మెక్సికోలో కంపించిన భూమి
posted on Jan 3, 2026 8:44AM
మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. దక్షిణ మెక్సికోలోని గెరెరో రాష్ట్రంలో సంభవించిన ఈ భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు వెల్లడించారు. పసిఫిక్ తీరప్రాంతంలోని ప్రముఖ రిసార్ట్ నగరం అకాపుల్కో సమీపంలో ఉన్న గెరెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ పట్టణం వద్ద భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నారు. భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. నష్టం వివరాలను అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్పందించారు. గెరెరో రాష్ట్ర గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆమె 'ఎక్స్' వేదికగా తెలిపారు. రాజధాని మెక్సికో సిటీలో ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంప తీవ్రతకు భారీ భవనాలు సైతం చిగురుటాకుల్లా ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.