అంతా భారతి మాయ!
posted on Jul 21, 2022 @ 2:30PM
అమ్మా..దుర్గా.. అని మనసారా స్మరించే సరికి శివాజీకి దుర్గా మాత ఖడ్గం ఇచ్చిందంటారు. రామా నను బ్రోవరా అని త్యాగయ్య వేడుకోగానే రాముడు మారువేషంలో వెళ్లి పరిస్థితులు తెలుసుకుని కరుణించాడు. ఏదేమైనప్పటికీ, భక్తుల కథలు తేల్చినదేమంటే.. అయ్యవారికంటే అమ్మవారి దయే బహు దొడ్డది, జీవితాన్నిస్తుంది, చింత లేకుండా బతికేయమని. ఇలాంటివి ఒట్టి కథలే అంటారు నిరసించేవారు. కానీ ఈ రోజు ల్లోనూ అలాంటి అమ్మవారు, అలాంటి సంపూర్ణ భక్తుడూ మన కళ్లముందే ఉన్నారన్నది చాలా ఆలస్యం గా వెలుగు చూసింది. ఆ అమ్మవారు భారతీ అమ్మవారు.. ఆ భక్తుడు విజయసాయి! అవును దేవర వారు ఏమన్నా, అమ్మవారి పలుకులు ఆంగ్లంలో వచ్చినా దాని వల్ల విజయసాయిరెడ్డి కి మాత్రమే మేలు జరుగుతోంది.
యావత్ భారత దేశంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానలు, కార్యకర్తలకు వారి అధి దేవత సోనియా గాంధీ నే. ఆమె మాటే శాసనం, కాదంటే ఇరకాటమే! ఇపుడు అలాంటి గొప్ప సంప్రదాయం వైసీపీలోనూ ఉంద న్నది కేవలం అనుమానం కాదు వాస్తవమేమో అనిపిస్తుంది. కారణం పార్టీ హైకమాండ్ లా భారతి తెర వెనుక కథ నడుపుతున్నారన్న సంగతి పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. కాకుంటే, పార్టీ వర్గాలు గట్టిగా పైకి చెప్ప లేకపోతున్నాయి. కానీ కీలక ఎత్తుగడలు, నిర్ణయాల్లో ఆమె మాట చెల్లుబాటవుతోందన్న టాక్ ఉంది. తాజాగా విజయసాయిరెడ్డి.. పెద్దల సభ రాజ్యసభలో మళ్లీ సభ్యుడిగా ప్రమాణం చేసిన వీడియోతో పాటు వైయస్ జగన్, వైయస్ భారతమ్మకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ అంశం పై మళ్లీ ఫ్యాన్ నేతల్లో సందేహాలు పెరిగాయి.
ఇటీవల ఉత్తరాంధ్రలో పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించి.. పార్టీలో సాధారణ బాధ్యతలను విజయసాయికి అప్పగించింది తాడేపల్లి ప్యాలెస్‌లోని పార్టీ అధిష్టానం. అలా జరిగిన రెండు మూడు రోజు లకే పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు సైతం విజయసాయిరెడ్డికి దఖలు పడ్డాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జలకు దఖలు పడిన వాటిని మళ్లీ విజయసాయిరెడ్డి చేతు ల్లోకి తీసుకు వెళ్లి మరీ పెట్టారు. ఆ క్రమంలోనే మళ్లీ విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఆటోమెటిక్‌గా రెన్యూవల్ జరిగిపోయింది. ఆ వెంటనే విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా వైయస్ జగన్‌తోపాటు వైయస్ భారతమ్మకు ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో దీనిపై మీడియాలోనే కాదు సోషల్ మీడియాలో సైతం చర్చ రచ్చ రచ్చగా జరిగింది కూడా.
వాస్తవానికి విజయసాయిరెడ్డిని మళ్లీ రాజ్యసభకు పంపరంటూ తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఆయనకి మళ్లీ పెద్దల సభలో సభ్యుడిగా అవకాశం వచ్చింది. ఇదెలా సాధ్యమని చాలా మంది చాలా ఆలోచించారు. అసలు మళ్లీ ఆయన ఎలా చాన్స్ కొట్టే శారంటూ ఓ చర్చ తాడేపల్లి ప్యాలెస్‌లోనే యమ జోరుగా నడిచిందట. మాత దయ ఉంటే ఏదన్నా, ఎలాగైనా జరిగిపోద్దంతే!
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి దాదాపుగా కనుమరుగు అయ్యిపోయారు. అంటే ఉత్త రాంధ్ర భాధ్యతలు చేపట్టి.. విశాఖలోనే మకాం పెట్టేరు. ఆయనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నా రట. ఆ క్రమంలో సదరు వర్గం విశాఖలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయిందట. దీంతో వీరిపై ఫిర్యాదులు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో సీఎం జగన్ రంగంలోకి దిగి విజయాసాయిరెడ్డి.. ఉత్తరాంధ్ర బాధ్యతలకు చెక్ పెట్టి.. తాడేపల్లి ప్యాలెస్‌లో కొలువు చేసుకోవాలంటూ ఆదేశించారట. అలా ఆదేశాలు వెలువడిన రెండు మూడు రోజులకే ప్యాలెస్‌లోని.. పెద్ద అమ్మ గారు తెరపైకి వచ్చి విజయ సాయిరెడ్డికి పూర్వవైభవం కల్పించాలంటూ ఆదేశించారని సమాచారం. అమ్మవారి నుండి.. అదీ సీఎం గారి హోం మినిస్టర్ నుంచి ఆదేశాలు రావడంతో ఇక చేసేది లేక.. అప్పటి కప్పుడు.. యుద్ద ప్రాతిపదికన విజయసాయిరెడ్డివారికి అన్ని కీలక బాధ్యతలు దఖలు పడ్డాయట. ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తాడేపల్లి ప్యాలెస్‌లోని వారంతా.. అంతా భారతీ మాయ అంటున్నారట.
అలాగే మళ్లీ ఎన్నికలు సీజన్ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల్లో అనుకూలురైన వారిని ఎక్కడ ఉంచాలి.. వ్యతిరేకంగా ఉన్న వారికి ఎక్కడ తుంచాలి అనే తరహా మంత్రాంగంలో అమ్మ గారు ప్రస్తుతం నిమగ్నమైనట్లు సమాచారం. ఏదీ ఏమైనా.. తమ గోడు.. అయ్యవారికి చెప్పుకొంటే.. ఆ పని.. కొంతే వరకే జరుగుతోందని.. అదే అమ్మ వారిని ఫలం పుష్పం తోయంతో పాటు అష్టోత్తర శత సహస్ర నామాలతో జపిస్తే.. ఏమి తెలియని కాళిదాసును అమ్మవారు కరుణించి మహాకవిని చేసినట్టు ఈ విజయ సాయిరెడ్డిని మళ్లీ పెద్దల సభకు పంపించారనే ఓ టాక్ అయితే మళ్లీ ఫ్యాన్ పార్టీలో ఫ్యాన్ తిరిగినట్లు గింగరాలు తిరుగుతోందట.