Read more!

గుండె మీద గుదిబండ హైపర్ టెన్షన్!

మనిషిలో ఆందోళన, గందరగోళం, కంగారు ఎక్కువైనప్పుడు చోటు చేసుకునే పరిస్థితి హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అనేది  జబ్బు కాకపోవచ్చు కానీ ఇది చాలా జబ్బులకు దారి తీస్తుంది. మరీ ముఖ్యంగా ఇది  గుండె జబ్బులకు కారణం అవుతుంది! ఈ మధ్య కాలంలో గుండెపోటు వచ్చిందనే విషయం మనం చాలా ఎక్కువగా వింటుంన్నాం. ఇంతకూ గుండెపోటు ఎందుకు వస్తుంది?? ఎలా వస్తుంది??


అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేయడానికి రక్తనాళాలు ఉన్నట్లే గుండెకి రక్తం సరఫరా చేయడానికి 'కరోనరి ఆర్టెరీ' అనే ధమని వుంటుంది. దీంట్లో అడ్డం ఏర్పడితే గుండెకి రక్తం సరఫరా సరిగ్గా జరగదు. దాంతో ఆ భాగం ఆహారం అందక నశిస్తుంది. గుండె, మెదడు కండరాలలోని కణాలు ఒకసారి మరణిస్తే వాటి స్థానంలో మిగతా అవయవాలలోలా క్రొత్తవి ఉత్పత్తి కావు. అందుకని ఒకసారి నష్టం జరిగితే అది శాశ్వత నష్టమే! గుండె కండరాలు దెబ్బతినే సరికి గుండె కొట్టుకోవడం హఠాత్తుగా ఆగిపోతుంది. ఇదే గుండెపోటు రావడం గుండె ఆగితే ఇక ప్రాణం పోయినట్లే..


రక్తప్రసరణ మెదడులోని భాగాలకి సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ భాగాలు దెబ్బతిని క్రమంగా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే అధిక రక్తపోటువల్ల మెదడులోని అతి సన్నని రక్తనాళాల చివర్లు చిట్లి సెరబ్రల్ హెమరేజ్ కలగవచ్చు. ఈ రక్తపోటు వయసు, జాతిల మీద కూడా ఆధారపడి వుంటుంది. మగవాళ్ళలోను, వృద్ధులలోను ఈ అధిక రక్తపోటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి 40 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటినుంచి రక్తపోటు పరీక్షించి, తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రక్తపోటు పెరగడం వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బ తింటాయి. ఒక్కోసారి మూత్రపిండాలకు సరిగా రక్తం అందనప్పుడు, అవి రక్తపోటు పెరగడానికి రెవిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసి రక్తంలో కలుపుతాయి. కాబట్టి మూత్ర పిండాలలోపం వల్ల రక్తపోటు పెరుగుతుంది.


శరీరబరువు పెరగకుండా జాగ్రత్తపడుతుండాలి. ముఖ్యంగా నలభై ఏళ్ళ తర్వాత! ప్రతి కిలో బరువు పెరుగుదలకి గుండె రోజుకి 300 కి.మీ. దూరం ఎక్కువగా రక్తనాళాల ద్వారా రక్తాన్ని ప్రసరింపజేయాల్సి వుంటుంది. అంటే పెరిగే బరువునిబట్టి గుండెమీద భారం పెరుగుతుందన్నమాట! కాబట్టి బరువు తగ్గడం అవసరం!! ఉప్పు, కారం తగ్గించాలి. పొగ త్రాగడం మానాలి. పొగ త్రాగడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. పొగ త్రాగడం వల్ల 80 నుంచి 120 మి.గ్రా. నికోటిన్ ప్రతిరోజు రక్తంలో చేరుతుంది. ఇది ఆర్టెరీస్ ముఖ్యంగా కాళ్ళలో, చేతుల్లో మూసుకుపోయేటట్లు చేస్తుంది. అలాగే గుండె కొట్టుకోవడాన్ని నిముషానికి 72 సార్లు నుంచి 80 సార్లకి పెరిగేలా చేస్తుంది. ఇలా గుండెమీద భారం పెరుగుతుంది!  కేవలం పొగ త్రాగడం వల్ల మాత్రమే కాదు, మద్యం సేవించడం వల్ల కూడా గుండెకు ముప్పు పొంచి ఉంటుంది. 


పైన చెప్పుకున్నవన్నీ మొదట రక్తపోటుకు కారణం అయ్యి అది కాస్తా హైపర్ టెన్షన్ కు దారితీసి గుండె పనితీరు మీద దెబ్బ కొడుతుంది. అందుకే గుండె పనితీరు చక్కగా ఉండాలంటే హైపర్ తేనైన్ కు, రక్త పోటుకు దూరంగా ఉండాలి.


                                     ◆నిశ్శబ్ద.