వై దిస్ కోల వెర్రి బొత్స, లగడపాటి?
posted on Nov 1, 2013 @ 2:04PM
ప్రస్తుతం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యాంధ్రతో పోరాటంతో పాటు వారిలో వారు కూడా పోరాటాలు చేసుకొంటూ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఆ పోరాటాలు దేనికోసం?
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్ని వారాల క్రితం విజయనగరంలో తన ఆస్తులపై సమైక్యవాదులు దాడులు చేస్తునప్పుడు “రాష్ట్ర విభజన విషయంలో కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ పెద్దలే తనను తప్పు ద్రోవ పట్టించారని, మళ్ళీ వారే తాను ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాస్తూ విభజనకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రోత్సహించానని ప్రచారం చేస్తూ తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. వారు తన రాజకీయ భవిష్యత్ దెబ్బతీయాలనే ఆవిధంగా కుట్రలు పన్నుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. అయితే ఎవరు కుట్రలు పన్నుతున్నారో మాత్రం చెప్పలేదు.
కానీ దివాకర్ రెడ్డి విషయంలో బొత్స వ్యవహరించిన తీరుని తప్పు పడుతూ లగడపాటి అన్న మాటలతో కనపడని ఈ యుద్ధం వారిద్దరి మధ్యేజరుగుతోందని స్పష్టం అయిపోయింది.
లగడపాటి మీడియాతో మాట్లాడుతూ "కొందరు మమ్మల్ని పార్టీ నుండి బయటకి పొమ్మంటున్నారు. ఎందుకంటే మేము క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నామని చెపుతున్నారు. వ్యక్తులు తమ అభిప్రాయాలను చెప్పడం పార్టీ వ్యతిరేఖం కాదు. అది మన ప్రజాస్వామ్య పద్ధతని తెలుసుకోవాలి. జేసీ దివాకర్ రెడ్డి తాత ముత్తాతల కాలం నుండి అంటే దాదాపు నాలుగు దశాబ్దాల నుండి వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తోంది. అటువంటి కుటుంబానికి చెందిన ఒక సీనియర్ నేతను బయటకి పొమ్మని చెపితే, ముందుగా సదరు వ్యక్తులకే వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారు," అని హెచ్చరించారు.
అయితే వీరిరువురి మధ్య ఈ జగడానికి కారణమేమిటని ఆలోచిస్తే రాష్ట్రం విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి పదవి చెప్పట్టేందుకు జరుగుతున్నా పోటీగా కనబడుతోంది.
లగడపాటి మొదటి నుండి సమైక్యవాదిగా ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. కానీ రాష్ట్ర విభజన అనివార్యమని బహుశః అందరికంటే ఎక్కువ బాగా తెలుసు. గనుక ఆయన దూరదృష్టితో గట్టిగా సమైక్యవాదం పట్టుకొని ముందుకు సాగుతూ నిత్యం మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి పదవికి పరిశీలనకు వచ్చే పేర్లలో అప్పుడు ఆయన పేరే మొదట ఉండే అవకాశం ఉంటుందనే ఈ తాపత్రయమంతా.
ఇక బొత్స తనకి ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకోవడంలో తప్పేమీ లేదని అందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఏనాడో చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాతయినా తన కల నెరవేర్చుకోవాలనుకోవడం సహజం గనుక తన ప్రయత్నాలు తను చేసుకొంటూ ఉండవచ్చును. అటువంటప్పుడు పోటీ దారుల మధ్య ఇటువంటి యుద్దాలు జరగడం కూడా సహజమే.
అయితే కాంగ్రెస్ అధిష్టానం గత కొన్నేళ్లుగా ఎవరూ ఊహించని వ్యక్తులనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడుతోంది. అంటే ఆ ఎవరూ ఊహించలేని వ్యక్తి ఎవరు? పురందేశ్వరా? చిరంజీవా? లేక జగనా? ఊహిస్తూనే ఉండండి.