విపక్షాల భేటీ .. తోడికోడళ్ల సమావేశమవుతుందా?
posted on Jul 21, 2022 @ 3:18PM
అత్తింటి ఆరిళ్లను తట్టుకోలేక తోడికోడళ్లంతా సమావేశమయ్యారు వెనకటికి. వారి మధ్య ఘోర విభేదాలన్నీ తిట్లూ శాపనార్ధాలన్నీ ఒక్కింత మరిచిపోయి మనమంతా అక్కచెల్లెళ్లం అత్తమ్మే దుర్మార్గురాలు ఆమె పనిపట్టాల్సిందే అని ఓ పండగ రోజు గుడిలో సమావేశమయ్యారు. దాని ఫలితం ఎలా ఉన్నా గురువారం కాంగ్రెస్ అధినేత సోనియా ఈడీ పిలుపు మేరకు పార్లమెంటులో కాంగ్రెస్ కార్యాలయంలో దాదాపు 13 విపక్షాలు సమావేశమయ్యాయి. ఈ పార్టీల నాయకుల లక్ష్యం మోదీ ప్రభుత్వాన్ని వీలయినంత వెంటనే గద్దె దించే యడం. కానీ అంతకంటే ముందుగా, నిజంగానే వారి మధ్య అంత సఖ్యతనూ చివరంటా కొనసాగిస్తారా లేదా తోడికోడ ళ్లలా ఇంటికెళ్లాక మళ్లీ కధ మొదటికేనా అన్నది చూడాలి. తెలంగాణలో ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్, తెరాసల మధ్య దూరంతగ్గుతోందా అనిపించేలా ఈ భేటీలో తెరాస కూడా పాల్గొంది. పార్లమెంటులోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన భేటీకి టీఆర్ఎస్ ఎంపీలు వెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి ఎన్‌ఫెర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోనియాను విచారణ నిమిత్తం కార్యాలయాలనికి పిలిచిన నేపథ్యంలో విపక్షాల బేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నాయకత్వంలోని కేంద్రం కక్షసాధింపు చర్యగా సోనియాపై ఈడిని ప్రేరేపిస్తోందని విపక్షాలు మోదీ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈడి ని బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు సమావేశం అనంతరం విడు దల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించాయి.
దేశంలో ప్రతిపక్షాలన్నింటిపైనా మోదీ సర్కార్ పనిగట్టుకుని విరుచుకుపడుతోందని, అందుకు ఇన్‌వెస్టి గేటింగ్ సంస్థలన్నింటినీ ఉపయోగించుకుంటోందని మండిపడుతున్నాయి. అనేక పార్టీల ప్రముఖ నాయ కులను పనిగట్టుకుని లక్ష్యంగా చేసుకుని మరీ వేధింపులకు గురిచేస్తున్నారని, ఈ విధంగా వేధిం పులకు గురిచేయడం మరింత కొనసాగిస్తున్నదని విపక్షాలు మండిపడ్డాయి. కేంద్రం దారుణంగా వ్యవహరి స్తోందని దీన్ని విపక్షాలన్నీ కలిసికట్టుగా ఖండించాయి, ఇక ముందుకూడా కేంద్రం ఆటలు సాగనీయ మని విపక్షాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. కేంద్రం చేపడుతున్న ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు సమాజంలో శాంతిభద్రతల నూ విచ్ఛిన్నం చేస్తున్నాయని వారు ఆరోపిచారు.
ఇటువంటి సమావేశాలకు ఇప్పటివరకూ దూరంగానే ఉన్న కేసీర్ నాయకత్వంలోని టీఆర్ ఎస్ పార్టీ మొట్టమొదటి సారిగా సోనియా ఈడీ విచారణకు నిరసనగా జరిగిన భేటీకి హాజరైంది. ఇద్దరి లక్ష్యం బీజేపీకి బుద్ధి చెప్పడమే గనుక కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి టీఆర్ఎస్ హాజరైందని చెప్పవచ్చు.
గురువారం నాటి సమావేశంలో కాంగ్రెస్, డిఎంకె, సిపిఐ-ఎం, సిపిఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎం ఎల్) పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్(జెకెఎన్‌సి), టిఆర్ ఎస్, ఎండిఎంకె, ఎన్‌సిపి, విడుతలై చిరుతైగల్ కచ్చి(విసికె), శివసేన, ఆర్‌జెడి పార్టీల నాయకులు మాత్రం ప్రతిపక్ష నేత కార్యాలయంలో కలవడం గమనార్హం.
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని మధ్యాన్నం తమ కార్యాలయానికి రావలసిందిగా ఇ.డి. సమాచారం పంపింది. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత సంస్థల నాయకులు ర్యాలీగా వెళతా రని సమాచారం. ఇటీవల ఆమె కోవిడ్‌తో బాధపడుతుండడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్సకు చేరారు. ఈ కారణంగా ఆమె ఇ.డి విచారణకు హాజరుకాలేకపోయారు. జూన్ రెండవ వారంలో ఆమె ఆస్పత్రి నుంచి బయటికి రాగానే ఆమెను తమ కార్యాలయానికి రావాలని అనేకపర్యాయాలు ఇ.డి. కోరింది.
అయితే ఆమెను ఇలా తమ కార్యాలయానికి పిలవడం సమంజసం కాదని ఆ విచారణా సంస్థ అధికారులే సోనియా నివాసానికి రావలసిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ ఘెలాట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇ.డి వ్యవహరిస్తున్న తీరు పై మండిపడుతూ ప్రధాని మోదీ, కేంద్రం పట్ల అస హనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం లోపాలను, వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందువల్లనే విపక్షాల మీద మోదీ ప్రభుత్వం ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, బిజెపి నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం ఇడి, సిబిఐ వంటి సంస్థలను తమ స్వార్ధానికి వినియోగించుకుంటోందని, దీన్ని గురించి సభలో చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ గురు వారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్రప్రభుత్వం ఆ సంస్థలను కేవలం విపక్షాలను తొక్కేయడానికి, దేశంలో అసలు విపక్షం అంటూ లేకుండా చేసుకోవడానికి మోదీ ప్రభుత్వం వినియోగిం చుకుంటోందని గోగోయ్ అన్నారు. కేంద్రం వ్యవహారం ప్రజాస్వామ్యానికి ఎంతో హానికరం అని విమర్శిం చారు.