జగన్ మోహన్ రెడ్డికి ఇంతవరకు బెయిలు రానందున ఈ తరుణంలో తమ మద్దతుతో నడుస్తున్న కిరణ్ ప్రభుత్వాన్ని పడగొడితే, తమ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఎన్నికలని ఎదుర్కోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టమే, గనుక తమ నాయకుడు జైలు నుండి విడుదల అయ్యేవరకూ కిరణ్ ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని ఆ పార్టీ కోరుకొంటూ ఉండవచ్చును. కనుక, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయిన మరుక్షణం కిరణ్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ పడగొట్టే అవకాశం ఉంది. (ఈ సంగతి బాగా తెలిసున్నకాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తనకి పరిస్థితులు సానుకూలం అయ్యేవరకు జగన్ మోహన్ రెడ్డిని జైలుకే పరిమితం చేయడం కూడా అనివార్యం అవుతుంది.)

 

ఇక, రాష్ట్రంలోకానీ, కేంద్రంలోగానీ అధికారంలోలేని కారణంగా వెంటనే ఎన్నికలు రావాలని కోరుకొనే భారతీయజనతాపార్టీ కూడా, తమ పార్టీని వచ్చే ఎన్నికలలో నడిపించే నాయకుడి పేరు ఖరారు అయ్యేవరకు, ఎన్నికలకి కొంత సమయం అవసరమని భావిస్తోంది. ఎలాగూ, ఎవరూ అవిశ్వాసం పెట్టే దైర్యం చేయరు గనుక, ఎవరయినా పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని కిషన్ రెడ్డి ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకొన్నారు.

 

కిరణ్ కుమార్ రెడ్డి కూడా తమ అధిష్టానం తెలంగాణా అంశం తెల్చేవరకూ ఎన్నికలు రావాలని కోరుకోవట్లేదు. ఈ సమయంలో ఎన్నికలు వస్తే తమ పార్టీకి లాభం కన్నానష్టమే ఎక్కువని ఆయనకు తెలుసు. అందువల్ల ఈ పరిస్థితులన్నీ బాగా ఎరిగిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవిశ్వాసం పెట్టమని ప్రతిపక్షాలను సవాలు చేసినప్పటికీ, వారు ఆపని చేయలేరని తెలుసు గనుకనే ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దైర్యంగా సవాలు విసురుతున్నారు.

 

ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే దానివల్ల ఏమయినా లాభపడేది ఒక్క తెరాస మాత్రమే. అయితే, తెరాస కూడా సంస్థాగతంగా ఎన్నికలకి పూర్తి స్థాయిలో తయారుకానందున, మరికొంత కాలం పాటు కిరణ్ ప్రభుత్వం కొనసాగడమే మేలని భావిస్తుండవచ్చును. మరి కొంత కాలం కిరణ్ కుమార్ ప్రభుత్వం కొనసాగితే, వచ్చే శాసన సభ సమావేశాల్లో తెలంగాణా అంశంపై మరికొంత గలాటా చేసి కాంగ్రెస్ పరువు తీసి, తమ పార్టీని మరింత బలపరుచుకోవచ్చునని తెరాస ఆలోచన కావచ్చును.

 

ఇక, చివరాఖరుగా చెప్పుకోవలసిన పార్టీ మజ్లిస్. తన ఇద్దరు నేతలు ప్రస్తుత కేసులనుండి విముక్తి పొందడమో, లేక కనీసం ఎన్నికల తంతు పూర్తయ్యేవరకు బెయిలుపై బయట తిరిగే అవకాశం పొందడమో జరిగితే తప్ప, ఎన్నికలకు వెళ్లి ప్రయోజనం లేదని భావిస్తునందున ఆ పార్టీ కూడా అవిశ్వాసంపై వెనకాడుతోందని భావించవచ్చును.

 

ఈవిధంగా ప్రతీ పార్టీకి దేని కారణాలు దానికి ఉండటంతో కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ప్రస్తుతం అవిశ్వాస పరీక్ష ఎదుర్కొనే ప్రమాదం తప్పింది. అయితే, రాజకీయాలలో పరిస్థితులు ఎప్పుడయినా మారిపోయే అవకాశం ఉంది గనుక, కిరణ్ కుమార్ ఇక రోజులు లెక్కబెట్టుకోవచ్చునని చెప్పవచ్చును.