గోవిందరాజస్వామి ఆలయ గోపురంపైకి ఎక్కి హల్ చల్
posted on Jan 3, 2026 8:20AM
మద్యం మత్తులో ఓ వ్యక్తి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో హల్ చల్ చేశాడు. మద్యం తాగి ఆలయంలోకి చొరబడిన ఆ వ్యక్తి ఆలయ గోపురంపైకి ఎక్కి హంగామా చేశాడు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అతడిని కిందకు దించి అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆలయం వద్ద కొద్దిసేపు కలకలం రేగింది.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఏకాంత సేవ అనంతరం గుడి మూసివేసిన విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. ఆలయం గోపురంపైకి ఎక్కిన నినాదాలు చేశాడు.. వెంటనే గమనించిన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతడ్ని కిందకు దిగమని అడిగారు.. అతడు మాత్రం కిందకు దిగేందుకు నిరాకరించాడు. దాదాపు మూడు గంటల పాటూ శ్రమించి అతడ్ని కిందకు దించి అరెస్ట్ చేశారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మద్యం మత్తులో ఆలయం గోపురంపైకి ఎక్కి హల్ చల్ చేసిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని.. మానసిక స్థితి కూడా సరిగా లేదని చెబుతున్నారు. అతడు ఆలయంపైకి తనకు మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని అరుస్తూ నానా హంగామా చేశాడు. విజిలెన్స్, పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించి గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. దీంతో గోవిందరాజస్వామి ఆలయం దగ్గర కొద్దిసేపు హైడ్రామా నడిచింది. అంతేకాదు ఆలయంపై ఉన్న కలశాలను కూడా లాగేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. సీసీకెమెరాలు తనిఖీ చేసి ఆలయంలోకి ఎలా ప్రవేశించాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.